మాయాలోకపు జీవన నైపుణ్యాలు | Sakshi Guest Column On Fraud Life Skills | Sakshi
Sakshi News home page

మాయాలోకపు జీవన నైపుణ్యాలు

Published Mon, Aug 12 2024 5:34 AM | Last Updated on Mon, Aug 12 2024 5:35 AM

Sakshi Guest Column On Fraud Life Skills

కామెంట్‌

మోసం ఏ రూపంలోనైనా మనల్ని మాయలో పడేసే లోకంలో జీవిస్తున్నాం! ఒకరికి ఒకరం ఎన్ని జాగ్రత్తలు చెప్పుకుని మోసపోవటం అన్నది ఎప్పుడూ కొత్తగా జరుగుతుంది. కాలింగ్‌ బెల్‌ కొడతారు. ఫలానా కంపెనీ నుంచి వచ్చాం అంటారు. మనల్ని బుట్టలో పడేసి, ‘సర్దుకుని’ వెళ్లిపోతారు... ఇదొక రకం మోసం! ఎవరో ఒక పెద్ద కంపెనీ నుంచి ఫోన్‌ చేస్తారు. మీరు ఫారిన్‌ ట్రిప్‌కి ఎంపికయ్యారని చెబుతారు. ఫలానా చోటుకు రమ్మంటారు. వెళ్లాక అక్కడ మనల్ని పెద్ద వెంచర్‌లో ఇరికించేస్తారు... ఇది ఇంకో రకం మోసం! ఇక ఓటీపీ మోసాలైతే ఏ మార్గంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయో అంతే పట్టదు. అనుక్షణం జాగ్రత్తగా ఉండటం, ప్రతిదాన్నీ అనుమానించటం జీవితానికి ఇప్పుడు అవసరమైన నైపుణ్యాలు అయ్యాయి!

వాట్సాప్‌లో తరచూ మిమ్మల్ని హెచ్చరిస్తూ వస్తుండే సందేశాల వంటిదే ఇది. గడప గడపకూ తిరిగే సేల్స్‌మెన్‌తో జాగ్రత్త, రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసే కంపెనీల ఆకర్షణీయమైన ఆఫర్‌ల ఎరకు చిక్కుకోకండి, బ్యాంకు నుండి ఫోన్‌ చేస్తున్నామని చెప్పి మిమ్మల్ని మీ క్రెడిట్‌ కార్డు పిన్‌ నెంబర్‌ అడిగితే ఇవ్వకండి... అంటూ అప్రమత్తం చేసే మెసేజ్‌లు నాకు నిరంతరం వస్తూనే ఉంటాయి. మీక్కూడా వస్తుంటాయని కచ్చి తంగా చెప్పగలను. అలా వారు ఒక హెచ్చరికగా తప్పించాలనుకున్న సంఘటన గతవారం నా సోదరి కిరణ్‌ విషయంలో జరిగింది. 

శనివారం మధ్యాహ్నం ఆమె ఇంటి కాలింగ్‌ బెల్‌ మోగింది. వెళ్లి తలుపు తీయగానే ద్వారం ముందు ముగ్గురు వ్యక్తులు కనిపించారు. తాము ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌ (ఐజీఎల్‌) ఇంజినీర్లమని చెప్పు కున్నారు. గ్యాస్‌ కనెక్షన్‌ను పరిశీలించేందుకు వచ్చామని చెప్పారు. అదృష్టవశాత్తూ వారిని గుర్తింపు కార్డులు అడగాలన్న ఆలోచన కిరణ్‌కు వచ్చింది. వాళ్లవి చూపించినప్పటికీ, నేననుకోవటం అవి నకిలీవి అయుంటాయని. ఆమె తెలివిగా ఇంకో పని చేసింది. ఆ ఐడీ కార్టులను ఫొటో తీసుకుంది. వారి ఫోన్‌ నెంబర్‌లను అడిగి రాసుకుంది. అందుకు వాళ్లు కంగు తిన్నప్పటికీ వాళ్ల ఆత్మవిశ్వాసం ఏ మాత్రం సడలలేదు. 

కిరణ్‌... వాళ్లని వంటింట్లోకి తీసుకొని వెళ్లారు. కానీ, ఇంట్లో పనిమనుషులు కూడా వాళ్లతో పాటు అక్కడ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఆ ముగ్గురు వ్యక్తులు గ్యాస్‌ పైపులను ‘తనిఖీ’ చేసి, ఆ పైపులలో ఒకటి వారెంటీ గడువును దాటేసింది కనుక దానిని మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. అందుకు కిరణ్, ‘మాది పాతబడిపోతే మిగతా ఫ్లాట్‌లో ఉన్నవాళ్లవీ పాతబడి ఉండాలి కదా! మా గ్యాస్‌ కనెక్షన్‌లన్నీ ఒకేసారి బిగించినవి’ అని వారితో అన్నారు. 

ఆ మాటకు, ఆ ముగ్గురిలో సీనియర్‌ ఇంజినీర్‌నని చెప్పుకున్న వ్యక్తి ఏ మాత్రం వెరపు లేకుండా పక్క ఫ్లాట్‌లో చెక్‌ చేసి వస్తానని చెప్పి వెళ్లాడు. కొన్ని నిమిషాల తర్వాత తిరిగొచ్చి, ‘వాళ్ల పైప్‌ బాగానే ఉంది. కొత్తది మార్చి ఉంటారు, మీక్కూడ కొత్తది వెయ్యవలసిన అవసరం ఉంది’ అని కిరణ్‌తో చెప్పాడు. 

ఆ ముగ్గురు వ్యక్తులు పైప్‌ను మార్చే పని ప్రారంభించగానే కిరణ్‌ తన దగ్గరున్న ఐజీఎల్‌ నెంబర్‌లకు మెసేజ్‌ చేయటం మొదలు పెట్టారు. ‘పైపును మార్చాలని, మా ఇంజినీర్లను పంపిస్తున్నామని’ ఐజీఎల్‌ తనకు ముందే సమాచారం ఇవ్వకపోవటం పట్ల కిరణ్‌ విసుగ్గా ఉన్నారు. పది, పదిహేను, ఇంకా ఎక్కువ నెంబర్‌లకే ఆమె మెసేజ్‌ పెట్టి ఉంటారు. వాటిల్లో ఒకటి ఐజీఎల్‌ పూర్వపు సీఈవోది అన్నట్లు ఆమెకు గుర్తు.  

ఆ నెంబర్‌ల నుండి రిప్లయ్‌లు రావటానికి మరీ అంత సమయం ఏమీ పట్టలేదు. ఆ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఐజీఎల్‌ పంపినవారు కాదు! వారు మోసగాళ్లు. అంతకన్నా కూడా, ‘వాళ్లను పైపులు మార్చనివ్వకండి’ అని, ‘ఐజీఎల్‌ సిబ్బంది ముసుగులో కొందరు మోసాలకు పాల్పడుతున్నార’ని హెచ్చరిస్తూ ఐజీఎల్‌ నంబర్లలో కొన్నింటి నుంచి కిరణ్‌కు వాట్సాప్‌ మెసేజ్‌లు వచ్చాయి. ఆ మను షుల్ని తక్షణం బయటికి పంపించేయండి అన్నది వారి నుంచి వచ్చిన స్పష్టమైన సందేశం. నిజంగానే వాళ్లు మోసగాళ్లు! 

కానీ అప్పటికే వారు పైపును తొలగించి, దాని స్థానంలో మరొక పైపును బిగించారు. చిత్రంగా వాళ్లు ఆ పనికి డబ్బులు అడగలేదు. పైగా వెళ్లిపోయే తొందరలో ఉన్నట్లు కనిపించారు. బహుశా కిరణ్‌ ఐజీఎల్‌ వాళ్లతో మాట్లాడినందువల్ల భయపడినట్లున్నారు. తదుపరి గ్యాసు బిల్లులో పైపు మార్పిడి చార్జీలు కలిసి ఉంటాయని చెప్పి బయల్దేరుతూ, అనుకోకుండా కందెన అంటిన ఒక ఫోల్డర్‌ను అక్కడ వదిలి వెళ్లారు.  

ఈలోపు ఐజీఎల్‌ కంపెనీ వాళ్లు కిరణ్‌కి ఫోన్‌ చేసి, తక్షణం తమ ఇంజనీర్లను ఆమె ఇంటికి పంపుతున్నట్లు చెప్పారు. నిజానికి పూర్వపు సీఈఓ నెంబరు అయివుండవచ్చని మెసేజ్‌ ఇవ్వటం ద్వారా ఆమె చేసిన ప్రత్యేక ప్రయత్నం ఐజీఎల్‌ సొంత ఇంజనీర్‌లు – మెక్‌ కాయ్‌ కంపెనీ వాళ్లు – వీలైనంత త్వరగా ఆమె ఇంటికి చేరుకుని, ఆ మోసగాళ్లు బిగించి వెళ్లిన కొత్త పైప్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించటాన్ని సాధ్యం చేసింది.
 
మొత్తానికి మోసం జరగబోయిందన్నది స్పష్టం. కిరణ్‌ వసంత్‌ విహార్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కి ఫోన్‌ చేసిన వెంటనే ఆయన తమ పోలీసులను పంపారు. ఆఫీసర్‌ స్పందన నిజాయితీగా, చురుకుగా, సౌమ్యంగా ఉందని కిరణ్‌ చెప్పారు. ఆ ముగ్గురు మోసగాళ్లు తమ ‘పని’ పూర్తి చేసి వెళ్లిన కొద్దిసేపటికే ఐజీఎల్‌ ఇంజినీర్లు, పోలీసులు దాదాపుగా ఒకేసారి అక్కడికి చేరుకున్నారు. 

మార్చిన పైపు నకిలీది అవటమే కాకుండా, దాని దిగువ భాగం సరిగా బిగించి లేదని ఐజీఎల్‌ ఇంజనీర్లు కిరణ్‌కు చెప్పారు.
అంటే ఒకవేళ గ్యాస్‌ స్విచ్‌ ఆన్‌ చేసి ఉంటే లీక్‌ అయుండేది.

కిరణ్‌ ఫొటో తీసిన గుర్తింపు కార్డుల్ని, ఆ మోసగాళ్లు వదిలి వెళ్లిన ఫోల్డర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి కిరణ్‌ తీసుకున్న ఫోన్‌ నెంబర్‌లను బట్టి వారిని కనిపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఆ విధంగా 90 నిమిషాల వ్యవధిలో పరిస్థితి చక్కబడి, నష్టం జరగకుండా ఆగింది. ఇందుకు విరుద్ధంగా జరిగి ఉంటే కిరణ్‌ దాని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు అది మరింత దారుణమైన పరిస్థితిగా ఉండేది. అదృష్టవంతురాలు. అలా జరగలేదు.   

మూడు విషయాలను ఆమెను రక్షించాయని నేను అంటాను.  గుర్తింపు కార్డులను ఫొటో తీసుకోవటం, వాళ్ల ఫోన్‌ నెంబర్లను అడిగి తీసుకోవటం, ‘మీ ఇంజినీర్లను పంపిస్తున్నట్లు ముందుగా నాకెందుకు సమాచారం ఇవ్వలేద’ని ఐజీఎల్‌ వాళ్లను ఆమె అడగటం! అన్నిటి కన్నా ముఖ్యంగా ఆ మోసగాళ్లు ‘పాడైపోయిన’ పైపును మార్చే ‘పని’ మీద ఉన్నప్పుడు తన ఇంట్లో పని చేసేవాళ్లు కూడా అక్కడ ఉండేలా జాగ్రత్త పడటం. ఒకవేళ ఆమె ఇవేవీ చేయకపోయుంటే?


కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement