ఈ–పరేషాన్‌! | E-pass misions ot working in karimnagar peddapalli districts | Sakshi
Sakshi News home page

ఈ–పరేషాన్‌!

Published Tue, Sep 26 2017 12:44 PM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM

E-pass misions ot working in karimnagar peddapalli districts - Sakshi

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రజలు ‘రేషన్‌’ సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈనెల నుంచి ప్రభుత్వం రేషన్‌ సరుకుల పంపిణీకి ఈ–పాస్‌ (ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) విధానాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా ఆయా రేషన్‌ దుకాణాలకు ఈపాస్‌ మిషన్లను అందజేసింది. లబ్ధిదారులు ఈపాస్‌ మిషన్‌పై వేలిముద్ర వేస్తేనే సరుకులను అందజేస్తారు. సర్వర్‌ సమస్యతో మూడురోజులుగా ఈపాస్‌ మిషన్లు మొరాయిస్తుండటంతో లబ్ధిదారులు పండగపూట రేషన్‌ దుకాణాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతుండగా.. అటు డీలర్లు మొరాయిస్తున్న మిషన్లతో గడువులోగా సరుకులు పంపిణీ చేయక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరుకుల పంపిణీలో ఆలస్యం అవుతోంది.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:
పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం నెలనెలా పౌరసరఫరాల దుకాణాల ద్వారా రూపాయికే కిలో బియ్యాన్ని ఒక్కొక్కరికీ (కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి) ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. బియ్యం పంపిణీ ఎంతగా పెరిగిందో.. అదేస్థాయిలో అక్రమాలకూ తావు ఏర్పడింది. రేషన్‌ దుకాణాలకు బియ్యం పూర్తిగా చేరకుండానే.. మిల్లర్లు, వ్యాపారుల దరి చేరుతున్నాయి. ఇలా ప్రతినెలా లారీల కొద్ది బియ్యం పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.

అయినా అక్రమాలను మాత్రం అడ్డుకోలేకపోయింది. చివరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్, ఐపీఎస్‌ అధికారి సీవీ.ఆనంద్‌ నియంత్రణపై దృష్టి సారించారు. హైదరాబాద్‌ నగరంలో ఈ–రేషన్‌ ప్రక్రియకు ఈ ఏడాది మార్చి నుంచి శ్రీకారం చుట్టి.. రేషన్‌ దుకాణాల్లో వేలిముద్రల (ఈ–పాస్‌) యంత్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా రేషన్‌ సరుకుల్లో అక్రమాలను అరికట్టగలిగారు. ఈ ప్రక్రియ అక్కడ విజయవంతం కావడంతో ఇతర జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా అన్ని జిల్లాల్లో కసరత్తు ప్రారంభించింది.

మొరాయిస్తున్న ఈ–పాస్‌  యంత్రాలు.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ 48 శాతమే..
ఉమ్మడి జిల్లాల్లోని రేషన్‌ దుకాణాలలో బయోమెట్రిక్‌ యంత్రాలు, ఈపాస్‌ విధానాన్ని ప్రభుత్వం టెండర్ల ద్వారా ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకు అన్ని దుకాణాలలో యంత్రాలను ఏర్పాటు చేస్తారు. డిసెంబర్‌ నుంచి యంత్రాలు వినియోగంలోకి తేవాలనుకున్నా... ఈనెలనుంచే అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఆహారభద్రత కార్డులోని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు రేషన్‌ దుకాణానికి వచ్చి వేలిముద్ర వేస్తేనే రేషన్‌ సరుకులు ఇస్తారు. తద్వారా బోగస్‌ కార్డులను ఏరివేయవచ్చని, నెలనెలా బియ్యం తీసుకోని కార్డుదారుల బియ్యాన్ని డీలర్లు స్వాహా చేయకుండా అడ్డుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. దీనికితోడు నిజమైన కార్డుదారులకే సరుకులు అందుతాయని భావించారు.

అయితే ఈ విధానంలో సాంకేతిక అంతరాయాలు కలుగుతున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 16 మండలాల లెవెల్‌ స్టాక్‌ పాయింట్ల (ఎంఎల్‌ఎస్‌) నుంచి 1,880 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతినెలా 16,644 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇందులో 1,460 రేషన్‌ దుకాణాల్లో ఈ–పాస్‌ విధానం అమలవుతోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 94,1948 కార్డులు 27,73,996 యూనిట్లపై 16,643.976 టన్నుల బియ్యానికి గాను ఇప్పటివరకు 7,989.108 (48 శాతం) టన్నుల బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. సర్వర్‌ సమస్యతో కొద్దిరోజులుగా ఈ–పాస్‌ మిషన్‌లు మొరాయిస్తుండటమే ఇందుకు కారణంగా అధికారులు చెప్తుండగా.. లబ్ధిదారులు పండగపూట రేషన్‌ దుకాణాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement