ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నల్లగొండ: మారుమూల గ్రామాలకు బ్యాంకుసేవలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బ్యాంకు సేవలు అందుబాటులో లేక ఎంతోమంది ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా బ్యాంకుసేవలను అందించేందుకు ఆర్‌బీఐ నిర్ణయించింది. సఖి పేర సేవలు అందించేందుకు మహిళా సంఘాలను గుర్తించి, బిజినెస్ కరస్పాండెంట్లుగా బాధ్యతలు అప్పజెప్పాలని డీఆర్‌డీఏకు సూచించింది.
వీరి సేవలు అందుబాటులోకి వస్తే ఇకనుంచి గ్రామీణ ప్రాంతాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆర్థిక లావాదేవీలు గ్రామాల్లోనే నిర్వహించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో అడుగు ముందుకేస్తోంది. బిజినెస్ కరస్పాండెంట్లుగా ఆయా గ్రామాల్లో ఎంపిక చేసి వారి ద్వారా బ్యాంకు సేవలను అందించనున్నారు. ఆ గ్రామ మహిళా సమాఖ్య సభ్యుల్లో అక్షరాస్యులైన వా రిని ఎంపిక చేయాల్సి ఉంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు.
బ్యాంకుసేవలు లేని గ్రామాల్లోనే ..
బ్యాంకులు, పల్లె సమగ్ర కేంద్రాలు, సర్వీస్ పాయింట్లు లేని గ్రామాలకు బిజినెస్ కరస్పాండెంట్లను నియమించాల్సి ఉంది. ఆయా గ్రామాల్లోని గ్రామ సమాఖ్య సభ్యుల్లో చదువుకున్న మహిళను గుర్తించాలి. ఈ బిజినెస్స్ కరస్పాండెంట్ సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసేందుకు కూడా బ్యాంకు రుణాలు అందించనున్నారు. గ్రామాల్లో సఖి కేంద్రాన్ని డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి బిజినెస్ కరస్పాండెంట్‌ను కూడా ఎంపిక చేస్తారు. వీటన్నింటి నిర్వహణకు సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, తదితర వస్తువులను కొనేందుకు రూ. 50వేలు రుణం కూడా అందించనున్నారు. వీరికి నెలకు రూ. 4వేల చొప్పున వేతనంతో పాటు కమీషన్‌ను కూడా ఇచ్చేం దుకు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నెలలోనే బిజినెస్ కరస్పాండెంట్ల ఎంపిక
డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఈనెలాఖరుకల్లా ఏ గ్రామాల్లోనైతే సఖి ద్వారా బ్యాంకుసేవలు అందించాలని నిర్ణయించారో, ఆ గ్రామాల్లోని మహిళా సమాఖ్య సభ్యుల్లో విద్యావంతులైన వారిని ఎంపిక చేసి బిజినెస్ కరస్పాండెంట్‌గా నియమించనున్నారు. బిజినెస్ కరస్పాండెంట్ (బీసీ)గా అవకాశం దక్కాలంటే సదరు మహిళ 10వ తరగతి చదివిన వారై, అదే గ్రామానికి చెందిన వారై ఉండాలి. అంతే కాకుండా.. స్మార్ట్ ఫోన్ వాడడం కూడా వచ్చి ఉండాలి. ఎంపికైన తర్వాత ఎనిమిది రోజుల పాటు శిక్షణ కూడా అందిస్తారు. బీసీలుగా నియమితులైన వారు బ్యాంకుల్లో రూ. 25వేలు డిపాజిట్ చేసి ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పారు.
గ్రామీణ ప్రజలకు తప్పనున్న బాధలు
గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుసేవలు లేక ప్రజలు మండల కేంద్రాలకు రాక తప్పని పరిస్థితి. బ్యాంకులో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా అదే పరిస్థితి. ఆర్‌బీఐ తీసుకొచ్చిన ఈ నూతన విధానం వల్ల ఏ గ్రామంలోని మహిళా సంఘాలు ఆ గ్రామంలోనే బ్యాంకు సేవలను అందిస్తూ ఆర్థిక లావాదేవీలు జరుపుతూ ఆ గ్రామ ప్రజలకు సేవలు అందించనున్నారు.
బిజినెస్ కరస్పాండెంట్లను గుర్తిస్తున్నాం
బిజినెస్ కరస్పాడెంట్ల ని యామకానికి ఇప్పటికే మండలాలకు ఆదేశాలు అందాయి. ఆయాగ్రామాల వారీగా ప్రక్రియ ప్రారంభమైంది. నెలలోగా బిజినెస్ కరస్పాండెంట్లను గుర్తిస్తాం.
– రామలింగం, డీపీఎం
Comments
Please login to add a commentAdd a comment