మహనేతల మంత్రపురి | P.V Narsimha Rao Hatrick As MLA In Mathani | Sakshi
Sakshi News home page

మహనేతల మంత్రపురి

Published Sat, Nov 10 2018 5:06 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

P.V Narsimha Rao Hatrick As MLA In Mathani  - Sakshi

మంథని.. మంత్రపురిగా పిలుచుకున్న తూర్పు ప్రాంతం. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. గోదావరి పరవళ్లు.. త్రివేణి సంగమ అందాలు... ముక్తీశ్వరుడి దీవెనలు మంథని వాసుల సొంతం.మహామహులు ఏలిన నియోజకవర్గం. ఇక్కడి ప్రజలు ఆదరించిన నేతలు ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. అంతటి పేరున్న మంథని కల్లోల ప్రాంతంగా కూడా ఉంది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న తూర్పుప్రాంతం ఎన్నికల సమయంలో సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించారు. తెలంగాణలోనే విస్తీర్ణంలో అతిపెద్ద నియోజకవర్గంగా మంథనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1952 నుంచి 2014 వరకు ఈ ప్రాంతాన్ని కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలే పాలించారు. ఒకరికి నాలుగుసార్లు పట్టం కట్టగా.. ఇద్దరు హ్యాట్రిక్‌ సాధించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఏళ్లకాలం పాటు మంథనిని పరిపాలించడం కొసమెరుపు. 
– మంథని 

మంథని భౌగోళిక చరిత్ర... 
మంథని 1952లో ఏర్పడింది. మొదటి నుంచి జనరల్‌ నియోజకవర్గంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 13సార్లు ఎన్నికలు జరిగాయి. ఏడు మండలాలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. విస్తీర్ణంలో తెలంగాణలోనే అతిపెద్ద నియోజకవర్గంగా 180కిలోమీటర్ల మేర ఉంది. జిల్లాల పునర్విభజన తరువాత నియోజకవర్గాన్ని రెండుగా చీల్చారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో మంథని, కమాన్‌పూర్, ముత్తారం, రామగిరి(కొత్త మండలం),పాలకుర్తి(2గ్రామాలు) ఉండగా... జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలో కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల(కొత్త మండలం)ను కలిపారు.ఈ ఎన్నికల్లో రెండు జిల్లాల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

2లక్షల మంది ఓటర్లు... 
మంథని నియోజకవర్గంలో 2,1,870 మంది ఓటర్లు ఉన్నారు. 1,00,989 పురుషులు ఉన్నారు. 1,00,860 మంది మహిళలు ఉన్నారు. 21 మంది ఇతర ఓటర్లు నియోజకవర్గంలో ఈ సారి ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉండగా... తరువాత పద్మశాలీలు ఉన్నారు. కాపు ఓట్లు ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయినా  ఇక్కడ బీసీ ఓటర్ల ఆధిపత్యమే కనిపిస్తుంది. నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరగగా... 12 పర్యాయాల్లో బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2014 మొదటిసారిగా బీసీ సామాజికవర్గం నుంచి పుట్ట మధు శాసనసభకు ఎన్నికయ్యారు. 

కాంగ్రెస్‌కు కంచుకోట... 
1952లో మంథని నియోజకవర్గం ఏర్పడింది. పదమూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ పదిసార్లు సత్తాచాటింది. 1952లో సోషలిస్టు పార్టీ అభ్యర్థి గులికోట శ్రీరాములు, 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చందుపట్ల రాంరెడ్డిలు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీని ఓడించి రికార్డు సాధించారు. మిగతా పది పర్యాయాల్లో మంథని ‘హస్త’గతం అయ్యింది. 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలోనూ మంథని ఓటర్లు కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. 1999 నుంచి 2009 వరకు మూడు పర్యాయాలు గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించిన మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్టమధు ఓడించి కాంగ్రెస్‌ జోరుకు బ్రేకులు వేశారు. 

శ్రీపాద ‘హ్యాట్రిక్‌’... 
పీవీ. తరువాత 1978లో సి. నారాయణరెడ్డి కాంగ్రెస్‌(ఐ) నుంచి గెలుపొందారు. తరువాత కాటారం మండలం దన్వాడకు చెందిన దుద్దిళ్ల శ్రీపాదరావు కాంగ్రెస్‌ కంచుకోటను పదిలం చేశారు. ఎన్టీఆర్‌ ప్రభజనంలోనూ మంథని ప్రజలు శ్రీపాదరావుకే పట్టం కట్టారు. 1983 నుంచి 1994 వరకు ఎమ్మెల్యేగా పాలించి హ్యాట్రిక్‌ నమోదు చేశారు. 1991 నుంచి నాలుగేళ్లు శాసనసభాపతిగా పని చేశారు. 1999 ఏప్రిల్‌13న మహదేవ్‌పూర్‌ మండలం అన్నారం అటవీప్రాతం వద్ద శ్రీపాదరావును మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. 


పీవీ... మంథని టు ఢిల్లీ...
అపర చాణక్యుడు, ఆర్థిక సంస్కరణల సృష్టికర్తగా పేరుగాంచిన పీవీ. సర్సింహారావు స్వస్థలం ఉమ్మడి జిల్లాలోని భీమదేవపల్లి మండలం మండలం వంగర అయితే రాజకీయంగా ఓనమాలు దిద్దింది మాత్రం మంథనిలోనే అని చెప్పవచ్చు. 1957 నుంచి 1972వరకు నాలుగు పర్యాయాలు మంథని ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆయన రాష్ట్రమంత్రి వర్గంలో కీలక పదవుల్లో పని చేయడమే కాకుండా 1971లో పీవీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తరువాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల నుంచి ఎంపీగా ఎన్నికై దేశ ప్రధానిగా సేవలందించారు. 


వారసుడొచ్చాడు... 
1994లో చంద్రుపట్ల రాంరెడ్డి టీడీపీ నుంచి గెలుపొందారు. 1999లో శ్రీపాదరావు హత్య తరువాత అతడి వారసుడిగా శ్రీధర్‌బాబు రాజకీయాల్లోకి వచ్చారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి వరుసగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించి ఎదురు లేని నేతగా ఎదిగారు. దివంగత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి కేబినెట్లో ప్రభుత్వ విప్, ఉన్నతవిద్య, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్టమధు గెలుపొంది కాంగ్రెస్‌ కంచుకోటకు బీటలు వేశారు. 

ద్విముఖ పోరు.. 
ఈ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో ద్విముఖపోరు ఉండనుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి పుట్టమధు, కాంగ్రెస్‌ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బరిలో దిగనున్నారు. ఇద్దరి మధ్య హేమాహేమి పోరు జరగనుంది. ఇప్పటికే ఒకరికి మించి ఒకరు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఇమిడి ఉన్న మంథని నియోజకవర్గం ఎన్నికల విధులన్నీ పెద్దపల్లి జిల్లా అధికారులే నిర్వహించడం విశేషం. కేవలం భూపాలపల్లి నుంచి పోలీసు బలగాలను వినియోగించుకోనున్నట్లు సమాచారం.   

ద్విముఖ పోరు.. 
ఈ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో ద్విముఖపోరు ఉండనుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి పుట్టమధు, కాంగ్రెస్‌ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బరిలో దిగనున్నారు. ఇద్దరి మధ్య హేమాహేమి పోరు జరగనుంది. ఇప్పటికే ఒకరికి మించి ఒకరు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఇమిడి ఉన్న మంథని నియోజకవర్గం ఎన్నికల విధులన్నీ పెద్దపల్లి జిల్లా అధికారులే నిర్వహించడం విశేషం. కేవలం భూపాలపల్లి నుంచి పోలీసు బలగాలను వినియోగించుకోనున్నట్లు సమాచారం.   

కల్లోల ప్రాంతంగా... 
మంథని నియోజకవర్గం ఎక్కువశాతం అటవీవిస్తీర్ణం కలిగి ఉంటుంది. మొదటి నుంచి నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంగా పేరుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉధృతంగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఎన్నికలంటే.. అధికారులు.. పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండేవారు. జీ నక్సల్స్‌ పహారా మధ్య ఎన్నికల నిర్వహణ జరిగింది. కేంద్ర పారామిలటరీ, సీఆర్‌పీఎఫ్‌ దళాలు రంగంలో దిగేవి. ఈవీఎంలు, బ్యాలెట్‌బాక్సులను హెలిక్యాప్టర్‌లో చేరవేసేవారు. ఎన్నికల విధులకు వెళ్లిన అధికారులు తిరిగి వచ్చే వరకు అందరిలోనూ ఉత్కంఠ ఉండేది. ఎన్నికలను బహిష్కరించాలనే నక్సల్స్‌ ఎన్నికల సిబ్బంది సైతం అడ్డుకున్న సందర్బాలు అనేకం. అయితే ప్రస్తుత పరిస్థితులు మారాయి. మావోయిస్టు ప్రాబల్యం తగ్గిపోయింది. కానీ పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో అన్నల ప్రభావం ఉండడంతో స్థానికంగా పోలీసులు చర్యలకు పూనుకుంటున్నారు. ఈ సారి నియోజకవర్గంలోని 64మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలను దింపేందుకు ఏర్పాటు చేశారు. 


రోడ్డు వచ్చింది.. 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో రోడ్డు సౌకర్యం మొరుగుపడింది. తాడిచర్ల మానేరు నుంచి పెదతూండ్ల కిషన్‌రావుపల్లి వరకు డబుల్‌ రోడ్డు, చినతూండ్ల నుంచి  శాత్రాజ్‌పల్లి వరకు లింక్‌ రోడ్డులను, బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టి గ్రామస్తులకు దూర భారాన్ని తగ్గించింది. ప్రజల చిరకాలవాంచ అయిన ఖమ్మరవపల్లి బిడ్జి మంజూరు చేసి పనులు ప్రారంభించింది. తాడిచర్ల నాగులమ్మ వరకు డబుల్‌ రోడ్డు నిర్మించారు. 
– రామిడి సురేశ్, తాడిచర్ల 

అభివృద్ధి జరిగింది..  
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆసరా పించన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు అందిస్తున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా పోయింది. మహదేవ్‌పూర్‌– పలిమెల మండలాలకు బీటీరోడ్డు వేయడంతో పాటు వాగులపైన వంతెనలు నిర్మిస్తున్నారు. దీంతో ప్రతిపల్లెకు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. 
– చాగర్ల రవీందర్, మహదేవపూర్‌ 

పథకాలు అమలు కాలేదు.. 
పథకాల అమలులో అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మారుమూల పల్లెల్లో పూర్తిస్థాయిలోచేరలేదు. దీంతో సమాన్యుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. తెలంగాణ సర్కారు అందించిన వివిధ రకాల పథకాలు సామాన్యుడికి చేరకపోవడంతో ఇబ్బందులు పడాల్సివస్తోంది.

– రాజునాయక్, ప్రేమ్‌నగర్, మంథని   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement