రూ.50 వేలు తీసుకుని కూతరినే అమ్మేశాడు! | Father Sold His Daughter In Palamaner | Sakshi
Sakshi News home page

రూ.50 వేలు తీసుకుని కూతరినే అమ్మేశాడు!

Published Mon, Jun 15 2020 8:37 AM | Last Updated on Mon, Jun 15 2020 8:37 AM

Father Sold His Daughter In Palamaner - Sakshi

ముదరంపల్లిలో బాలిక ఇల్లు (ఇన్‌సెట్‌లో) బాధిత బాలిక

సాక్షి, పలమనేరు : ఓ తండ్రి తన కుమార్తెను అమ్మేశాడు. రూ.50 వేలు తీసుకుని ముక్కుపచ్చలారని పన్నెండేళ్ల బాలికను 36 ఏళ్ల వ్యక్తి వెంట పంపించేశాడు. అతను ఆ బాలికను వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన పెద్దపంజాణి మండలం ముదరంపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన జోగి వెంకటరమణ పందులు పెంచుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అతనికి నలుగురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. మూడో కుమార్తె (12) ఐదో తరగతి వరకు చదివి ఇంటివద్దే ఉంటోంది. బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లికి చెందిన సురేష్‌ (36) గతంలో వెంకటరమణ పెద్ద కుమార్తెను వివాహం చేసుకుంటానని అడిగాడు. అతను నిరాకరించడంతో కొన్నాళ్ల తరువాత రెండో కుమార్తెను వివాహం చేసుకుంటానని అడిగాడు.

అది కూడా కుదరకపోవడంతో మూడో కుమార్తెనైనా తనకిచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టాడు. వెంకటరమణ నిరాకరించడంతో తానే రూ.50 వేలు ఎదురు కట్నం ఇస్తానని ఆశచూపాడు. దీంతో అంగీకరించిన బాలిక తండ్రి నాలుగురోజుల క్రితం పెళ్లికి రంగం సిద్ధం చేశాడు. డబ్బులు తీసుకుని కుమార్తెను సురేష్‌కి ఇచ్చి రహస్యంగా పెళ్లి చేయాలని చూశాడు. గ్రామస్తులు పెద్దపంజాణి పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాలిక తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మైనారిటీ తీరేవరకు వివాహం చేయనని వెంకటరమణ నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుని పంపించేశారు. డబ్బులు తీసుకుని పెళ్లి వాయిదా వేస్తే ఇబ్బంది వస్తుందని భావించిన వెంకటరమణ శనివారం ఉదయం తన కుమార్తెను సురేష్‌ వెంట పంపించేశాడు. 

బాలికను చప్పిడిపల్లి తీసుకెళ్లిన సురేష్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వివాహం చేసుకున్నట్లు సమాచారం. గ్రామస్తులు ఈ విషయాన్ని పుంగనూరు ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు పోలీసులతో కలిసి ముదరంపల్లి వెళ్లారు. అక్కడ బాలిక, ఆమె తండ్రి జాడ కనిపించలేదు. దీనిపై ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఉషాపణికర్‌ను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని, వెంటనే పుంగనూరు సీడీపీవోను అప్రమత్తం చేసి బాలికకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: ఉపాధి ఎరగా.. వ్యభిచార కూపంలోకి.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement