ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రేడ్-2 సూపర్‌వైజర్ రెగ్యులర్ పోస్టుల భర్తీలో సందిగ్ధం నెలకొంది. పరీక్షలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ ఓ అంగన్‌వాడీ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించింది. కౌంటర్ ఇవ్వాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారులు మాత్రం ఈ నెల 27వ తేదీన యథావిధిగా రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు హైకోర్టు జోక్యం చేసుకోవడం.. ఇంకోవైపు రాత పరీక్ష నిర్వహిస్తుండటంతో సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మహిళా శిశు సంక్షేమశాఖ రీజినల్ పరిధిలో 305 పోస్టులకు 3,887 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష సమీపిస్తున్న సమయంలో అధికారుల తీరుపై హైకోర్టు జోక్యం చేసుకోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
ఏం జరిగిందంటే..
మహిళాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1,741 గ్రేడ్-2 సూపర్‌వైజర్ పోస్టులకు ఈ ఏడాది జూలై 2వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశారు. అదేనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనలను ఆ శాఖ ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో సమస్య తలెత్తింది. ప్రభుత్వ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి 36 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. అయితే సూపర్‌వైజర్ పోస్టులకు మాత్రం వయసు పరిగణనలోకి తీసుకోకుండా నోటిఫికేషన్ జారీ చేయడంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా అంగన్‌వాడీ ట్రైనింగ్ సెంటర్ కో ఆర్డినేటర్ అండ్ ఇన్‌స్ట్రక్టర్ లకు 5శాతం రిజర్వేషన్ ఇస్తూ తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. జోనల్ క్యాడర్‌కు సంబంధించి ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ల విధానం కూడా చర్చకు దారితీసింది. కాంట్రాక్టు సూపర్‌వైజర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి ఏటా ఏప్రిల్‌లో కంటిన్యూషన్ ఆర్డర్ ఇస్తారు.
అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో వారికి కంటిన్యూషన్ ఆర్డర్ రాలేదు. కాంట్రాక్టు సూపర్‌వైజర్లు యథావిధిగా రెగ్యులర్ సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం.. వారికి హాల్‌టికెట్లు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీల నియామకాలకు అభ్యర్థుల వయసును కూడా పక్కన పెట్టారు. 21 సంవత్సరాలు నిండాలని నిబంధనలున్నా అంతకంటే తక్కువ వయసు వారికి కార్యకర్తలుగా పోస్టింగ్ ఇచ్చారు. వీటితో పాటు మరికొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ గుంటూరు జిల్లా పత్తిపాడు ప్రాజెక్టు పరిధిలోని పెదనందిపాడు అంగన్‌వాడీ కార్యకర్త ఎం.రమాదేవి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్డు న్యాయమూర్తులు చంద్రయ్య, కోదండరామ్‌లు సూపర్‌వైజర్ల పోస్టులకు సంబంధించి కౌంటర్ (డబ్ల్యుఏ 1746) ఇవ్వాలంటూ మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, సాధారణ పరిపాలనశాఖ కమిషనర్‌లతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ.. జరుగుతోంది
మహిళా శిశు సంక్షేమశాఖలో అనేక సంవత్సరాల తరువాత రెగ్యులర్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అదే సమయంలో కొంతమంది దళారీలు రంగంలోకి దిగారు. బేరసారాలు సాగిస్తున్నారు. పోస్టు ఇప్పిస్తామంటూ పెద్దమొత్తంలో నగదు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థుల ఆతృతను ఆసరా చేసుకుని కొన్నిచోట్ల అడ్వాన్స్ కింద రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్న తమకు రెగ్యులర్ పోస్టు వస్తుందన్న ఆశతో కొంతమంది అభ్యర్థులు దళారులు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధించి కౌంటర్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో అభ్యర్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.
పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలి
ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల అభ్యర్థులకు ఒంగోలులో నిర్వహించనున్న సూపర్‌వైజర్ పోస్టుల ఎంపిక పరీక్షకు ఈ నెల 27వ తేదీ ఉదయం 8గంటలకల్లా హాజరు కావాలని అధికారులు కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అదేరోజు ఉద్యోగులు జాతీయ రహదారి దిగ్బంధనానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకొని సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరుకాకుంటే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని ఐసీడీఎస్ ప్రాజెక్టులకు ఆదేశాలు వెళ్లాయి.
సూపర్‌వైజర్ల పరీక్షపై సందిగ్ధం
Published Sat, Oct 26 2013 5:38 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement