ఇల్లందకుంట(హుజూరాబాద్): ‘చావనైనా చస్తా గానీ, సీఎం కేసీఆర్‌కు మాత్రం లొంగేది లేదు’అని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ‘మా ఓటు మా వాడికే వేయాల’ని ప్రతి గ్రామంలోని ప్రజలు నినదిస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని రామన్నపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ఈటల ప్రచారం నిర్వహించారు. ఆయనకు బతుకమ్మలు, మంగళహారతులతో మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈటల మాట్లాడుతూ తాను జీవించి ఉన్నంతకాలం కేసీఆర్‌పై పోరాటం చేస్తానని, డబ్బుకు ఓట్లు వేస్తారనే చిల్లర ఆలోచనతో కేసీఆర్ ఉన్నారని, ప్రజలు ఈ నెల 30న ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
ప్రజలకు కేసీఆర్ ఇస్తున్న సొమ్ము భూమి అమ్మినవో.. చెమటోడ్చి సంపాందించినవో కావని, అదంతా ప్రజాధనమేనని అన్నారు. బండి నీడన వెళ్తున్న కుక్క.. తానే బండిని లాగుతున్నట్లు భావిస్తుందని, కేసీఆర్ కూడా అదే భ్రమలో ఉన్నారని ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో గెలిస్తే కేసీఆర్ నిరంకుశత్వం, అహంకారం నాశనమవుతుందని పేర్కొన్నారు. ప్రజల వల్లే కేసీఆర్ బతుకుతున్నారని, ఆయన మాత్రం ప్రజలను బతికిస్తున్నాననే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రి హరీశ్‌రావు తనపై కరపత్రాలు, పోస్టర్లు ముద్రించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్‌కు తెలంగాణలో ఎంతపేరు ఉందో తాను కూడా ఆ స్థాయిలో కష్టపడి పేరు సంపాదించుకున్న బిడ్డనని, తెలంగాణ చిత్రపటంపై ముద్ర వేసుకున్నానని, అందుకే దానిని పీకేద్దామని కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎర్రం రాజు సురేందర్ రాజు, శీలం శ్రీనివాస్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment