గ్రేడ్‌–2 సూపర్‌వైజర్లు వచ్చేస్తున్నారు | Telangana: Recruitment Process Completed For Grade 2 Supervisor Posts | Sakshi
Sakshi News home page

గ్రేడ్‌–2 సూపర్‌వైజర్లు వచ్చేస్తున్నారు

Published Mon, Nov 28 2022 1:41 AM | Last Updated on Mon, Nov 28 2022 7:11 AM

Telangana: Recruitment Process Completed For Grade 2 Supervisor Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో గ్రేడ్‌–2 సూపర్‌ వైజర్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. అర్హత పరీక్ష ఫలితాల విడుదల తర్వాత కోర్టు కేసులతో వివిధ దశల్లో నిలిచి తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన నియామకాల ప్రక్రియ సుఖాంతమైంది. నోటిఫికేషన్‌లో నిర్దేశించిన కోటాలో నూరుశాతం కొలువులు భర్తీ అయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా 426 మంది గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌ పోస్టులు దక్కించుకోగా... ఆదివారం సెలవు రోజైనప్పటికీ పలువురికి నియామక పత్రాలు జారీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో సూపర్‌వైజర్ల పాత్ర అత్యంత కీలకం. కేంద్రాల నిర్వహణలో అటు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇటు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు మధ్య వారధి పాత్రను పోషిస్తారు.

ఎనిమిది నెలల జాప్యానికి తెర
గతేడాది నవంబర్‌లో రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు, సంక్షేమ శాఖ పరిధిలో 426 అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ కొలువులకు ఆ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టుల్లో కొత్త అభ్యర్థులను కాకుండా ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారికే అవకాశం కల్పించింది. పదోతరగతి అర్హత, పదేళ్ల సర్వీసు ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఆ శాఖ... ఈ ఏడాది జనవరి మొదటి వారంలో అర్హత పరీక్ష నిర్వహించింది.

ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేసి ప్రాథమిక ఎంపిక జాబితాలను రూపొందించిన యంత్రాంగం.. చివరకు 1:2నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తదితర కార్యకలాపాలను పూర్తి చేసింది. అయితే నియామకాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని కొందరు, పనిచేస్తున్న జోన్‌లోనే పోస్టింగ్‌ ఇవ్వాలని మరికొందరు న్యాయ పోరాటానికి దిగారు. దీంతో ఈ ఏడాది మార్చిలో పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియలో ఏకంగా ఎనిమిది నెలల పాటు జాప్యం జరిగింది.

నేటి నుంచే విధుల్లోకి
తాజాగా కోర్టు తీర్పు ఇవ్వడంతో అందుకు లోబడి  మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నియామకాల ప్రక్రియను పూర్తి చేసింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంపికైన అభ్యర్థుల జాబితాలను అధికారులు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం పలువురు అభ్యర్థులు పోస్టింగ్‌ ఉత్తర్వులు అందుకున్నారు. వీరంతా సోమవారం విధుల్లో చేరిపోనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement