జహీరాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ముందు వర్షంలోనూ నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలు
సాక్షి హైదరాబాద్/హన్వాడ/మహమ్మదాబాద్: శాసనసభలో సీఎం ప్రకటించిన విధంగా తమకు పేస్కేళ్లు, పదోన్నతులు, అర్హులైన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండ్లతో మొదలైన వీఆర్‌ఏల సమ్మె మరింత ఉధృతమైంది. సోమవారం 78వ రోజు సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు.
ధర్నాలు, బైఠాయింపులు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఎమ్మార్వో ఆఫీసులకు తాళాలు వేయడంతో లోపలున్న అధికారులు బయటకు రాలేక, బయట ఉన్నవారు లోపలికి వెళ్లలేక రెవెన్యూ సేవలు నిలిచిపోయాయి. ఇలావుండగా సమ్మె నేపథ్యంలో సోమవారం మరో వీఆర్‌ఏ మరణించగా, మరో వీఆర్‌ఏ కుమారుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది.
పండుగ రోజు కూడా పస్తులు: జేఏసీ
78 రోజులుగా సమ్మె చేస్తూ వీధుల పాలైన తమను చర్చలకు పిలిచిన ప్రభుత్వం, మధ్యలోనే వదిలేయటం దారుణమని వీఆర్‌ఏల జేఏసీ నాయకులు మండిపడ్డారు. సమ్మె ప్రారంభమైన తర్వాత 65 మంది వీఆర్‌ఏలు మరణించారని తెలిపారు. దసరా రోజు కూడా తమ కుటుంబాలు పస్తులున్నాయని, పిల్లలకు బట్టలు కూడా కొనివ్వలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు మహిళా గర్జన: తమను చర్చలకు పిలిచిన ప్రభుత్వం, పరిష్కారం చూపనందుకు నిరసనగా ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన వీఆర్‌ఏ జేఏసీ, మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా గర్జన నిర్వహించనుంది. 14వ తేదీన గ్రామాల్లో భిక్షాటన చేయాలని, 15వ తేదీన యాదాద్రి నుంచి ప్రగతిభవన్ వరకు పాదయాత్ర నిర్వహించాలని, 17 నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. కాగా తమ సంఘాలకు గౌరవ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న సీపీఎం, సీపీఐ నేతలు.. మునుగోడు ఉప ఎన్నిక లో టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తూ, తమ ఆందోళనను ప ట్టించుకోకపోవటంపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు.
వేతనం రాక.. వైద్యం అందక..
హన్వాడ మండలం యారోనిపల్లికి చెందిన బాలకిష్టయ్య (56) గ్రామ వీఆర్‌ఏగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య లింగమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారులు ముగ్గురూ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. సమ్మె కారణంగా జీతం నిలిచిపోవడంతో బాలకిష్టయ్యకు కుటుంబపోషణ భారంగా మారింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. సోమవారం చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించే క్రమంలోనే బాలకిష్టయ్య మృత్యువాత పడ్డాడు.
తండ్రి తరఫున ఆందోళనలో పాల్గొని..
సోమవారం తహసీల్దార్ కార్యాలయాల ముట్టడికి జేఏసీ పిలుపునివ్వగా, అనారోగ్యంతో ఉన్న అన్నారెడ్డిపల్లి వీఆర్‌ఏ అన్నేమోని వెంకటయ్య తనకు బదులుగా కుమారుడు మారుతిని ఆందోళన కార్యక్రమానికి పంపించాడు. వీఆర్‌ఏలు మహమ్మదాబాద్ ప్రధాన కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపడుతుండగా.. మారుతి ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకొని, నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. విషయం గమనించిన వీఆర్‌ఏలు వెంటనే అతని వద్ద ఉన్న పెట్రోల్ సీసాను లాగేసుకున్నారు. కళ్లలో ఇబ్బందిగా ఉండడంతో మహబూబ్‌నగర్‌కు తరలించి చికిత్స చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment