ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో ఉన్న పాప
ఆళ్లగడ్డ: భారమనుకున్నారో.. భరించలేమనుకున్నారో.. చేసిన తప్పుకు సాక్షిగా నిలుస్తుందునుకున్నారో తెలియదు కాని అభం శుభం తెలియని బంగారు తల్లిని వదిలించుకున్నారు. సరిగ్గా కళ్లు కూడా తెరవని ఆడ శిశువును ముళ్ల పొదల్లో పడేసి చేతులు దులుపుకున్నారు. ప్రాణముండగానే చీమలు పట్టి ఆ బాధను భరించలేక.. ఏడవడానికి శక్తి లేక .. మూలుగుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని కొందరు గమనించి అక్కున చేర్చుకున్నారు. అందరిని కలచి వేసిన ఈ ఘటన సర్వనరసింహస్వామి ఆలయ సమీపంలో జరిగింది. శిరివెళ్ల మండలంలోని సర్వనరసింహస్వామి ఆలయ సమీపంలోని ఓ పుట్ట వద్ద ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కొన్ని కోతులు గుంపుగా ఉన్నాయి. అక్కడి నుంచి చిన్నగా పసిపాప మూలిగుతున్న శబ్దం వస్తోంది.
చాలాసేపు ఈ శబ్దం రావడంతో అక్కడే టెంకాయలు విక్రయించుకునే ఓ మహిళ అక్కడున్న కోతులను పారదోలింది. కోతులు పక్కకు పోయినా పసిపాప మూలిగే శబ్దం ఆగక పోవడంతో అనుమానం వచ్చిన ఆ మహిళ మరో ఇద్దరిని తోడు తీసుకుని అటుగా వెళ్లింది. దగ్గరికి వెళ్లే సరికి చీమలు పట్టి ఏడవడానికి శక్తిలేక చిన్నగా మూలుగుతున్న ఓ పసిపాప కనిపించడంతో కంగుతిన్నారు. వెంటనే పసిపాపను ఎత్తుకుని చీమలు విదిలించి.. వంటినిండా ఉన్న బురదను కడిగారు. ఈ విషయం దేవాలయం ప్రాంగణంలో చర్చనీయాంశమవడంతో అక్కడికి పూజకు వచ్చిన గాజులపల్లికి చెందిన వాణి అనే మహిళ తమకు పిల్లలు లేరని ఈ పాపను తాము సాక్కుకుంటామని అక్కున చేర్చుకుంది.
అంతలో ఈ విషయం పోలీసులకు తెలియడంతో మహనంది ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఆళ్లగడ్డ ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పాపను స్వాధీనం చేసుకుని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు..వయస్సు వారం నుంచి 10 రోజుల లోపు ఉంటుందని నీరసంగా ఉండటంతో ఐసీయూలో ఉంచామని మరో వారం వరకు ఎటువంటి విషయం చెప్పలేమన్నారు. ఐసీడీఎస్ సీడీపీఓ ఉమామహేశ్వరి మాట్లాడుతూ.. పాప కోలుకున్న వెంటనే కర్నూలు బాలసదనం తరలించి..ఆరునెలలు సంరక్షిస్తామన్నారు. అంతలోపు పాప తల్లిదండ్రులు తగిన ఆధారలతో వస్తే అప్పగిస్తామని చెప్పారు. లేదంటే నిబంధనల ప్రకారం దత్తత తీసుకుంటామని దరఖాస్తు చేసుకున్నవారికి అప్పగిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment