Grade-2 Supervisor
-
గ్రేడ్–2 సూపర్వైజర్లు వచ్చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో గ్రేడ్–2 సూపర్ వైజర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. అర్హత పరీక్ష ఫలితాల విడుదల తర్వాత కోర్టు కేసులతో వివిధ దశల్లో నిలిచి తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన నియామకాల ప్రక్రియ సుఖాంతమైంది. నోటిఫికేషన్లో నిర్దేశించిన కోటాలో నూరుశాతం కొలువులు భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 426 మంది గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులు దక్కించుకోగా... ఆదివారం సెలవు రోజైనప్పటికీ పలువురికి నియామక పత్రాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకం. కేంద్రాల నిర్వహణలో అటు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇటు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు మధ్య వారధి పాత్రను పోషిస్తారు. ఎనిమిది నెలల జాప్యానికి తెర గతేడాది నవంబర్‌లో రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు, సంక్షేమ శాఖ పరిధిలో 426 అంగన్వాడీ సూపర్వైజర్ కొలువులకు ఆ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల్లో కొత్త అభ్యర్థులను కాకుండా ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారికే అవకాశం కల్పించింది. పదోతరగతి అర్హత, పదేళ్ల సర్వీసు ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఆ శాఖ... ఈ ఏడాది జనవరి మొదటి వారంలో అర్హత పరీక్ష నిర్వహించింది. ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేసి ప్రాథమిక ఎంపిక జాబితాలను రూపొందించిన యంత్రాంగం.. చివరకు 1:2నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తదితర కార్యకలాపాలను పూర్తి చేసింది. అయితే నియామకాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని కొందరు, పనిచేస్తున్న జోన్లోనే పోస్టింగ్ ఇవ్వాలని మరికొందరు న్యాయ పోరాటానికి దిగారు. దీంతో ఈ ఏడాది మార్చిలో పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియలో ఏకంగా ఎనిమిది నెలల పాటు జాప్యం జరిగింది. నేటి నుంచే విధుల్లోకి తాజాగా కోర్టు తీర్పు ఇవ్వడంతో అందుకు లోబడి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నియామకాల ప్రక్రియను పూర్తి చేసింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంపికైన అభ్యర్థుల జాబితాలను అధికారులు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం పలువురు అభ్యర్థులు పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్నారు. వీరంతా సోమవారం విధుల్లో చేరిపోనున్నారు. -
సూపర్వైజర్ల రాత పరీక్ష: 305 పోస్టులకు 3887 మంది పోటీ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఒంగోలులో ఆదివారం జరగనున్న ఐసీడీఎస్ గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల రాత పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో 305 పోస్టులకు గాను 3887 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రకాశం నుంచి 1214 మంది, గుంటూరు నుంచి 1891, నెల్లూరు నుంచి 782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. అంగన్వాడీ కార్యకర్తలు, కాంట్రాక్టు సూపర్వైజర్లు, గ్రేడ్-1, గ్రేడ్-2 అంగన్వాడీ శిక్షణ కేంద్రాల్లో పనిచేసే కో ఆర్డినేటర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రూ.3 నుంచి రూ.5 లక్షలు? రెగ్యులర్ సూపర్వైజర్ పోస్టులు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉండడం.. ఇప్పుడు ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావడంతో దళారులు రంగంలోకి దిగారు. ఒక్కో పోస్టుకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు బేరసారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. వారి బుట్టలో పడిన కొంతమంది ముందుగా అడ్వాన్స్.. పోస్టింగ్ లభించాక మిగిలిన సొమ్ము ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారట. కాంట్రాక్ట్ సూపర్ వైజర్లనైతే ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఇక అధికారులను ప్రసన్నం చేసుకొనే పనిలో మరికొందరు బిజీగా ఉన్నారు. దళారుల మాటలు నమ్మొద్దు: ఆర్డీడీ సూపర్వైజర్ పోస్టులు ఇప్పిస్తామంటూ ప్రలోభాలు పెట్టేవారి మాటలను నమ్మి మోసపోవద్దని మహిళా శిశుసంక్షేమశాఖ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ కామేశ్వరమ్మ హెచ్చరించారు. ప్రతిభ, రోస్టర్ ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. పకడ్బందీగా నిర్వహించండి ఐసీడీఎస్ గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల రాత పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్ ఆదేశించారు. రాత పరీక్ష కోసం నియమించిన స్పెషల్ ఆఫీసర్లతో శనివారం సాయంత్రం స్థానిక సీపీఓ కార్యాలయ సమావేశపు హాలులో సమీక్షించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక స్పెషల్ ఆఫీసర్‌తోపాటు ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు, పంచాయతీరాజ్ ఏఈలను నియమించినట్లు తెలిపారు. అలాగే ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లను రూట్ ఆఫీసర్లుగా, మరో ఇద్దరు ఏఈలను ఫ్లయింగ్ స్క్వాడ్ కోసం కేటాయించామన్నారు. ఉదయం ఆరు గంటలకల్లా ట్రెజరీకి వెళ్లి ప్రశ్న, సమాధాన పత్రాలను తీసుకువెళ్లాలని చెప్పారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని.. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే సమాచారం అందించాలని కోరారు. -
సూపర్వైజర్ల పరీక్షపై సందిగ్ధం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రేడ్-2 సూపర్వైజర్ రెగ్యులర్ పోస్టుల భర్తీలో సందిగ్ధం నెలకొంది. పరీక్షలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ ఓ అంగన్వాడీ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించింది. కౌంటర్ ఇవ్వాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారులు మాత్రం ఈ నెల 27వ తేదీన యథావిధిగా రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు హైకోర్టు జోక్యం చేసుకోవడం.. ఇంకోవైపు రాత పరీక్ష నిర్వహిస్తుండటంతో సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మహిళా శిశు సంక్షేమశాఖ రీజినల్ పరిధిలో 305 పోస్టులకు 3,887 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష సమీపిస్తున్న సమయంలో అధికారుల తీరుపై హైకోర్టు జోక్యం చేసుకోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరిగిందంటే.. మహిళాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1,741 గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులకు ఈ ఏడాది జూలై 2వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశారు. అదేనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనలను ఆ శాఖ ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో సమస్య తలెత్తింది. ప్రభుత్వ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి 36 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. అయితే సూపర్వైజర్ పోస్టులకు మాత్రం వయసు పరిగణనలోకి తీసుకోకుండా నోటిఫికేషన్ జారీ చేయడంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ కో ఆర్డినేటర్ అండ్ ఇన్స్ట్రక్టర్ లకు 5శాతం రిజర్వేషన్ ఇస్తూ తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. జోనల్ క్యాడర్‌కు సంబంధించి ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ల విధానం కూడా చర్చకు దారితీసింది. కాంట్రాక్టు సూపర్వైజర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి ఏటా ఏప్రిల్‌లో కంటిన్యూషన్ ఆర్డర్ ఇస్తారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో వారికి కంటిన్యూషన్ ఆర్డర్ రాలేదు. కాంట్రాక్టు సూపర్వైజర్లు యథావిధిగా రెగ్యులర్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం.. వారికి హాల్‌టికెట్లు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టుల్లో అంగన్వాడీల నియామకాలకు అభ్యర్థుల వయసును కూడా పక్కన పెట్టారు. 21 సంవత్సరాలు నిండాలని నిబంధనలున్నా అంతకంటే తక్కువ వయసు వారికి కార్యకర్తలుగా పోస్టింగ్ ఇచ్చారు. వీటితో పాటు మరికొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ గుంటూరు జిల్లా పత్తిపాడు ప్రాజెక్టు పరిధిలోని పెదనందిపాడు అంగన్వాడీ కార్యకర్త ఎం.రమాదేవి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్డు న్యాయమూర్తులు చంద్రయ్య, కోదండరామ్‌లు సూపర్వైజర్ల పోస్టులకు సంబంధించి కౌంటర్ (డబ్ల్యుఏ 1746) ఇవ్వాలంటూ మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, సాధారణ పరిపాలనశాఖ కమిషనర్లతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ.. జరుగుతోంది మహిళా శిశు సంక్షేమశాఖలో అనేక సంవత్సరాల తరువాత రెగ్యులర్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అదే సమయంలో కొంతమంది దళారీలు రంగంలోకి దిగారు. బేరసారాలు సాగిస్తున్నారు. పోస్టు ఇప్పిస్తామంటూ పెద్దమొత్తంలో నగదు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థుల ఆతృతను ఆసరా చేసుకుని కొన్నిచోట్ల అడ్వాన్స్ కింద రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్న తమకు రెగ్యులర్ పోస్టు వస్తుందన్న ఆశతో కొంతమంది అభ్యర్థులు దళారులు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి కౌంటర్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో అభ్యర్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల అభ్యర్థులకు ఒంగోలులో నిర్వహించనున్న సూపర్వైజర్ పోస్టుల ఎంపిక పరీక్షకు ఈ నెల 27వ తేదీ ఉదయం 8గంటలకల్లా హాజరు కావాలని అధికారులు కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అదేరోజు ఉద్యోగులు జాతీయ రహదారి దిగ్బంధనానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకొని సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరుకాకుంటే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని ఐసీడీఎస్ ప్రాజెక్టులకు ఆదేశాలు వెళ్లాయి.