బాల్యం.. బలహీనం | Telangana Children Very Weak Due To Malnutrition | Sakshi
Sakshi News home page

బాల్యం.. బలహీనం

Published Sat, Mar 6 2021 2:53 AM | Last Updated on Sat, Mar 6 2021 5:24 AM

Telangana Children Very Weak Due To Malnutrition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘తిండి కలిగితే కండ కల దోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌’అన్నాడు కవి గురజాడ. సమయానుకూలంగా ఆహారం తీసుకోక పోవడంతో అనర్థాలు తలెత్తుతాయి. గర్భిణులు, బాలింతలు సరైన ఆహారం తీసుకోక పోవడం పుట్టబోయే, పుట్టిన పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పుట్టినప్పటి నుంచి ఆర్నెల్ల వరకు పిల్లలు తల్లిపాల పైనే ఆధారపడతారు. తల్లి సరైన ఆహారం తీసుకోకుంటే పిల్లలకు సరిపడా పాలు అందక సమస్యల బారినపడే ప్రమాదం ఉం టుంది. అంగన్‌వాడీల్లో నమోదైన ప్రతి 100 మంది చిన్నారుల్లో 15 మంది పౌష్టికాహార లోపంతో సతమతమవుతున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిశీలన చెబుతోంది.

2.16 లక్షల మంది చిన్నారుల పరిశీలన
రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నా రుల ఆరోగ్య స్థితిని వారి బరువు ఆధారంగా నిర్ధారిస్తున్నారు. ఈ క్రమంలో పక్షం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న 2,16,044 మంది చిన్నారుల బరువును కొలిచారు. వీరిలో 1,34,429 మంది చిన్నారులు సాధారణ బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. మరో 33,034 మంది చిన్నారులు సాధారణ బరువు కంటే 15– 25 శాతం తక్కువగా ఉన్నారు. వీరిలో 8,191 మంది చిన్నారులు 35 శాతం కంటే తక్కువ బరువున్నట్లు తేల్చారు. ఆరోగ్యంగా ఉన్న చిన్నా రుల విషయంలో తల్లిదండ్రులకు సలహాలు, సూచ నలు ఇచ్చి సరిపెట్టగా... బరువు తక్కువున్న చిన్నా రుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని నిర్ణ యించారు. అదేవిధంగా ఆ పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే సాధారణ ఆహారంతో పాటు మరింత పోషకాలు అందే విధంగా అదనపు కోటా కింద ఆహార పంపిణీ చేయనున్నారు. ఈ రకం పిల్లలను ప్రతివారం పరిశీలించి ఆరోగ్య స్థితిని అంచనా వేయనున్నారు. మరో 48,581 మంది చిన్నారులు నిర్ణీత బరువు కంటే అధికంగా (ఓవర్‌ వెయిట్‌) ఉన్నట్లు గుర్తించారు. ఈ పిల్లల తల్లులకు సరైన జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే ఊబకాయం బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా పిల్లలకు ఇచ్చే ఆహారం క్రమపద్దతిలో ఉండాలని సూచిస్తూ మెనూను రూపొందించి ఇస్తున్నారు.



పౌష్టిక పునరావాసానికి 1.2 శాతం పిల్లలు
బరువును అంచనా వేస్తూ పిల్లల ఆరోగ్యస్థితిని గుర్తిస్తున్న అధికారులు... ప్రమాదకరంగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ప్రస్తుతం బరువును పరిశీలించిన వారిలో 2,658 మంది చిన్నారులు తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిని ఎన్‌ఆర్‌సీ (న్యూట్రీషియన్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌)కి రిఫర్‌ చేస్తూ కొంతకాలం అక్కడే ఉండేలా అడ్మిట్‌కు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా 23,917 పిల్లల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. ఈ చిన్నారుల కోసం ప్రత్యేక రిజిస్టర్‌ నిర్వహించి ఆరోగ్య స్థితిని నమోదు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు వైద్యశాఖ సిబ్బందిని ఆదేశించారు.

విటమిన్లు, మినరల్స్‌పై దృష్టి పెట్టాలి
పిల్లలకు ఆహారాన్ని ఇచ్చే విషయంలో చాలామంది పరిమాణం (క్వాంటిటీ) పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ సమయంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అందిస్తుంటారు. విటమిన్లు, మినరల్స్‌ ఉండే ఆహారాన్ని పెద్దగా పట్టించుకోరు. పిల్లలకు ఐరన్, కాల్షియం ఉన్న ఆహారం సమపాళ్లలో ఇస్తేనే వారి ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ఏడాది దాటిన చిన్నారులకు అన్నిరకాల ఆహారాన్ని ఇవ్వొచ్చు. బలవర్ధకమైన ఆహారం పేరిట మార్కెట్లో దొరికే డబ్బాల కంటే ఇంట్లో తయారు చేసే ఉగ్గు శ్రేష్టమైనది. ఈ ఉగ్గులో తృణదాణ్యాలను కలిపి తయారు చేస్తే మంచిది. 
- డాక్టర్‌ స్పందన, న్యూట్రిషనిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement