సాక్షి, కరీంనగర్: ‘పట్టణ ప్రగతి’ పనుల పేరిట ప్రజల సొమ్ము కాజేసేందుకు కరీంనగర్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు స్కెచ్ వేశారు. ఇందుకోసం వాహనాల నంబర్లనే తారుమారు చేశారు. జేసీబీ నంబర్ల స్థానంలో తమకు తోచిన ద్విచక్రవాహనాల నంబర్లు.. ట్రాక్టర్ల నంబర్ల స్థానంలో కనిపించిన ఆటో నంబర్ రాసి బిల్లుల కోసం ఫైళ్లు పెట్టారు. అన్నీ సరిచూసుకుని సంతకం చేయాల్సిన కమిషనర్ ఏమీ పట్టించుకోకుండా సంతకం చేసేశారు. చివరకు ఆడిటింగ్ అధికారుల వద్ద అసలు బాగోతం బయటపడింది.
ఖాళీ స్థలాల చదును పేరిట..
పట్టణాల్లోని మురికివాడలు, వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతీ మున్సిపాలిటీకి ప్రతీనెల నిధులు కేటాయిస్తోంది. పట్టణప్రగతి కార్యక్రమం ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి పట్టణాల్లో దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం కావాలని, పారిశుధ్యం మెరుగుపడాలని ఆదేశించారు.
5.9 ఎకరాలు శుభ్రం చేశామని..
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 2020, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పలు సమస్యలు గుర్తించారు. పరిష్కారానికి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా చెత్త, మురికినీరు నిలిచిన ఖాళీ స్థలాలను శుభ్రం చేయాలని నిర్ణయించారు. ఈమేరకు 60 డివిజన్లలో కలిపి 5.9 ఎకరాల విస్తీర్ణంలోని మూడువేలకుపైగా ఖాళీ స్థలాలను గుర్తించినట్లు ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. వీటిని శుభ్రం చేసేందుకు నిత్యం 25పైగా జేసీబీలు, 40కుపైగా బ్లేడ్ ట్రాక్టర్లు, లోడింగ్ ట్రాక్టర్లు వినియోగించామని రికార్డులు నమోదు చేశారు.
జేసీబీ స్థానంలో బైక్.. ట్రాక్టర్ల స్థానంలో ఆటోల నంబర్లు..
పది రోజులు నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఖాళీ స్థలాలు శుభ్రం చేసేందుకు 150 జేసీబీలు, 200 ట్రా క్టర్లు ఉపయోగించినట్లు లెక్క తేల్చారు. 60 డివిజన్లలో 5.96 ఎకరాల ఖాళీ స్థలాల క్లీనింగ్‌కు రూ.40 లక్షలు ఖర్చయినట్లు లెక్కలు వేశారు. వాహనాల బిల్లుల కోసం రూ.5 లక్షలకు ఒక ఫైల్ చొప్పన 8 ఫైళ్లు సిద్ధం చేశారు. ఇందులో జేసీబీలు, బ్లేడ్ ట్రాక్టర్లు, లోడింగ్ ట్రాక్టర్లు ఏ రోజు ఎన్ని వినియోగించారు. ఎక్కడెక్కడ పనులు చేయించారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో వివరాలు నమోదు చేశారు. ఇక్కడే అధికారులు ‘తప్పు’లో కాలేశారు. జేసీబీ, ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్ల స్థానంలో తమ కంటికి కనిపించిన బైకులు, ఆటోలు నంబర్లు నమోదు చేశారు. 150 జేసీబీల స్థానంలో 10 బైక్ నంబర్లు నమోదు చేసి వాటితో మళ్లీమళ్లీ పనులు చేయించినట్లు రికార్డులు రూపొందించారు. అలాగే 200 బ్లేడ్, లోడింగ్ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్ల స్థానంలో సుమారు 25 ఆటోలు, బైక్ రిజిస్ట్రేషన్ నంబర్లు వేశారు.
విధుల్లో లేని అధికారుల సంతకాలు..
ఖాళీ స్థలాలు శుభ్రం చేసే పనులు నిర్వహించే సమయంలో అసలు విధుల్లో లేని ఇద్దరు అధికారులు రూ.40 లక్షల బిల్లులకు సబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. పట్టణ ప్రగతి సమయంలో సంతకాలు చేసిన ఏఈలు ఇతర మున్సిపాలిటీల్లో ఇన్‌చార్జీలుగా విధులు నిర్వర్తించారు. అయినా బిల్లుల ఫైళ్లపై సదరు ఏఈలతో సంతకాలు చేయించారు. నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు అంతా తామై నడిపించారని తెలిసింది. తర్వాత వివరాలు సరిచూసుకోకుండానే డీఈలు, ఈఈలు సంతకాలు చేసి ఫైళ్లను కమిషనర్‌కు పంపించారు.
గుడ్డిగా సంతకం చేసిన కమిషనర్..
‘పట్టణ ప్రగతి’లో భాగంగా చేపట్టిన పనులకు నిధుల కొరత ఉండొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం కరీంనగర్ కార్పొరేషన్‌కు నెలకు రూ.2.44 కోట్లు మంజూరు చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు రూ.17.09 కోట్లు మంజూరు చేసింది. ఈక్రమంలో 5.96 ఏకరాల్లోని ఖాళీ స్థలాలను శుభ్రం చేసినందుకు ఈ నిధుల నుంచి రూ.40 లక్షల బిల్లులు మంజూరు చేయాలని వచ్చిన 8 ఫైళ్లను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎన్ని వాహనాలు వాడారు. ఎన్ని గంటలు పనిచేశాయి. వాహనాలు ఎక్కడెక్కడి నుంచి తెప్పించారు. నమోదు చేసిన వివరాలన్నీ సరైనవా కావా అని క్రాస్ చెక్ చేయాలి. అనుమానం వస్తే క్షేత్రస్థాయిలో కూడా పరిశీ లించాలి. కానీ కరీంనగర్ కమిషనర్ ఇవేవీ పట్టించుకోలేదు. గుడ్డిగా బిల్లుల మంజూరుకు వచ్చిన ఫైళ్లపై వేగంగా సంతకం చేసి బిల్లుల మంజూరుకు అకౌంట్ అధికారులకు అటునుంచి ఆడిటింగ్ అధికారులకు పంపించారు.
ఆడిటింగ్‌లో గుట్టు రట్టు..
ఆడిటింగ్ సమయంలో ఫైళ్లు తనిఖీ చేస్తున్న అధికారులకు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లపై అనుమానం వచ్చింది. దీంతో విచారణ చేపట్టారు. రవాణా శాఖ పోర్టల్‌లో జేసీబీ, ట్రాక్టర్ల నంబర్లు సరిచూసుకుని కంగుతిన్నారు. జేసీబీ, బ్లేడ్, లోడింగ్ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ల నంబర్ల స్థానంలో బైక్, ఆటోల నంబర్లు దర్శనం ఇచ్చాయి. బైకులు, ఆటోలతో పనిచేయించారా అని ఆడిటింగ్ అధికారులు అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించి న కమిషనర్ ఫైళ్లను తిప్పి పంపమని సూచించడంతో ఆడిటింగ్ అధికారులు అకౌంట్ అధికారులకు అటు నుంచి ఇంజినీరింగ్ విభాగానికి ఫైళ్లు రిటర్న్ చేశారు.
ఆ ఫైళ్లు.. ఆగమేఘాలపై..
కరీంనగర్ కార్పొరేషన్‌లో సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల బిల్లులకు సబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. వీటిలో చాలా వరకూ చిన్నచిన్న కారణాలతో పెండింగ్‌లో పెట్టారని సమాచారం. పట్టణ ప్రగతిలో పనిచేసిన వాహనాల బిల్లుల ఫైళ్లు మాత్రం ఆగమేఘాలపై రూపొందించారు. అంతే వేగంగా ఏఈలు, డీఈలు, ఈఈలు ఫైళ్లపై సంతకాలు చేశారు. కమిషనర్ కూడా ఎలాంటి క్రాస్ చెక్ చేసుకోకుండా సంతకం చేసి అకౌంటింగ్, ఆడిటింగ్ అధికారులకు పంపించారు. చిన్నచిన్న కారణాలతో కోట్లలో బిల్లులు ఉన్న ఫైళ్లు పెండింగ్‌లో ఉండగా, రూ.40 లక్షల బిల్లుల ఫైల్ వేగంగా కదలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఫైళ్లు వేగంగా అకౌంటింగ్ అధికారుల వరకు చేరినట్లు తెలుస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లే తప్పుగా నమోదు చేసి తప్పుడు ఫైలింగ్ చేసినా ఇప్పటి వరకు కనీసం విచారణ చేపట్టకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కాగా సదరు ఫైళ్లలో తప్పులను సరిచేసి మళ్లీ బిల్లులు డ్రా చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment