అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి బడులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సదాశివపేట, న్యూస్‌లైన్: అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి బడులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు 1 నుంచి అమలులోకి రానుంది. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. పని గంటలు పెంచడం ద్వారా పిల్లలకు ప్రాథమిక స్థాయి విద్యకు ముందే ఆటపాటలతో పాటు విద్యపై కనీస పరిజ్ఞానం పెంచి పాఠశాలల్లో రోజంతా గడిపే విధంగా సన్నద్ధం చేయాలనే అలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులు తెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రాల పనివేళలు
అంగన్‌వాడీ కేంద్రాలు గతంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకే పనిచేసేవి. అయితే ప్రభుత్వం సమగ్ర శిశు సంరక్షణ పథకాన్ని బలోపేతం చేసేందుకు పనిగంటలను పెంచాలని నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేంద్రాలను నిర్వహించాలని శ్రీ శిశు సంక్షేమ శాఖా ముఖ్య కార్యదర్శి నీలం సహానీ ఈనెల 21న ఉత్తర్వులు జారీ చేసినట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.
కార్యకర్తలు, అయాలకు వేతనాల పెంపు
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలందించాల్సి ఉంటుంది. పనిగంటలు పెరగడంతో పాటు సంబంధిత అంగన్‌వాడీల వేతనాలను కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కార్యకర్తలకు రూ. 3700 వేతనం చెల్లిస్తున్న ప్రభుత్వ మరో రూ. 500 అదనంగా పెంచుతూ రూ. 4200 చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. అదే విధంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో అయాలుగా పనిచేస్తున్న వారికి గతంలో రూ. 1950 చెల్లిస్తుండగా ప్రస్తుతం వారికి కూడా మరో రూ. 250 అదనంగా పెంచారు. అయాలకు మొత్తంగా రూ. 2200 చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అంగన్‌వాడీ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. పనిగంటలు పెంచిన ప్రభుత్వం వేతనాలు స్పల్పంగా పెంచి చేతులు దులుపుకుందని వారు విమర్శిస్తున్నారు. కనీసవేతనా చట్టం అమలు చేసి పని వేళలు పెంచాలని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేస్తున్నారు.
లక్ష్యం నెరవేరేనా..
గ్రామీణ ప్రాంతాల్లో చాలమంది చిన్న పిల్లలు, గర్భిణులు పౌష్టి కాహారం లోపానికి గురవుతున్నారని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వారిలో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు కోడిగుడ్లు ఇతర పౌష్టికాహారన్ని అందిస్తుంది.
అయితే లబ్ధిదారులకు అందవలసిన పౌష్టికాహారం చాల చోట్ల పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న కార్యకర్తలకు ఇంటింటా సర్వే, ఓటర్ల నమోదు లాంటి అదనపు విధులు కేటాయించడం కూడా అంగన్‌వాడీల పనితీరు మెరుగుపడకపోవడానికి కారణమనే విమర్శలు వినవస్తున్నాయి.