ప్రేమించిన యువకుడి ఇంట్లో బాలిక తిష్ట
పోలీసులకు ఫిర్యాదు.. సఖి సెంటర్‌కు తరలింపు
బషీరాబాద్: పదహారేళ్ల బాలిక తాను ప్రేమించిన యువకుడితో వివాహం చేయాలని తల్లితో గొడవకు దిగింది. ఇప్పుడే పెళ్లి ఏంటని తల్లి మందలించడంతో.. నేరుగా తాను ఇష్టపడ్డ యువకుడి ఇంటికి వెళ్లింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బషీరాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదివి, ప్రస్తుతం టైలరింగ్ చేస్తోంది. ఇదే ఊరికి చెందిన ప్రశాంత్(21) అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇదే విషయాన్ని సదరు బాలిక గత మంగళవారం తల్లి లక్ష్మికి తెలియజేసింది. దీంతో ‘తండ్రిలేని బిడ్డవు.. ఇంకా నీకు పెళ్లి వయసు రాలేదు.. కొంత కాలం ఆగు బిడ్డా’ అని సముదాయించింది. ఇది నచ్చని బాలిక తల్లితో వాగ్వాదానికి దిగింది. నువ్వు చేయకపోతే నేనే చేసుకుంటా అని చెప్పి ప్రశాంత్ ఇంటికి వెళ్లింది. ఈ ఘటనతో అబ్బాయి కుటుంబ సభ్యులు సైతం నిర్ఘాంతపోయారు. బాలిక తల్లి చైల్డ్‌లైన్ 1098కు కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది. బుధవారం ఉధయం బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కూతురు పెళ్లిని అడ్డుకోవాలని కోరింది.
తన బిడ్డను మందలిస్తే ప్రశాంత్ తనను బెదిరించాడని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై జిల్లా బాలల హక్కుల పరిరక్షణ విభాగం లీగల్ అధికారి నరేష్, ఎస్‌ఐ గఫార్ సిబ్బందితో యువకుడి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అనంతరం పోలీసులు ప్రశాంత్‌ను పీఎస్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చెల్లదని, చట్టప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. పద్దెనిమిదేళ్లు ఏళ్లు నిండిన తర్వాత అదే యువకుడితో పెళ్లి చేస్తామని బాలికకు భరోసా ఇచ్చారు. అప్పటి వరకు చదువుకోవాలని వికారాబాద్‌లోని సఖి కేంద్రానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment