వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఫలితాలు విడుదల
కలెక్టరేట్, న్యూస్‌లైన్: నౌకరీ వచ్చిందో రాలేదో అభ్యర్థులందరిలో ఒకటే టెన్షన్. ఒక్కో వీఆర్‌ఓ పోస్టు కోసం 527 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, ఒక్కో వీఆర్‌ఏ పోస్టు కోసం 13 మంది పోటీలో ఉన్నారు. ఇంత గట్టిపోటీ మధ్య జరిగిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్ష ఫలితాలు వెల్లడి కావడంతో అభ్యర్థులు ఉత్కంఠకు గురయ్యారు. నసీబ్‌లో సర్కారీ నౌకరీ ఉందో లేదో తెల్సుకోడానికి ఇంటర్నెట్ సెంటర్ల ముందు క్యూకట్టారు. అనుకున్న మార్కులు దక్కి ఉద్యోగం పొందే అవకాశం ఉన్న అభ్యర్థులు ఆనందపు డోలికల్లో మునిగిపోయారు. ఈ ‘సారీ’ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయిన అభ్యర్థులు ఎప్పటిలాగే నిరుత్సాహానికి గురయ్యారు.
‘బిజిలీ’ చమ్కీ
వీఆర్‌ఓ పరీక్ష ఫలితాల్లో రేగోడ్‌కు చెందిన బిజిలీపురం ఆ దర్శ కుమార్ 98 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. ఇక వీఆర్‌ఓ పరీక్ష ఫలితాల్లో నారాయణఖేడ్‌కు చెందిన జన్వాడ అజయ్‌కుమార్ 88 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. అయితే, అజయ్‌కుమార్ వీఆర్‌ఓ పరీక్షలోనూ 92 మార్కులు సాధించడంతో ఆయనకువీఆర్‌ఓ కొలువు దక్కే అవకాశముంది. వీఆర్‌ఓ పరీక్ష ఫలితాల్లో సదాశివపేట మండలం నిజాంపూర్‌కు చెందిన రాఘవేందర్‌గౌడ్‌కు 91 మార్కులు దక్కించుకున్నారు. తమ పేర్లకు తగ్గ ట్టు రెండు విభాగాల్లో టాపర్లుగా నిలిచి వీళ్లిద్దరూ సార్థక నా మధేయులు అనిపించుకున్నారు. బిజిలీపురం ఆదర్శ్ కుమార్ వీఆర్‌ఓ టాపర్‌గా నిలిచి బిజిలీ(మెరుపు)లా మెరిసీ ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. అజయ్ కుమార్ వీఆర్‌ఏలో జిల్లా టాపర్‌గా నిలవడమే కాకుండా వీఆర్‌ఓలో సైతం సత్తా చాటి అజేయుడనిపించుకున్నాడు.
నా టార్గెట్ ఐఏఎస్
నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చది వించారు. వీఆర్‌ఓ ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. నా టార్గెట్ మాత్రం ఐఏఎస్. కలెక్టర్‌గా పేదలకు సేవలందిస్తూ నా తల్లిదండ్రులు, నా ప్రాంతానికి మంచి పేరుతేవాలని ఉంది. ఆ దిశగానే ముందుకు సాగుతున్నా.
- ఆదర్శ్, వీఆర్‌ఓ జిల్లా టాపర్
ఉన్నత ఉద్యోగమే లక్ష్యం
వీఆర్‌ఏ ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. వీఆర్‌ఓ ఫలితాల్లో కూడా 92 మార్కులు వచ్చాయి. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన ప్రస్తుతం గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. ఎప్పటికైనా ఉన్నత ఉద్యోగం పొందడమే నా లక్ష్యం. ఇది చిన్న మజిలీ మాత్రమే. కల్హేర్ మండలం ముబారక్‌పూర్‌లోని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి నేను మరింతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నా.
-అజయ్‌కుమార్, వీఆర్‌ఏ జిల్లా టాపర్
హిప్ హిప్ హుర్రే
Published Sat, Feb 22 2014 11:58 PM | Last Updated on Mon, Oct 8 2018 7:43 PM
Advertisement