సమన్వయంతో పనిచేయండి
ఆరోగ్యం, విద్య, నిర్దేశిత నిలయాలుగా అంగన్‌వాడీలను తీర్చిదిద్దాలి
సమీక్ష సమావేశంలో ఐసీడీఎస్ కార్యదర్శి జగదీశ్వర్, డెరైక్టర్ విజయేంద్ర
ఆరోగ్యం, విద్య, నిర్దేశిత నిలయాలుగా అంగన్‌వాడీలను తీర్చిదిద్దేందుకు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డెరైక్టర్ విజయేంద్రలు సూచించారు. గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్టం చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో 1178 అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు రూ.58.81 కోట్ల పనులు మంజూరైనట్లు తెలిపారు. శుక్రవారం జిల్లాపరిషత్‌లో సీడీపీవోలు, పంచాయతీ రాజ్ విభాగం ఈఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇందూరు : ఆరోగ్యం, విద్య, నిర్ధేశిత నిలయాలుగా అంగన్‌వాడీలను తీర్చిదిద్దేందుకు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డెరైక్టర్ విజయేంద్రలు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన వీరు కామారెడ్డి ప్రాజెక్టులోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని స్థానిక జిల్లాపరిషత్‌లో సీడీపీవోలు, పంచాయతీ రాజ్ విభాగం ఈఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియం బోధనపై పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఆరేళ్లలోపు పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో ఎల్‌కేజీ, యూకేజీ బోధనను అమలు చేసేందుకు గ్రామస్థాయి కార్యరచణ రూపొందించాలని సూచించారు.
గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధులతో సహకారంతో అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్టం చేయాలన్నారు. ఆరోగ్యలక్ష్మి, మార్పు కార్యక్రమాలపై అంగన్‌వాడీ కార్యకర్తలకు సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత సీడీపీవోలు, సూపర్‌వైజర్‌లపై ఉందన్నారు. ఆర్‌ఐడీఎఫ్, ఇతర పథకాల కింద నిజామాబాద్ జిల్లాలో 1178 అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు రూ. 58.81 కోట్ల విలువైన పనులు మంజూరైనట్లు తెలిపారు. వాటిలో 393 పనులు పూర్తయ్యాయని, మరో 261 పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. నాబార్డు ఆర్థిక సమాయంతో ఆర్‌ఐడీఎఫ్-16,19 పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ యోగితా రాణా మాట్లాడుతూ.. మహిళా, శిశు సంక్షేమ శాఖ నిధులతో ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ భవనాలను ఉపాధిహామీ నిధులతో అనుసంధానం చేసి పూర్తి చేయించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్‌జేడీ రాములు, ఐసీడీఎస్ పీడీ శారద, పంచాయతీరాజ్ ఎస్‌ఈ సత్యమూర్తి, సీడీపీవోలు తదితరులు పాల్గొన్నారు.
సఖీ కేంద్రం పరిశీలన
జిల్లా పర్యటనకు వచ్చిన ఐసీడీఎస్ సెక్రటరీ, డెరైక్టర్లు జెడ్పీ సమీక్ష సమావేశానికి ముందు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గల సఖీ (నిర్భయ) సెంటర్‌ను పరిశీలించారు. సెంటర్‌లో ఉద్యోగుల పనితీరు, కేసుల నమోదు, తక్షణ సాయం, వైద్యం, న్యాయ సలహాలపై లీగల్ కౌన్సిలర్ నీరజా రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గృహహింస, అత్యాచార, దాడులకు గురైన మహిళలకు న్యాయం చేయాలని సూచించారు.