CDPO
-
ఏసీబీ దర్యాప్తు.. సీడీపీవో ఆఫీసర్ శ్రీదేవి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నిధుల దుర్వినియోగం వ్యవహారంలో.. సిటీ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారిణి అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అరెస్టు చేసింది. కరీంనగర్ కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్‌లో గతంలో సీడీపీవోగా పనిచేసిన సమయంలో శ్రీదేవి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. 322 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించారు. ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చులపై నకిలీ ఇండెంట్లను సృష్టించి నగదు కాజేసినట్లు దర్యాప్తులో తేల్చారు. -
రూ.50 వేలు తీసుకుని కూతరినే అమ్మేశాడు!
సాక్షి, పలమనేరు : ఓ తండ్రి తన కుమార్తెను అమ్మేశాడు. రూ.50 వేలు తీసుకుని ముక్కుపచ్చలారని పన్నెండేళ్ల బాలికను 36 ఏళ్ల వ్యక్తి వెంట పంపించేశాడు. అతను ఆ బాలికను వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన పెద్దపంజాణి మండలం ముదరంపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన జోగి వెంకటరమణ పందులు పెంచుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అతనికి నలుగురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. మూడో కుమార్తె (12) ఐదో తరగతి వరకు చదివి ఇంటివద్దే ఉంటోంది. బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లికి చెందిన సురేష్ (36) గతంలో వెంకటరమణ పెద్ద కుమార్తెను వివాహం చేసుకుంటానని అడిగాడు. అతను నిరాకరించడంతో కొన్నాళ్ల తరువాత రెండో కుమార్తెను వివాహం చేసుకుంటానని అడిగాడు. అది కూడా కుదరకపోవడంతో మూడో కుమార్తెనైనా తనకిచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టాడు. వెంకటరమణ నిరాకరించడంతో తానే రూ.50 వేలు ఎదురు కట్నం ఇస్తానని ఆశచూపాడు. దీంతో అంగీకరించిన బాలిక తండ్రి నాలుగురోజుల క్రితం పెళ్లికి రంగం సిద్ధం చేశాడు. డబ్బులు తీసుకుని కుమార్తెను సురేష్‌కి ఇచ్చి రహస్యంగా పెళ్లి చేయాలని చూశాడు. గ్రామస్తులు పెద్దపంజాణి పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాలిక తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనారిటీ తీరేవరకు వివాహం చేయనని వెంకటరమణ నుంచి స్టేట్మెంట్ తీసుకుని పంపించేశారు. డబ్బులు తీసుకుని పెళ్లి వాయిదా వేస్తే ఇబ్బంది వస్తుందని భావించిన వెంకటరమణ శనివారం ఉదయం తన కుమార్తెను సురేష్ వెంట పంపించేశాడు. బాలికను చప్పిడిపల్లి తీసుకెళ్లిన సురేష్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వివాహం చేసుకున్నట్లు సమాచారం. గ్రామస్తులు ఈ విషయాన్ని పుంగనూరు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు పోలీసులతో కలిసి ముదరంపల్లి వెళ్లారు. అక్కడ బాలిక, ఆమె తండ్రి జాడ కనిపించలేదు. దీనిపై ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉషాపణికర్ను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని, వెంటనే పుంగనూరు సీడీపీవోను అప్రమత్తం చేసి బాలికకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: ఉపాధి ఎరగా.. వ్యభిచార కూపంలోకి.. -
బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
శ్రీకాళహస్తి రూరల్/ తిరుపతి క్రైం: బాల్య వివాహాన్ని అడ్డుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి డివిజన్ ఐసీడీఎస్ సీడీపీఓ శాంతిదుర్గ కథనం..మండలంలోని అబ్బాబట్లపల్లెకు చెందిన బత్తెయ్య, బత్తెమ్మ దంపతుల వ్యవసాయ కూలీలుగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి 15 ఏళ్ల కుమార్తె 10వ తరగతి చదువుతోంది. పెట్రోల్ బంకులో కార్మికుడిగా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకునితో వివాహం నిశ్చయమైంది. గురువారం రాత్రి వివాహం చేయడానికి ఇరు కుటుంబాలు సిద్ధం చేశాయి. బాల్య వివాహం చేస్తున్నారని తిరుపతి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందడంతో వారు శ్రీకాళహస్తి పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులను ఐసీడీఎస్ కార్యాలయానికి తీసుకువచ్చి అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయమని రాతపూర్వకంగా బాలిక తల్లిదండ్రుల నుంచి స్టేట్మెంట్ నమోదు చేశారు. బాల్యవివాహాలు చేయటం చట్టరీత్యా నేరమని, బాల్యవివాహాలు చేసినా, ప్రోత్సహించినా కఠిన శిక్షలు తప్పవని సీడీపీఓతోపాటు పోలీసులు హెచ్చరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు బజావతి, శారద, అరుణకుమారి, హెడ్ కానిస్టేబుల్ గంగయ్య పాల్గొన్నారు. సకాలంలో స్పందిస్తాం : అర్బన్ ఎస్పీ ఆపద కాలంలో పోలీసు రక్షణ కోసం స్టేషన్ చు ట్టూ తిరగాల్సిన పనిలేదని అర్బన్ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. డయల్ 100కు ఫోన్ చేస్తే సకాలంలో ఘటనా స్థలం చేరుకుంటామన్నారు. తద్వారానే శ్రీకాళహస్తిలో బాలిక వివాహాన్ని అడ్డుకున్నట్టు పేర్కొన్నారు. డయల్ 100తో పాటు 112, 181 నంబర్లను వినియోగించుకోవాలని కోరారు. బాల్యవివాహం చట్టరీత్యానేరమన్నారు. అంతేకాకుండా చిన్నవయస్సులో వివాహం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉండదన్నారు. -
పరిమళించిన మానవత్వం
సాక్షి, ధర్మపురి : మతిస్థిమితం సరిగా లేక కష్టాల్లో ఉన్న బాలికను చేరదీసి మానవత్వమింకా బతికే ఉందని నిరూపించారు. అభం శుభం తెలియని అనాథ యువతిని ఐసీడీఎస్ అధికారులు చేరదీసి తమ ఆధీనంలోకి తీసుకున్న సంఘటన మండలంలోని కమలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఒడ్డేటి శంకరయ్య–గంగవ్వ దంపతులకు సుమలత, మంజుల సంతానం. పదేళ్ల క్రితం తల్లిదండ్రులిద్దరూ మరణించారు. దీంతో సుమలత, మంజుల అనాథలయ్యారు. పెద్ద కూతురు సుమలత మతిస్థిమితం సరిగా లేక మంచానికే పరిమితమైంది. అక్క భారమంతా చెల్లె మంజులపై పడింది. అక్కను సాకడానికి చెల్లి కూలీ పని చేస్తూ నెట్టుకొస్తుంది. పెళ్లీడుకొచ్చిన చెల్లెకు ఇటీవల గ్రామస్తులు చందాలు పోగుచేసి పెళ్లిచేసి అత్తారింటికి పంపించారు. దీంతో అక్క ఒంటరిగా మిగిలిపోయింది. మతిస్థిమితం సరిగా లేని అక్క సుమలతకు నా అనేవారు కరువయ్యారు. ఒక వైపు తల్లిదండ్రులు లేక మరోవైపు చెల్లె పెళ్లి చేసుకొని వెళ్లగా ఒంటరిగా ఉండిపోయింది. చిప్పిరి జుట్టు, చినిగిన దుస్తులతో కడుపుకు అన్నం లేక బాధితురాలి బతుకు అగమ్యగోచరంగా తయారైంది. చేరదీసిన ఐసీడీఎస్ అధికారులు.. ఐసీడీఎస్ సీడీపీవో అధికారులకు సుమలత దీనగాథను సర్పంచ్ లక్ష్మి తెలియజేసింది. డీడబ్ల్యూవో నరేందర్, పీడీల ఆదేశాలతో సూపర్వైజర్ జయప్రద సోమవారం గ్రామాన్ని సందర్శించి అనాథ యువతిని చేరదీశారు. చిప్పిరి జుట్టును కత్తిరించి, స్నానం చేయించి శుభ్రం చేయించారు. బాధితురాలి ఆరోగ్యపరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించి మందులు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సుమలత బాగుకోసం గ్రామస్తుల సహకారంతో హైదరాబాద్‌లోని సఖీ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ నరేశ్, నాయకులు ప్రసాద్, నాగరాజు గ్రామస్తులు తదితరులున్నారు. యువతిని చేరదీస్తున్న ఐసీడీఎస్ అధికారి. -
అయ్యో ‘పాపం’!
ఆళ్లగడ్డ: భారమనుకున్నారో.. భరించలేమనుకున్నారో.. చేసిన తప్పుకు సాక్షిగా నిలుస్తుందునుకున్నారో తెలియదు కాని అభం శుభం తెలియని బంగారు తల్లిని వదిలించుకున్నారు. సరిగ్గా కళ్లు కూడా తెరవని ఆడ శిశువును ముళ్ల పొదల్లో పడేసి చేతులు దులుపుకున్నారు. ప్రాణముండగానే చీమలు పట్టి ఆ బాధను భరించలేక.. ఏడవడానికి శక్తి లేక .. మూలుగుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని కొందరు గమనించి అక్కున చేర్చుకున్నారు. అందరిని కలచి వేసిన ఈ ఘటన సర్వనరసింహస్వామి ఆలయ సమీపంలో జరిగింది. శిరివెళ్ల మండలంలోని సర్వనరసింహస్వామి ఆలయ సమీపంలోని ఓ పుట్ట వద్ద ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కొన్ని కోతులు గుంపుగా ఉన్నాయి. అక్కడి నుంచి చిన్నగా పసిపాప మూలిగుతున్న శబ్దం వస్తోంది. చాలాసేపు ఈ శబ్దం రావడంతో అక్కడే టెంకాయలు విక్రయించుకునే ఓ మహిళ అక్కడున్న కోతులను పారదోలింది. కోతులు పక్కకు పోయినా పసిపాప మూలిగే శబ్దం ఆగక పోవడంతో అనుమానం వచ్చిన ఆ మహిళ మరో ఇద్దరిని తోడు తీసుకుని అటుగా వెళ్లింది. దగ్గరికి వెళ్లే సరికి చీమలు పట్టి ఏడవడానికి శక్తిలేక చిన్నగా మూలుగుతున్న ఓ పసిపాప కనిపించడంతో కంగుతిన్నారు. వెంటనే పసిపాపను ఎత్తుకుని చీమలు విదిలించి.. వంటినిండా ఉన్న బురదను కడిగారు. ఈ విషయం దేవాలయం ప్రాంగణంలో చర్చనీయాంశమవడంతో అక్కడికి పూజకు వచ్చిన గాజులపల్లికి చెందిన వాణి అనే మహిళ తమకు పిల్లలు లేరని ఈ పాపను తాము సాక్కుకుంటామని అక్కున చేర్చుకుంది. అంతలో ఈ విషయం పోలీసులకు తెలియడంతో మహనంది ఎస్ఐ తులసీ నాగప్రసాద్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఆళ్లగడ్డ ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పాపను స్వాధీనం చేసుకుని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు..వయస్సు వారం నుంచి 10 రోజుల లోపు ఉంటుందని నీరసంగా ఉండటంతో ఐసీయూలో ఉంచామని మరో వారం వరకు ఎటువంటి విషయం చెప్పలేమన్నారు. ఐసీడీఎస్ సీడీపీఓ ఉమామహేశ్వరి మాట్లాడుతూ.. పాప కోలుకున్న వెంటనే కర్నూలు బాలసదనం తరలించి..ఆరునెలలు సంరక్షిస్తామన్నారు. అంతలోపు పాప తల్లిదండ్రులు తగిన ఆధారలతో వస్తే అప్పగిస్తామని చెప్పారు. లేదంటే నిబంధనల ప్రకారం దత్తత తీసుకుంటామని దరఖాస్తు చేసుకున్నవారికి అప్పగిస్తామని తెలిపారు. -
విలీన ప్రక్రియ షురూ..!
మిర్యాలగూడ టౌన్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పిల్లలు తక్కువగా ఉండి అవసరం లేకున్నా కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలను గుర్తించేందుకు ఐదుగురితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. పిల్లలు లేని కేంద్రాలను గుర్తించి ఇతర కేంద్రాల్లో వీలినం చేసేందుకు ప్రభుత్వం తహసీల్దార్‌ను చైర్మన్‌గా, సీడీపీఓ కన్వీనర్‌గా, సభ్యులుగా ఎంపీడీఓలు, ఎంఈఓతో పాటు కలెక్టర్ నియమించిన ప్రత్యేక అధికారితో కలిపి ‘మండల ప్రత్యేక కమిటీ’ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పర్యవేక్షణలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 20 మంది పిల్లలతో ఐదుగురు గర్భీణులు ఉన్నారా?, లేదా? అనే విషయాన్ని కేంద్రాలకు వెళ్లి పరిశీలించి నివేదికను తయారు చేయాల్సి ఉంటుంది. కమిటీదే తుది నిర్ణయం ఈ ఐదుగురితో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ 4, 5 తేదీల్లో గ్రామస్థాయిలో తీర్మానం చేసి నివేదికను కలెక్టర్‌కు రెండు, మూడు రోజుల్లో నివేదికను అందిచాలి. 10వ తేది వరకు ప్రభుత్వానికి ఆ నివేదికను అందజేస్తే ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 31 మండలాలు ఉం డగా మిర్యాలగూడ, దామరచర్ల, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ, అనుముల, దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 565 గ్రామపంచాయతీలతో పాటు ఆవాస కేంద్రాల్లో 2093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి మండల కేంద్రంలో ఐదుగురితో కూడిన కమిటీదే తుది నిర్ణయం. పిల్లలు లేని అంగన్వాడీ కేంద్రాల్లో 2093 కేంద్రాలను సర్వే చేసిన అనంతరం ఈ కేంద్రాల పరిధిలో ఎన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఎన్ని కేంద్రాలను విలీనం చేయవచ్చు?, ఆ కేంద్రాల్లోని పిల్లలు ఎంత మంది ప్రాథమిక పాఠశాలల్లో చేరతారు? అనే నివేదికను తయారు చేయనున్నారు. 20 మంది పిల్లలు, ఐదుగురు గర్భిణులకు తగ్గకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రస్తుతం పిల్లలను ఎక్కువ శాతం ఇంగ్లీష్ మీడియం కోసం ప్రైవేట్ పాఠశాలలకు తీసుకెళ్తున్నందున అంగన్వాడీ కేం ద్రానికి వచ్చే పిల్లలకు కూడా ఇంగ్లీష్‌లోనే పాఠాలు బోధించనున్నారు. ప్రాథమిక పాఠశాలలో విలీనమయ్యే కేంద్రాలతో పాటు కుదించే కేంద్రాల్లో నర్సరీ, ఎల్కేజీ, యుకేజీలను కూడా ఇంగ్లీష్ మీడియం నుంచి చెప్పేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. అంగన్వాడీ కేంద్రాల విలీన ప్రక్రియను ముమ్మరం చేసేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టింది. కాగా రెండు రోజుల పాటు మండల స్థాయి కమిటీ గ్రామాల్లో తీర్మానం చేయించాల్సి ఉంటుంది. ఈ కమిటీ ప్రధానంగా తీర్మానంలో అంగన్వాడీ కేంద్రాలను ఎన్ని విలీనం చేయవచ్చు. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నవి అనే విషయాలను ప్రకటించొచ్చు. అవసరాన్ని బట్టి తనిఖీలను చేసి, మీటింగ్‌లను ఏర్పాటు చేసి మినిట్స్‌లో కమిటీ సభ్యులందరి సంతకాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మినిట్స్లను కలెక్టర్ ఆమోదానికి పంపిస్తారు. ఆమోదం రాగానే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వొచ్చు. -
సీడీపీవోల్లో బదిలీల ఫీవర్
- ప్రస్తుతానికి ఇద్దరికి స్థానచలనం - త్వరలో మరో పందొమ్మిది మంది - తర్జనభర్జన పడుతున్న సీడీపీఓలు - అధికార పార్టీ నేతల ప్రసన్నానికి పాట్లు ఒంగోలు టౌన్: సీడీపీవోలకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. ప్రస్తుతం ఇద్దరు సీడీపీవోలకు స్థానచలనం కలిగింది. ఒంగోలు రూరల్ ప్రాజెక్టు సీడీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న పి.విజయకుమారిని కొండపి ప్రాజెక్టుకు బదిలీ చేశారు. కొండపి సీడీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న పి.విజయలక్ష్మిని ఒంగోలు రూరల్ ప్రాజెక్టుకు బదిలీ చేశారు. త్వరలో మరో పందొమ్మిది మందికి స్థానచలనం కలగనున్నట్లు సమాచారం అందుకున్న సీడీపీవోలు తర్జన భర్జనలు పడుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతాలు తమకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మరోచోటకు బదిలీ చేస్తే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతల సిఫార్సుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి సీడీపీవోల బదిలీలు మహిళా శిశు సంక్షేమశాఖ డెరైక్టరేట్ పరిధిలో జరుగుతుంటాయి. అయినప్పటికీ పై స్థాయిలో మేనేజ్ చేసుకుంటే బదిలీ వేటు పడకుండా తప్పించుకోవచ్చని కొంతమంది, తమకు నచ్చిన ప్రాంతాలకు బదిలీ కావొచ్చని ఇంకొంతమంది ప్రయత్నిస్తున్నారు. వారితీరే సప‘రేట్’ జిల్లాలోని కొంతమంది సీడీపీవోల తీరు సప‘రేట్’గా ఉంది. సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం, తాము పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉండకపోవడం, తనిఖీల పేరుతో అంగన్వాడీలను బెదిరించి సొమ్ము చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటివారికి బదిలీల భయం పట్టుకొంది. తాము ఆడిందే ఆటగా ఉంటున్న తరుణంలో మరో చోటికి బదిలీ అయితే అక్కడ హవా కొనసాగించలేమని మదన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బదిలీలకు సంబంధించి సరైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఎప్పుడు ఎవరిపై బదిలీ వేటు పడుతుందోనని అనేక మంది కలవరపడుతున్నారు. -
‘సబల’ నిధులు స్వాహా..!
ఐసీడీఎస్‌లో మరో అక్రమం ⇒ రూ.75 లక్షలు ఖజానా నుంచి అడ్వాన్స్ గా డ్రా ⇒ శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే..! ⇒ కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించిన వైనం ⇒ సబల నిలిపివేతతో నిధుల కైంకర్యానికి పన్నాగం ఆదిలాబాద్ : స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో మరో భారీ అక్రమం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ సీడీపీవో లక్షల నిధుల స్వాహా వ్యవహారం మరువక ముందే.. తాజాగా ఈ వ్యవహారాన్నే తలదన్నేలా మరోటి చోటుచేసుకుంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి అనుమతి పొందకుండానే ట్రెజరీ నిధులు విడుదల చేసినట్లు సమాచారం. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే సబల పథకానికి సంబంధించిన రూ.75 లక్షలు అడ్వాన్స్‌గా డ్రా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పథకం నిలిచిపోతుందని ముందుగానే తెలిసిన శాఖలోని పలువురు అధికారులు.. ఈ నిధులను తమ కమీషన్ల కోసం కోడిగుడ్ల కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఒక పథకం నిధులు మరో పథకానికి మళ్లించొద్దని నిబంధనలున్నా.. అధికారులు తమ స్వార్థం కోసమే ఇలా చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతిలేకుండానే.. ఐసీడీఎస్‌కు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రతి కొనుగోలుకు సం బంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలను చైర్మన్‌గా ఉన్న కలెక్టర్ అనుమతి పొంది కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిధులతో సబల పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతినెలా కిశోర బాలికలకు 3 కిలోల బియ్యం, కేజీ కంది పప్పు, అరకిలో నూనె సరుకులను అందజేస్తారు. కాగా.. గత మార్చిలో రూ.75 లక్షలు ఐసీడీఎస్ అధికారులు ట్రెజరీ నుంచి అడ్వాన్స్‌గా డ్రా చేశారు. నూనె కొనుగోలు కోసం రూ.75 లక్షలు డ్రా కోసం అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌కు ప్రతిపాదించారు. కలెక్టర్ అనుమతితో ఆ నిధులను డ్రా చేశారు. అయితే.. ఇప్పటి వరకు నూనె కొనుగోలు కోసం ఏపీ ఆయిల్ ఫెడ్‌కు చెల్లించకపోవడం గమనార్హం. ఆ నిధులను అంగన్వాడీలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ శాఖ కమిషనర్ కార్యాలయం అధికారులపై ఇందుకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కోడిగుడ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరవుతుంటాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సబల నిధులను కోడిగుడ్ల కాంట్రాక్టర్లకు చెల్లించాలనే యత్నాలు ఏ విధంగా సబబన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో పనిచేసే అధికారులకు, వివిధ ప్రాజెక్టుల సీడీపీవోలకు భారీగా కమీషన్లు ముడుతుండడంతోనే ఈ నిధులు మళ్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కమిషనర్ కార్యాలయం అధికారులు దీనికి అంగీకరించడం లేదని సమాచారం. అడ్వాన్స్‌గా డ్రా చేసిన డబ్బులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కలెక్టర్‌కు ప్రతిపాదించిన దానిలో నూనె కొనుగోలు చేస్తామని చెప్పిన అధికారులు ఆ నిధులను తమ కమీషన్ల కక్కుర్తి కోసం కోడిగుడ్ల కాంట్రాక్టర్‌కు చెల్లించాలని చూడ్డం విస్తుకలిగిస్తోంది. ఐసీడీఎస్‌కు చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌నే ఈ వ్యవహారంలో ఐసీడీఎస్ అధికారులు తప్పుతోవ పట్టించారు. ఇప్పుడు ఆ నిధులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయడమంటే కలెక్టర్ వరకు వ్యవహారం వెళ్తుందని వారిలో గుబులు మొదలైంది. సబల నిలిపివేత.. సబల పథకం నిలిపివేస్తున్నట్లు మే 5న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది. ఈ పథకాన్ని ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో అమలు చేస్తుండగా తాజాగా నిలిపివేశారు. కిశోర బాలికలకు ప్రతినెలా 3 కిలోల బియ్యం, కేజీ కంది పప్పు, అరకిలో నూనె, 16 కోడిగుడ్లను అందజేసేవారు. ప్రతి లబ్ధిదారుడికి రోజూ రూ.5 విలువైన సరుకులను నెల కోసం అందిస్తారు. 11 నుంచి 18 ఏళ్ల వయసుగల బడిబయట పిల్లలు సుమారు 1.23 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని నిలిపివేశారు. పథకం నిలిచిపోతుందని తెలిసే జిల్లా యంత్రాంగాన్నే తప్పుతోవ పట్టించి పీడీ కార్యాలయంలో పనిచేసే కొంత మంది ఉద్యోగులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి నిధులను అడ్వాన్స్‌గా డ్రా చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జీని ‘సాక్షి’ వివరణ కోరగా మార్చి నెలలో సబలకు సంబంధించిన రూ.75.76 లక్షలను నూనె కొనుగోలు కోసం ట్రెజరీ నుంచి విడుదల చేసినట్లు తెలిపారు. వీటిని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని వివరించారు. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని, కమిషనర్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామని చెప్పడం కొసమెరుపు. -
సీడీపీఓలో తాజా పోస్టింగ్‌లు రద్దు
హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ(సీడీపీఓ)లో ఇటీవల ఇచ్చిన 102 పోస్టింగ్‌లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు నష్టంకలిగేలా చేపట్టిన నియామకాలను రద్దు చేయాలని ఓ నిరుద్యోగి హైకోర్టును ఆశ్రయించడంతో తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని ధర్మాసనం ఈనెల 8న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొత్తగా నియమితులైన ఉద్యోగుల జాయినింగ్ రిపోర్టులను తీసుకోవద్దని కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులపై మహిళా శిశుసంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి. రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. -
సర్కారు సిబ్బందికి.. ఏసీబీ వణుకు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తుపాను వర్షాలు, చలిగాలులతో జిల్లా ప్రజలు, రైతులు వణుకుతుంటే.. ప్రభుత్వ సిబ్బంది మాత్రం ఏసీబీ భయంతో వణికిపోతున్నారు. ఇంతకుముందెన్నడూ లేని రీతిలో ఇటీవలి కాలంలో ఏసీబీ పంజా విసురుతోంది. మున్సిపల్ కమిషనర్లు, పోలీసులు సైతం దాని దెబ్బకు విలవిల్లాడుతున్నారు. మూడు నెలల్లోనే నాలుగు దాడులు.. ఏడు అరెస్టులతో మిగతా సిబ్బంది ఠారెత్తిపోతున్నారు. ఫార్మాలిటీస్ చెల్లించనిదే పనులు జరగని పరిస్థితుల్లో తమ వద్దకు వచ్చి చేయి తడిపేందుకు ప్రయత్నించే సాధారణ ప్రజలను ‘మీకో దండం’.. అంటూ వెనక్కి పంపేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతితో విసిగిపోయిన వారికి ప్రస్తుతం ఏసీబీ ఆపద్బాంధవిగా కనిపిస్తోందనడంలో సందేహం లేదు. శుక్రవారం సీడీపీవోపై వల పన్ని పట్టుకున్న ఉదంతమే దీనికి నిదర్శనం. జిల్లాలో ఇటీవలి కాలంలో ఇది నాలుగో దాడి కాగా.. మూడు నెలల క్రితం దాడుల పరంపర మొదలైంది. ఆగస్టు 20న.. స్థానిక వైఎస్ఆర్ కల్యాణ మండపం పాత లీజుదారు నుంచి లంచం తీసుకుంటూ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్ పట్టుబడ్డారు. అవినీతిలో మునిగి తేలుతున్న మున్సిపాలిటీలో ఏకంగా కమిషనరే దొరికిపోవడం, అతనితోపాటు సీని యర్ అసిస్టెంట్ పద్మనాభం కూడా అరెస్టు కావడంతో ఉద్యోగులు అదిరిపోయారు. ఒక మున్సిపల్ కమిషనర్ దొరికిపోవడం జిల్లాలో ఇదే ప్రథమం కావడంతో ప్రజల్లోనూ ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అక్కడికి నెలన్నర వ్యవధిలో.. సెప్టెంబర్ 30న ఏసీబీ మళ్లి వల వేసింది. ఈసారి ఏకంగా రక్షక భటులే వలలో చిక్కుకున్నారు. యాక్సిడెంట్‌కు గురైన ఒక వాహనాన్ని విడుదల చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ ఇన్స్పెక్టర్ ఆజాద్‌ను ఆశ్రయించాడు. దాంతో వల పన్నారు. శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లోనే లంచం తీసుకుంటుండగా స్టేషన్ రైటర్‌తోపాటు మరో కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులే ఇలా చిక్కుకోవడం సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్లలో జరిగే అక్రమాలను బట్టబయలు చేసింది. 20 రోజుల తర్వాత..నవంబర్ 20న సీన్ పాలకొండకు మారింది. ఈసారి వంతు పాలకొండ నగర పంచాయతీ కమిషనర్‌ది. ఇంటి ప్లాన్ ఆమోదానికి లంచం తీసుకుంటూ ఆయన దొరికిపోయారు. ఇటీవలే నగర పంచాయతీగా మారిన పాలకొండకు తొలి కమిషనర్‌గా నియమితుడైన నాగభూషణరావు ఇలా అరెస్టు కావడం విశేషం. 3 నెలల వ్యవధిలో ఇద్దరు మున్సిపల్ కమిషనన్లు పట్టుబడటం మున్సిపాలిటీల్లో జరుగుతున్న అవినీతి గుట్టు విప్పింది. తాజాగా.. నవంబర్ 22.. శుక్రవారం.. పిల్లలకు పౌష్టికాహారం సరఫరా చేసే ఐసీడీఎస్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ నుంచి లంచం తీసుకుంటున్న కోటబొమ్మాళి సీడీపీవో కె.ఉమాదేవి, అందుకు సహకరించిన ఆమె భర్త ఏసీబీ ఉచ్చులో చిక్కుకున్నారు. రవాణా బిల్లు మంజూరుకు సునీల్‌కుమార్ అనే ఆపరేటర్ నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటూ శ్రీకాకుళంలోని తన ఇంట్లోనే ఆమె ఏసీబీకి దొరికిపోయారు. ఇలా ఏసీబీ దాడులు, అరెస్టుల పర్వం కొనసాగిస్తుండటంతో ప్రభుత్వ సిబ్బంది హడలిపోతున్నారు. ఇవాళ వీరు.. రేపెవరో.. అని చర్చించుకుంటూ ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ‘ఫార్మాలిటీస్’ పూర్తి చేయనిదే ఏ పనీ జరగదు.. ఏ ఫైలూ కదలదు. దీనికి ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. అదే అలవాటుతో ఎవరైనా చేయి తడపడానికి ప్రయత్నిస్తే.. బాబూ.. మీకో దండం.. మీ పని చేసిపెడతాంగానీ ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోండని సిబ్బంది బతిమాలుతున్నారు. ఇది మంచి మార్పే అయినా.. ఎన్నాళ్లు కొనసాగుతుందన్నది.. ఏసీబీ దాడుల పరంపర కొనసాగడం.. పట్టుబడినవారిపై చర్యలు తీసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది.