సీడీపీవోల్లో బదిలీల ఫీవర్
- ప్రస్తుతానికి ఇద్దరికి స్థానచలనం
- త్వరలో మరో పందొమ్మిది మంది
- తర్జనభర్జన పడుతున్న సీడీపీఓలు
- అధికార పార్టీ నేతల ప్రసన్నానికి పాట్లు
ఒంగోలు టౌన్: సీడీపీవోలకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. ప్రస్తుతం ఇద్దరు సీడీపీవోలకు స్థానచలనం కలిగింది. ఒంగోలు రూరల్ ప్రాజెక్టు సీడీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న పి.విజయకుమారిని కొండపి ప్రాజెక్టుకు బదిలీ చేశారు. కొండపి సీడీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న పి.విజయలక్ష్మిని ఒంగోలు రూరల్ ప్రాజెక్టుకు బదిలీ చేశారు.
త్వరలో మరో పందొమ్మిది మందికి స్థానచలనం కలగనున్నట్లు సమాచారం అందుకున్న సీడీపీవోలు తర్జన భర్జనలు పడుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతాలు తమకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మరోచోటకు బదిలీ చేస్తే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతల సిఫార్సుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి సీడీపీవోల బదిలీలు మహిళా శిశు సంక్షేమశాఖ డెరైక్టరేట్ పరిధిలో జరుగుతుంటాయి. అయినప్పటికీ పై స్థాయిలో మేనేజ్ చేసుకుంటే బదిలీ వేటు పడకుండా తప్పించుకోవచ్చని కొంతమంది, తమకు నచ్చిన ప్రాంతాలకు బదిలీ కావొచ్చని ఇంకొంతమంది ప్రయత్నిస్తున్నారు.
వారితీరే సప‘రేట్’
జిల్లాలోని కొంతమంది సీడీపీవోల తీరు సప‘రేట్’గా ఉంది. సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం, తాము పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉండకపోవడం, తనిఖీల పేరుతో అంగన్‌వాడీలను బెదిరించి సొమ్ము చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటివారికి బదిలీల భయం పట్టుకొంది. తాము ఆడిందే ఆటగా ఉంటున్న తరుణంలో మరో చోటికి బదిలీ అయితే అక్కడ హవా కొనసాగించలేమని మదన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బదిలీలకు సంబంధించి సరైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఎప్పుడు ఎవరిపై బదిలీ వేటు పడుతుందోనని అనేక మంది కలవరపడుతున్నారు.