సాక్షి, ధర్మపురి : మతిస్థిమితం సరిగా లేక కష్టాల్లో ఉన్న బాలికను చేరదీసి మానవత్వమింకా బతికే ఉందని నిరూపించారు. అభం శుభం తెలియని అనాథ యువతిని ఐసీడీఎస్ అధికారులు చేరదీసి తమ ఆధీనంలోకి తీసుకున్న సంఘటన మండలంలోని కమలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఒడ్డేటి శంకరయ్య–గంగవ్వ దంపతులకు సుమలత, మంజుల సంతానం. పదేళ్ల క్రితం తల్లిదండ్రులిద్దరూ మరణించారు. దీంతో సుమలత, మంజుల అనాథలయ్యారు. పెద్ద కూతురు సుమలత మతిస్థిమితం సరిగా లేక మంచానికే పరిమితమైంది.
అక్క భారమంతా చెల్లె మంజులపై పడింది. అక్కను సాకడానికి చెల్లి కూలీ పని చేస్తూ నెట్టుకొస్తుంది. పెళ్లీడుకొచ్చిన చెల్లెకు ఇటీవల గ్రామస్తులు చందాలు పోగుచేసి పెళ్లిచేసి అత్తారింటికి పంపించారు. దీంతో అక్క ఒంటరిగా మిగిలిపోయింది. మతిస్థిమితం సరిగా లేని అక్క సుమలతకు నా అనేవారు కరువయ్యారు. ఒక వైపు తల్లిదండ్రులు లేక మరోవైపు చెల్లె పెళ్లి చేసుకొని వెళ్లగా ఒంటరిగా ఉండిపోయింది. చిప్పిరి జుట్టు, చినిగిన దుస్తులతో కడుపుకు అన్నం లేక బాధితురాలి బతుకు అగమ్యగోచరంగా తయారైంది.
చేరదీసిన ఐసీడీఎస్ అధికారులు..
ఐసీడీఎస్ సీడీపీవో అధికారులకు సుమలత దీనగాథను సర్పంచ్ లక్ష్మి తెలియజేసింది. డీడబ్ల్యూవో నరేందర్, పీడీల ఆదేశాలతో సూపర్‌వైజర్ జయప్రద సోమవారం గ్రామాన్ని సందర్శించి అనాథ యువతిని చేరదీశారు. చిప్పిరి జుట్టును కత్తిరించి, స్నానం చేయించి శుభ్రం చేయించారు. బాధితురాలి ఆరోగ్యపరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించి మందులు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సుమలత బాగుకోసం గ్రామస్తుల సహకారంతో హైదరాబాద్‌లోని సఖీ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ నరేశ్, నాయకులు ప్రసాద్, నాగరాజు గ్రామస్తులు తదితరులున్నారు. యువతిని చేరదీస్తున్న ఐసీడీఎస్ అధికారి.
Comments
Please login to add a commentAdd a comment