దిశ చట్టం అమలుకు ప్రత్యేకంగా దిశ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.దీంతో కలెక్టర్ శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్ సఖి సెంటర్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో దిశ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు పోలీసులు, ఇటు సఖి సెంటర్ ఉద్యోగులు సమన్వయంతో మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించిబాధితులకు సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా దిశ చట్టం కింద నిందితులపై 21 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయడం ద్వారా శిక్ష పడే అవకాశం ఉంటుంది. బాధిత మహిళలకు సత్వర న్యాయం జరుగుతుంది.
సాక్షి, నెల్లూరు: పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై అఘాయిత్యం జరిగినా, లైంగిక వేధింపులు, కుటుంబంలో గృహహింసకు గురైనా, అక్రమరవాణా, సైబర్ నేరగాళ్ల బారిన పడడం, ఈవ్‌టీజింగ్ తదితర సమస్యల నుంచి వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారికి ఓదార్పుతోపాటు కౌన్సెలింగ్, ట్రీట్‌మెంట్, ఎఫ్‌ఐఆర్, కోర్టులో న్యాయం జరిగేలా చూసేందుకు సఖి(వన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్)ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలోనే నిర్భయ చట్టంతోపాటు దిశ చట్టం అమలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్యాయానికి గురైన బాధిత మహిళలకు 21 రోజుల్లో న్యాయం జరిగి నిందితులకు శిక్ష పడేలా చేయడం దిశ చట్టం ఉద్దేశం. జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ సెంటర్ పర్యవేక్షణ ఉంటుంది. ఇందులో 18 మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో 24 గంటలపాటు సేవలు అందించనున్నారు. దిశ చట్టం అమలుకు ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ఎస్సీ భాస్కర్‌భూషణ్ సఖి సెంటర్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో దిశ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఐదు రకాల సేవలు
బాధిత మహిళలు నేరుగా సఖి సెంటర్‌కు వచ్చిన వెంటనే వారికి భరోసా కల్పిస్తారు. ఆపై కౌన్సెలింగ్ ఇచ్చి వైద్య చికిత్సలు అందజేస్తారు. అనంతరం వారికి జరిగిన అన్యాయంపై పోలీసులతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయిస్తారు. బాధిత మహిళలకు సఖి సెంటర్‌లోనే ఐదు రోజులపాటు ఉండేందుకు అవసరమైన సదుపాయాలు సమకూర్చుతారు. దిశ చట్టం పరిధిలోకి వస్తే 21 రోజుల్లో విచారణ, చార్జీషీట్ దాఖలు, ట్రయల్ రన్ పూర్తి చేసి కోర్టుకు సమర్పిస్తారు. తద్వారా వెంటనే నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బాధితులకు న్యాయం జరిగేలా మహిళా న్యాయవాదులను కూడా వీరే ఏర్పాటు చేస్తారు.
నూతన భవనం మంజూరు
వన్ స్టాప్ సెంటర్‌కు అవసరమైన నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆ భవన నిర్మాణానికి గాను రూ.48.69 లక్షల కేటాయింపులు జరిగాయి. ఆ భవన నిర్మాణ బాధ్యతను కలెక్టర్ ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి అప్పగించారు. భవనంతోపాటు చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోనే తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.
మూడేళ్లలో 543 కేసులు నమోదు
2017 జూన్‌లో సఖి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జిల్లాలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి బాధితుల నుంచి 543 ఫిర్యాదులు అందాయి. అందులో 167 కేసుల్లో పోలీస్ కేసులు నమోదయ్యాయి. 265 కేసుల్లో మహిళలకు న్యాయసేవలు అందాయి. 59 కేసుల్లో అవసరమైన వైద్య సహాయం అందించారు. 73 కేసుల విషయంలో సమర్థులైన న్యాయకోవిధులు, సమాజంలో ప్రతిభావంతులైన వారి ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించి సమస్యలను పరిష్కరించారు.
181 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు
ఎక్కడైనా మహిళలపై అఘాయిత్యాలు, అన్యాయం జరిగినా వెంటనే 181 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే వెంటనే స్పందన ఉంటుంది. అక్కడి సిబ్బంది వెంటనే పోలీసులను అలర్ట్ చేస్తారు. ఆపై బాధితురాలిని సఖి సెంటర్‌కు పిలిపించి వారికి సేవలు అందించే ప్రయత్నాలు చేస్తారు. 24 గంటలూ ఎప్పుడైనా కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి సేవలు పొందవచ్చు
ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం
సమాజంలో అన్యాయానికి గురైన మహిళలకు సత్వర న్యాయం జరిగేలా సఖి సెంటర్ నిర్వహణ ఉంటుంది. ఈ సెంటర్‌లోనే దిశ చట్టం కూడా అమలు చేస్తున్నాం. దీంతో బాధిత మహిళలకు న్యాయం జరుగుతుంది. సఖి సెంటర్‌లో ఐదు రకాల సేవలతో స్వాంతన చేకూర్చి బాధితులకు అండగా ఉంటాం. దిశ చట్టం అమలుతో 21 రోజుల్లోనే వారికి న్యాయం జరుగుతుంది. సఖి సెంటర్‌లో హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం.– సుధాభారతి, ఐసీడీఎస్ పీడీ
లైంగికదాడికి గురైన వారికి ఆసరా
జిల్లా పరిధిలో లైంగికదాడికి గురైన మహిళలకు వైద్య, న్యాయ, మానసిక పరమైన సేవలందించేందుకు ఏర్పాటైన ఒన్ స్టాప్ సెంటర్(సఖి) ఆసరాగా ఉంటుంది. ఇలాంటి సెంటర్లను ఒక్క నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలోనే కాకుండా కావలి, గూడూరు తదితర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తే లైంగికదాడికి గురైన మహిళలకు సత్వర సేవలు అందే అవకాశం ఉంటుంది. – ఈదల ధనూజారెడ్డి, గృహిణి, నజీర్‌తోట, నెల్లూరు నగరం
సఖి సెంటర్ ఏర్పాటు అభినందనీయం
లైంగికదాడికి గురైన మహిళలు, బాలికలకు ప్రత్యేక చికిత్స కోసం ఒన్ స్టాప్ సెంటర్(సఖి)ను ఏర్పాటు చేయడం అభినందనీయం. లైంగికదాడికి గురైన మహిళలు, యువతులు, చిన్నారులు శారీరకంగా అనేక రుగ్మతలకు గురువుతున్నారు. బయటకు చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతున్నారు. ఇలాంటి బాధితులకు సఖి సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయి.– కె.శారద, గృహిణి, నాలుగో మైలు,నవలాకులతోట, నెల్లూరు రూరల్
అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలో దిశ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మహిళా పోలీస్‌స్టేషన్‌నే దిశ పోలీస్‌స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. íఅదనపు సిబ్బందిని కేటాయిస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నాం. డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సైబర్ నిపుణుల నియామకాలు చేపట్టాల్సిఉంది. – భాస్కర్‌భూషణ్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment