పట్టు జారి పోతోంది! | Mulberry cultivation unseen in the united Kurnool district | Sakshi
Sakshi News home page

పట్టు జారి పోతోంది!

Published Fri, Jan 17 2025 5:52 AM | Last Updated on Fri, Jan 17 2025 5:52 AM

Mulberry cultivation unseen in the united Kurnool district

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపించని మల్బరీ సాగు

నామమాత్రపు రాయితీలతో సాగుకు దూరంగా రైతులు

పట్టు గూళ్ల ధరల్లో కూడా పెరుగుదల శూన్యం

స్పందించని రాష్ట్ర ప్రభుత్వం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మల్బరీ సాగు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి వ్యయం రెట్టింపు అవుతున్నా రైతులకు సబ్సిడీలు అందడం లేదు. గతంలో కిలో పట్టుగూళ్లకు రూ.400 నుంచి రూ.500 వరకు వస్తుంటే నేడు కూడా అదే ధర  పలుకుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పట్టుగూళ్ల మార్కెటింగ్‌ సదుపాయం లేదు. నష్టాలు ఎక్కువగా ఉండటంతో రైతులు మల్బరీ సాగుకు దూరమవుతున్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): మల్బరీ తోటల సాగుపై, పట్టు పురుగుల పెంపకంపై రైతులు అనాసక్తి చూపుతున్నారు. ప్రత్యామ్నాయంగా పొగాకు, మినుము వంటి పంటలు సాగు చేస్తున్నారు. గతంలో ఆదోని ప్రాంతంలోని దొడ్డనగేరి, జాలిమంచి, కోసిగి, ఇస్వీ ప్రాంతాల్లో గతంలో ఎటు చూసినా మల్బరీ తోటలు ఉండేవి. ఈ ప్రాంతంలో పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం ఉండేది. 

అయితే క్రమంగా ఈ ప్రాంతంలో మల్బరీ సాగు తగ్గుతూ వచ్చి నేడు పూర్తిగా కనుమరుగైంది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న పట్టుపరిశ్రమల శాఖ ఏడీ కార్యాలయాన్ని ప్యాపిలికి మార్చారు. అక్కడ కూడా మల్బరీ సాగు తగ్గడంతో కార్యాలయం కర్నూలుకు వచ్చింది. 

గతంలో వెల్దుర్తి మండలం బోయినపల్లి, సూదేపల్లి, కోడుమూరు మండలం లద్దగిరి గ్రామాలు మల్బరీ సాగుకు నెలవుగా ఉండేవి. నేడు ఈ ప్రాంతాల్లో మల్బరీ సాగు కనిపించడం లేదు. నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, ఆత్మకూరు మండలాల్లో 2,000 ఎకరాల్లో మల్బరీ సాగు ఉండేది. ఆత్మకూరులో ప్రత్యేకంగా అసిస్టెంటు డైరెక్టర్‌కార్యాలయం కూడా ఉంది. అయితే నేడు పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఆత్మకూరు ఏడీ పరిధిలో 50 ఎకరాల్లో కూడా మల్బరీ సాగు కనిపించడం లేదు.   

ఎందుకు ఇలా? 
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మల్బరీ సాగు 80 శాతంపైగా పడిపోయినా సెరికల్చర్, సహాయ సెరికల్చర్‌ ఆఫీసర్లు, సాంకేతిక సహాయకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాకాలు లేకపోవడం, పట్టుగూళ్ల ధరల్లో పురోగతి లేకపోవడంతో రైతులు పట్టుకు ప్రత్యామ్నాయంగా పొగాకు, మినుము వంటి పంటలు సాగు చేస్తున్నారు. 

పెరిగిన పెట్టుబడి వ్యయం  
పట్టు సాగులో పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది. పట్టు పురుగుల పెంపకానికి షెడ్‌ అత్యవసరం. ఇందుకు రూ.15 లక్షల వరకు ఖర్చు వస్తోంది. ప్రభుత్వం గతంలో ఇస్తున్న సబ్సిడీ రూ.3 లక్షలే ప్రస్తుతం అందిస్తోంది. రెండు

ఎకరాల్లో మల్బరీ మొక్కలకు రూ.45 వేలు, వ్యాధి నిరోధకాలకు రూ.5000. సూట్‌కు రూ.40 వేలు, వరండాకు రూ.30 వేలు, నేత్రికలకు రూ.50 వేలు ప్రకారం సబ్సిడీలు ఉన్నాయి. సబ్సిడీలు పోను మొక్కలు నాటుకోవడానికి రైతులకు రూ.20 వేలు, వ్యాధి నిరోధకాలకు రూ.12 వేలు, సూట్‌కు రూ.1.50 లక్షలు, వరండాకు రూ.లక్ష, నేత్రికలకు రూ.10 వేలు, చాకి పురుగులకు

ఏడాదికి రూ.50 వేల వరకు ఖర్చు వస్తోంది. మొత్తం పెట్టుబడి వ్యయం రూ.20 లక్షల వరకు ఉండగా.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రూ.4.80 లక్షలు సరిపోవడం లేదు. పట్టుగూళ్లకు హిందూపురం, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో మార్కెటింగ్‌ సదుపాయం ఉంది. ఉమ్మడి జిల్లాలో మార్కెటింగ్‌ సదుపాయం లేదు. దీంతో రైతులకు నికరాదాయం రావడం లేదు.  

పట్టుపురుగులపై పురుగుమందుల ప్రభావం
ఏడెనిమిదేళ్లుగా కంది, పత్తి, మినుము, మిర్చి, మొక్కజొన్న, వరి తదితర పంటల్లో పురుగు మందుల వాడకం భారీగా పెరిగింది. ఈ ప్రభావం చుట్టుపక్కల ఉన్న పట్టు పురుగులపై పడుతోంది. పట్టు పురుగులు చాలా సున్నితంగా ఉంటాయి. గాలి వాటంగా వస్తున్న పురుగుమందుల ప్రభావానికి లోనై మరణిస్తున్నాయి. 

డోన్‌ మండలంలోని ఉడుములపాడు గ్రామం పరిసరాల్లో రెండు, మూడేళ్ల క్రితం ఫెస్టిసైడ్‌ కంపెనీ ఏర్పాటు అయింది. దీని ప్రభావం వెల్దుర్తి మండలం సూదేపల్లిలో సాగు చేస్తున్న పట్టు పరిశ్రమపై పడుతోంది. ఉమ్మడి జిల్లాలో పట్టు పరిశ్రమ మనుగడ కోల్పోతుండటానికి పురుగు మందుల పిచికారీ ప్రభావం కూడా ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.    

సాగుకు స్వస్తి పలికాం 
పట్టు సాగులో విశేషంగా రాణిస్తున్నందుకు నాకు గతంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. బైవోల్టెన్‌ పట్టు గూళ్ల ఉత్పత్తికి గతంలో కిలోకు రూ.50 ఇంటెన్సివ్‌ లభించేది. ప్రస్తుతం రైతులకు ఇది లేకుండా పోయింది. పెట్టుబడి వ్యయం ఎక్కువవుతున్నా సబ్సిడీలు పెరగడం లేదు. పట్టు గూళ్ల ధరలు పెరగకపోవడంతో పట్టు సాగుకు స్వస్తి పలికి పొగాకు, మినుము తదితర వాటిపై ఆసక్తి చూపుతున్నాం.            – భాస్కరరెడ్డి, ఆత్మకూరు

నష్టాలు మూట కట్టుకుంటున్నాం 
పట్టులో ఏడాదికి 5 నుంచి 8 పంటలు తీయవచ్చు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. మూడు, నాలుగు పంటలే గగనం అవుతున్నాయి. ఒక్కోపంటకు రూ.80 వేలకుపైగా ఖర్చు వస్తోంది. పెట్టుబడి వ్యయం రూ.2.50 లక్షలు అయ్యింది. మూడు పంటలపై వచ్చిన పట్టుగూళ్లను అమ్మగా కేవలం రూ.1.90 లక్షలు మాత్రమే వచ్చింది. నష్టాలు మూట గట్టుకున్నాం. 
– మధుసూదన్, రామసముద్రం, జూపాడుబంగ్లా మండలం

ఫిర్యాదులు వస్తున్నాయి 
డోన్‌ మండలం ఉడుములపాడు సమీపంలో ఉన్న కెమికల్స్‌ ఫ్యాక్టరీ ప్రభావం సూదేపల్లి సాగు చేస్తున్న మల్బరీపై పడుతున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మల్బరీ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఏడాదికేడాది పురుగు మందుల వినియోగం పెరుగుతోంది. దీంతో మల్బరీ సాగు నుంచి కొంతమంది రైతులు దూరం అవుతున్నారు. మల్బరీ సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.  – విజయకుమార్, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి, కర్నూలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement