Tasildar office
-
భూమి కోల్పోయాననే ఆవేదనతో..
ఇల్లెందురూరల్: ప్రభుత్వ శాఖల సమన్వయలోపం వల్లే తనకు భూ సమస్య ఏర్పడిందని ఓ మాజీ నక్సలైట్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అక్కడున్న ప్రజలు అతడిపై నీళ్లు చల్లి అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇల్లెందుకు చెందిన కొడెం సమ్మయ్య పీపుల్స్‌వార్‌లో సుదీర్ఘ కాలం పనిచేసి, 2008లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ సమయంలో పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు పునరావాసం కింద 1.20 ఎకరాల భూమినికి అతడికి కేటాయించారు. ఆ భూమిని వైటీసీ నిర్మాణానికి మళ్లీ అధికారులు స్వా ధీనం చేసుకుని, సుభాష్‌నగర్ గురుకులం వెనుక ఇచ్చారు. అయితే ఆ భూమిని ఓ పార్టీకి చెందిన నేత ఆక్రమించుకోవడంతో న్యాయంకోసం సమ్మయ్య కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరాడు. స్థానిక రెవెన్యూ అధికారుల సూచనతో అతడికి కేటాయించిన భూమిలో గుడిసె వేసుకుంటే, సదరు నేత ఫిర్యాదుతో పోలీసులు సమ్మయ్యను అడ్డుకుంటున్నారు. అధికారికపత్రం లేకుండా సమ్మయ్యను భూమి జోలికి వెళ్లొద్దని పోలీసులు చెబుతుండగా..మరోవైపు భూమిహక్కుకు సంబంధించి రెవెన్యూ అధికారులు స్పష్టమైన పత్రాలు ఇవ్వకపోవడంతో వారిపై న్యాయపోరాటం చేసేందుకు అతడికి అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా అక్కడే ఉన్న కార్యాలయ సిబ్బంది, ప్రజలు అతడిపై నీళ్లు చల్లి అడ్డుకున్నారు. కాగా, ఈ ఘటనపై తహసీల్దార్ కృష్ణవేణి స్పందిస్తూ రెండు రోజుల్లో సమ్మయ్యకు భూమి అప్పగింతపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ప్రెటోల్, పురుగు మందుతో..
చివ్వెంల (సూర్యాపేట): తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యురాలు ధరావతు బుచ్చమ్మ కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఐలాపురం గ్రామ ఆవాసం అంగోతు తండాకు చెందిన ధరావతు లచ్చిరాం, బుచ్చమ్మ భార్యాభర్తలు. 2013లో లచ్చిరాం కుమారుడు హరిసింగ్ 3 ఎకరాల భూమిని రఫీ అనే వ్యక్తికి విక్రయించాడు. అలాగే 2016లో తన బాబాయ్ కుమారుడు వెంకన్న వద్ద హరిసింగ్ 22 గుంటలను కొనుగోలు చేసి డబ్బులు కూడా చెల్లించాడు. అయితే ఆ భూమిని వెంకన్న ఇంతవరకు హరిసింగ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించలేదని చెపుతున్నారు. ఇటీవల ఆ భూమిని వెంకన్న అదే తండాకు చెందిన మరొకరికి విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో హరిసింగ్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వెంకన్నకు తమకు మధ్య జరిగిన విక్రయ దస్తావేజులు చూపించి సంబంధిత భూమిని వేరే ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయవద్దని కోరాడు. అయితే అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని, దీనికి తోడు గతంలో తాము విక్రయించిన 3 ఎకరాల భూమి తక్కువగా ఉందని, రఫీ పక్కనే ఉన్న తమ భూమిలో సుమారు 20 గుంటల్లో హద్దురాళ్లు పాతి ఆక్రమించాడని హరిసింగ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు హరిసింగ్ భార్య ఆమని పురుగు మందు తాగి, కూతురు శకుంతల పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో పక్కన ఉన్నవారు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమని సొమ్మసిల్లిపోవడంతో ఆమెను సూర్యాపేటలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా తాను కొన్న భూమిలో 11 గుంటలు తక్కువ ఉందని, ఈ విషయాన్ని లచ్చిరాం కుటుంబ సభ్యులకు తెలపగా, పెట్రోల్ పోసుకుని తనను బెదిరిస్తున్నారని రఫీ మీడియాకు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
వీఆర్ఏల నిరసన హోరు
సాక్షి హైదరాబాద్/హన్వాడ/మహమ్మదాబాద్: శాసనసభలో సీఎం ప్రకటించిన విధంగా తమకు పేస్కేళ్లు, పదోన్నతులు, అర్హులైన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండ్లతో మొదలైన వీఆర్ఏల సమ్మె మరింత ఉధృతమైంది. సోమవారం 78వ రోజు సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ధర్నాలు, బైఠాయింపులు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఎమ్మార్వో ఆఫీసులకు తాళాలు వేయడంతో లోపలున్న అధికారులు బయటకు రాలేక, బయట ఉన్నవారు లోపలికి వెళ్లలేక రెవెన్యూ సేవలు నిలిచిపోయాయి. ఇలావుండగా సమ్మె నేపథ్యంలో సోమవారం మరో వీఆర్ఏ మరణించగా, మరో వీఆర్ఏ కుమారుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. పండుగ రోజు కూడా పస్తులు: జేఏసీ 78 రోజులుగా సమ్మె చేస్తూ వీధుల పాలైన తమను చర్చలకు పిలిచిన ప్రభుత్వం, మధ్యలోనే వదిలేయటం దారుణమని వీఆర్ఏల జేఏసీ నాయకులు మండిపడ్డారు. సమ్మె ప్రారంభమైన తర్వాత 65 మంది వీఆర్ఏలు మరణించారని తెలిపారు. దసరా రోజు కూడా తమ కుటుంబాలు పస్తులున్నాయని, పిల్లలకు బట్టలు కూడా కొనివ్వలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మహిళా గర్జన: తమను చర్చలకు పిలిచిన ప్రభుత్వం, పరిష్కారం చూపనందుకు నిరసనగా ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన వీఆర్ఏ జేఏసీ, మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా గర్జన నిర్వహించనుంది. 14వ తేదీన గ్రామాల్లో భిక్షాటన చేయాలని, 15వ తేదీన యాదాద్రి నుంచి ప్రగతిభవన్ వరకు పాదయాత్ర నిర్వహించాలని, 17 నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. కాగా తమ సంఘాలకు గౌరవ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న సీపీఎం, సీపీఐ నేతలు.. మునుగోడు ఉప ఎన్నిక లో టీఆర్ఎస్కు మద్దతిస్తూ, తమ ఆందోళనను ప ట్టించుకోకపోవటంపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు. వేతనం రాక.. వైద్యం అందక.. హన్వాడ మండలం యారోనిపల్లికి చెందిన బాలకిష్టయ్య (56) గ్రామ వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య లింగమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారులు ముగ్గురూ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. సమ్మె కారణంగా జీతం నిలిచిపోవడంతో బాలకిష్టయ్యకు కుటుంబపోషణ భారంగా మారింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. సోమవారం చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించే క్రమంలోనే బాలకిష్టయ్య మృత్యువాత పడ్డాడు. తండ్రి తరఫున ఆందోళనలో పాల్గొని.. సోమవారం తహసీల్దార్ కార్యాలయాల ముట్టడికి జేఏసీ పిలుపునివ్వగా, అనారోగ్యంతో ఉన్న అన్నారెడ్డిపల్లి వీఆర్ఏ అన్నేమోని వెంకటయ్య తనకు బదులుగా కుమారుడు మారుతిని ఆందోళన కార్యక్రమానికి పంపించాడు. వీఆర్ఏలు మహమ్మదాబాద్ ప్రధాన కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపడుతుండగా.. మారుతి ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకొని, నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. విషయం గమనించిన వీఆర్ఏలు వెంటనే అతని వద్ద ఉన్న పెట్రోల్ సీసాను లాగేసుకున్నారు. కళ్లలో ఇబ్బందిగా ఉండడంతో మహబూబ్‌నగర్‌కు తరలించి చికిత్స చేయించారు. -
‘పట్టా’లెక్కని ధరణి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘మా నాయిన అరవై రెండేళ్ల కింద 1.28 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆయన పేరుమీద పాస్ పుస్తకం కూడా ఉంది. నా యిన చనిపోయిన తర్వాత నా పేరుమీద 1.04 ఎకరాల భూమి మాత్రమే పట్టా వచ్చింది. మిగతా 24 గుంటల భూమి నాపేరిట పట్టా చేయడం లేదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగి నా సమాధానం చెప్పేవారే లేదు. ఇది ఎవరి మాయో అర్థం కావడం లేదు’’.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన గుండగాని సోమయ్య బాధ ఇది. ఆయన ఒక్కరే కాదు.. పెద్ద సంఖ్యలో రైతులు ఇలా ఆగమవుతున్నారు. భూమి ఉన్నా పట్టాదారు పుస్తకం లేకపోవడం, పాస్ పుస్తకంలో భూమి ఉన్నా పొజిషన్లో లేకపోవడం, తండ్రి నుంచి వారసత్వంగా రావాల్సిన ఫౌతి కోసం ధరణిలో ఆప్షనే లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. శనివారం సూర్యాపేట జిల్లా వెంపటిలో నల్సార్ యూనివర్సిటీ అనుబంధ ఆచార్యుడు భూమి సునీల్, తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపకుడు వి.లచ్చిరెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి భూన్యాయ శిబిరంలో ఏకంగా రెండు వందల మంది రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. ధరణి వచ్చాక కూడా ఈ ఒక్క గ్రామంలోనే 30శాతం భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని.. ఒకరి భూములు మరొకరి పేరిట నమోదయ్యాయని గుర్తించారు. ఈ గ్రామంలో సర్వే నంబర్ల వారీగా పరిశీలన చేశాక.. సుమారు 40శాతం మందికి చిన్న, పెద్ద సమస్యలున్నట్టు గుర్తించారు. ధరణిలో దరఖాస్తు చేస్తే సులువుగా పరిష్కారమయ్యే వాటిని గుర్తించి.. అప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలు నమోదు చేశారు. ప్రధాన భూ సమస్యలివీ.. ►చాలా మంది రైతులు సాదా బైనామాల ద్వారా భూములు కొని క్రమబద్ధీకరణకు దరఖాస్తులు పెట్టుకున్నారు. కొందరి దగ్గర రశీదులు ఉన్నాయి, మరికొందరి దగ్గర లేవు. అయితే చాలా మందికి క్రమబద్ధీకరణ జరగలేదు. కొంత మందికి 13బి సర్టిఫికెట్ వచ్చిందిగానీ.. ఆ సర్టిఫికెట్తో పాస్ పుస్తకం పొందే ఆప్షన్ ధరణిలో లేదు. ►పట్టా భూములై ఉండి కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడం, భూవిస్తీర్ణాల్లో హె చ్చుతగ్గులు రావడం, ఒకరి విస్తీర్ణం మరొకరికి పేరుపైన చేర్చడం వంటి సమస్యలు ఉన్నాయి. ►అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసిన నిరుపేదలకు రీఅసైన్మెంట్ జరగలేదు. రీఅసైన్మెంట్ జరిగి పట్టాలు వచ్చినా ధరణిలో ఆప్షన్ లేకపోవడం వల్ల పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. ►భూసర్వేకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గెట్టు తగాదాలు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. భూసర్వే కోసం దరఖాస్తు చేసినా సర్వే జరగలేదు. ►ఇప్పటికే ధరణిలో దరఖాస్తు చేసుకున్నవేగాక.. ఇంకా దరఖాస్తు చేసుకోనివీ ఉన్నాయి. మరికొన్ని భూములకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం కానివి, అసలు దరఖాస్తు చేసుకోవడానికే ధరణిలో అవకాశం లేనివి ఉన్నాయి. సర్వే రిపోర్టు ఇచ్చినా.. నాకు సర్వే నంబర్ 680లో ఎస్సారెస్పీ కాలువ పోగా.. ఇంకా 2.39 ఎకరాల భూమి ఉంది. ఏడాది తర్వాత ఎస్సారెస్పీ కాలు వ కింద 1.10 ఎకరాల భూమి పోయిందంటూ ఆన్లైన్లో తొలగించారు. నేను తహసీల్దార్ దగ్గరికి వెళ్లగా సర్వే చేయించి రిపోర్టు ఇవ్వాలని సూచించారు. సర్వే చేయించి రిపోర్టు ఇచ్చినా ఇప్పటికీ మొత్తం భూమిని ఆన్లైన్లో చూపించడం లేదు. – కొండ నర్సయ్య, రైతు, వెంపటి ధరణితో మేలు జరగలేదు నాకు వెంపటి గ్రామ శివారులోని 217 సర్వే నంబర్లో 1.38 ఎకరాల భూమి ఉండగా 1.10 ఎకరం మాత్రమే పట్టా అయింది. అలాగే సర్వే నం.1,014లో 3 ఎకరాల భూమి ఉండగా.. కాలువకు అరె కరం భూమి పోయింది. 2.20 ఎకరాల భూమికి పట్టా రావాల్సి ఉండగా ఎకరానికే పట్టా పుస్తకం వచ్చిం ది. మిగతా భూమికి రైతుబంధు పడటం లేదు. ధరణి వచ్చినా నాకు మేలు జరగలేదు. – గుండగాని మల్లయ్య, రైతు, వెంపటి కొత్త పట్టా పుస్తకం ఇవ్వడం లేదు నాకు 25 గుంటల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి 2008లో పట్టా పొందాను. ధరణి వచ్చిన తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ ఇవ్వలేదు. రెవెన్యూ అధికారులను అడిగితే సర్వే చేయించుకోవాలని చెప్పారు. సర్వే చేసిన తర్వాత 2020 నవంబర్‌లో దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటికీ కొత్త పట్టాపాస్ బుక్ రాలేదు. – పుల్లూరి వెంకటేష్, రైతు, వెంపటి. రెవెన్యూ వలంటీర్ వ్యవస్థ అవసరం ‘‘గ్రామ స్థాయిలోనే భూపరిపాలన, భూములు, వాటి సమస్యల మీద అవగాహన ఉన్న యంత్రాం గాన్ని ఉంచడం, ఇంతకుముందు ఉన్నట్టు పారా లీగల్ లేదా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లేదా వలంటీర్ల వ్యవస్థ ఉండటం అవసరం. వీలైనంత త్వరగా భూముల సర్వే చేయాలి. సర్వే చేస్తే తప్ప చాలా సమస్యలు పరిష్కారం కావు. ధరణిలో తప్పొప్పులను సవరించడానికి గ్రామ స్థాయిలోనే శిబిరాలు నిర్వహించి ఏవైనా సమస్యలు వస్తే అక్కడికక్కడే పరిష్కరించాలి’’ – ల్యాండ్ సునీల్, భూ చట్టాల నిపుణుడు అవగాహన లోపాలతోనే.. ‘‘అసలు భూసమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదనే మూలాల్లోకి వెళ్లి చూస్తే.. చాలా మందికి అవగాహన లోపం ఉందని తెలుస్తుంది. భూమి హక్కులు సరిగ్గా ఉన్నాయా లేదా, సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలనేది తెలియడం లేదు. రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరగాలి. రైతులకు ఏయే భూసమస్యలు ఉన్నాయో గుర్తించి గ్రామస్థాయిలోనే పరిష్కరించాలి. లీఫ్స్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం భూ న్యాయ సహాయ శిబిరాలను రాష్ట్రమంతటా నిర్వహిస్తాం’’ – వి.లచ్చిరెడ్డి, ఫౌండర్ ప్రెసిడెంట్, తెలంగాణ తహసీల్దార్ల సంఘం -
ఆ సార్‌కి.. డ్యూటీ కంటే మద్యం ముద్దు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రభుత్వ పనిని దేవుని పనిగా భావిస్తారు. అయితే ఆ పని వదిలేసి ఫుల్లుగా తాగి రోడ్డు మీద పడిపోయాడో ఉద్యోగి. ఈ సంఘటన బెళగావి జిల్లా సవదత్తి తాలూకా తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. సంజు బెన్నె గొరవనకొళ్ల గ్రామ విలేజ్ అకౌంటెంట్‌గా ఉన్నాడు. అయితే విధులకు సరిగా హాజరవకుండా మద్యం తాగి వస్తుండడంతో అతన్ని అక్కడి నుండి తాలూకాఫీసుకు మార్చారు. ఇక్కడా అదే తంతు. తాగిన మత్తులో ప్రజలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. బుధవారం కూడా మద్యం తాగి వాహనాలు పార్కింగ్ చేసే చోట పడిపోయాడు. ఇటువంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు తహసీల్దార్‌ను డిమాండు చేశారు. చదవండి: పిల్లల్ని కంటారా... లేదంటే ఐదు కోట్లిస్తారా? -
భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడంతో
నంగునూరు (సిద్దిపేట): కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నా, తనకు చెందాల్సిన భూమిని తహసీల్దార్ మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారంటూ మనస్తాపం చెందిన రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సం ఘటన మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు తహసీల్దార్ కార్యాలయం ఎదు ట చోటు చేసుకుంది. బద్దిపడగకు చెందిన బానోతు అంజయ్య 28 సంవత్సరాల కిందట గుడిపల్లి యాదయ్య, చంద్రకళ, పోచయ్య, అశోక్ నుంచి 6 ఎకరాల 29 గుంటల భూమిని కొనుగోలు చేసి పంటలు సాగు చేస్తున్నాడు. మూడు సంవత్స రాల కిందట భూమిని విక్రయించిన వ్యక్తులు అంజయ్య తమ భూమిని ఆక్రమించుకున్నాడని కోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం కోర్టు అంజయ్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ధరణి పోర్టల్ ప్రారంభం కావడంతో భూమి రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో రెండు సంవత్సరాలుగా అంజయ్య తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే భూమిని మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారన్న విషయం తెలుసుకున్న అంజయ్య తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని వెంటతెచ్చుకున్న డీజిల్ శరీరంపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఎస్ఐ మహిపాల్‌రెడ్డి అంజయ్యను సముదాయించి పంపించారు. -
పట్టాదారు పేరు తహసీల్దార్ ఆఫీసు.. తండ్రి పేరు కొందుర్గు
కొందుర్గు: సాధారణంగా వ్యవసాయ భూములకు పట్టాదార్లుగా రైతులు ఉంటారు. వారి పేర్లపై ఎంత భూమి ఉంది, ఖాతా నంబరు, తండ్రి పేరు వంటి వివరాలను రికార్డుల్లో పొందుపరుస్తారు. కానీ రంగారెడ్డి జిల్లా జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్ల గ్రామంలో రెవెన్యూ రికార్డులు విచిత్రంగా ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో పెద్దఎల్కిచర్ల లోని సర్వేనంబర్ 32/ఉ2లో 1–14 ఎకరాల భూమి తహసీల్దార్ ఆఫీసు పేరుపైన ఉంది. పట్టాదారు పేరు నమోదు చేయాల్సిన స్థానంలో తహసీల్దార్ ఆఫీసు అని ఉంది. తండ్రిపేరు స్థానంలో కొందుర్గు అని నమోదు చేశారు. ఇక ఈ భూమికి ఫ్యాన్సీ ఖాతా నంబర్ 2222 ఇచ్చారు. దీంతో అధికారుల పనితీరుపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
అబ్దుల్లాపూర్‌మెట్‌లోనే తహసీల్దార్ కార్యాలయం!
పెద్దఅంబర్‌పేట: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన అనంతరం మూతపడిన ఆ కార్యాలయం తరలింపుపై జరుగుతున్న తర్జనభర్జనలు కొలిక్కి వచ్చినట్టేనని తెలుస్తోంది. అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ కార్యాలయాన్ని హయత్‌నగర్ మండలానికి తరలించాలని అధికారులు చేసిన ప్రయత్నాలకు ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. విజయారెడ్డి హత్య ఘటన అనంతరం సరూర్‌నగర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినా ఆయన ఇక్కడికి రావడానికి విముఖత చూపారు. ఇక్కడి సిబ్బంది కూడా కార్యాలయ భవనాన్ని మారిస్తేనే విధులకు హాజరవుతామని ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో ఈ కార్యాలయాన్ని హయత్‌నగర్ మండలానికి తరలించాలని అధికారులు ప్రయత్నించారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకతరావడంతో.. స్థానికంగానే మరో భవనాన్ని పరిశీలించారు. దీనిపై రెండ్రోజుల్లో స్పష్టత రానుంది. కాగా, ప్రభుత్వం షేక్‌పేట మండల తహసీల్దార్ వెంకట్‌రెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన గురువారం లేదా శుక్రవారం రానున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. -
రెవెన్యూ కార్యాలయాలకు పోలీసు భద్రత
సాక్షి, హైదరాబాద్ : తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనమైన దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని రెవెన్యూ కార్యాలయాల వద్ద భద్రతా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అన్ని కార్యాలయాల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. రెవెన్యూ యంత్రాంగం భయాందోళనలకు గురవుతోందని, వెంటనే తమకు భద్రత కల్పించాలని రెవెన్యూ జేఏసీ (ట్రెసా) చేసిన విజ్ఞప్తి మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సోమేశ్‌కుమార్ బుధవారం కలెక్టర్లకు లేఖ రాశారు. ►అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసు భద్రతా ఏర్పాటు చేయాలి. ►తహసీల్దార్ కార్యాలయాల్లోకి రాకపోకల కోసం ప్రత్యేక పద్ధతిని పాటించాలి. అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలి ►తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజల కోసం ఏర్పాటు చేసే ‘గ్రీవెన్స్’కార్యక్రమం కోసం నిర్దేశిత వేళలు నిర్ధారించాలి. ఆ సమయంలో కార్యాలయ సిబ్బంది హాజరయ్యేలా చూడాలి. ►కలెక్టర్లు తమ నిధులతో వెంటనే అన్ని కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కార్యాలయంలోని అన్ని ప్రాంతాలు ఆ పరిధిలోకి వచ్చే విధంగా వాటిని అమర్చాలి. ►కొత్తగా ఏర్పాటయిన కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మౌలిక వసతుల కోసం తీసుకున్న చర్యల నివేదికను పంపించాలి. ►అధికారుల చాంబర్లను కోర్టు హాళ్లను మాదిరిగా ఆధునీకరించాలి. ►ముఖ్యమైన చట్టాలు, మెజిస్టీరియల్ కార్యనిర్వాహక అంశాలపై జిల్లా శిక్షణా కేంద్రాల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి. -
దగ్ధ పుత్రుడు
హటాత్తుగా అమానుష జ్వాలలు బుసలు కొట్టాయి. ‘అమ్మ’ చుట్టూ మంటలు. అమ్మ ఆక్రందనలు. ‘గురూ.. ఎక్కడా..’.. అమ్మ పిలుపు! అమ్మను అంటుకున్న మంటలపైకి గురునాథం ఎగబాకాడు. అమ్మను కాపాడే ప్రయత్నంలో తనూ దగ్ధమయ్యాడు. విజయారెడ్డి కారు డ్రైవర్ గురునాథం. అధికారిలా కాకుండా ‘అమ్మ’లా చూసింది అతడిని. ఆగ్రహావేశాలకు ఆహుతై అమ్మ అక్కడిక్కడ చనిపోతే.. గురునాథం ఆ మర్నాడు ఆసుపత్రిలో కన్ను మూశాడు. దగ్ధ పుత్రుడిలా మిగిలాడు! తాసీల్దార్ విజయారెడ్డిది మనసును కలచివేసే ఘటన అయితే.. ఆమె డ్రైవర్ గురునాథం కుటుంబానిది మనిషి మనిషినీ కదిలిస్తున్న వ్యథ! గురునాథానిది సూర్యాపేట జిల్లా, వెల్దండ మండలం, గరుడపల్లి గ్రామం. తల్లిదండ్రులు బ్రహ్మయ్య, రమణమ్మ. కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరికి ముగ్గురూ కుమారులే. పెద్ద కుమారుడే గురునాథం. నానమ్మ పేరు గురువమ్మ. ఆమె పేరు కలిసి వచ్చేలా గురునాథం అని పెట్టారు. రెండేళ్ల క్రితమే నేరేడు చర్ల మండలం వైకుంఠాపురానికి చెందిన సాలమ్మ, అముర్తయ్యల చిన్న కూతురు సౌందర్యతో గురునాథానికి వివాహం జరిగింది. గురునాథానికి కారు డ్రైవింగ్ వచ్చు. పదేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. తొలి రెండేళ్లు ఎల్బీనగర్లో స్నేహితుల వద్ద ఉంటూ గ్యారేజీల్లో రోజు వారి వేతనం తీసుకొని కారు డ్రైవింగ్ చేశాడు. విజయారెడ్డి భర్తకు తెలిసిన వ్యక్తి గురునాథం కుటుంబానికి తెలుసు. ఆయన ద్వారానే గురునాథం విజయారెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా కుదిరాడు. అలా ఎనిమిదేళ్లుగా ఆమె వద్దే పని చేస్తున్నాడు. ‘గురూ... ఎప్పుడొస్తావ్?’ గురునాథం విజయారెడ్డికి నమ్మకస్తుడిగా ఉండేవాడు. అతడి వివాహానికి విజయారెడ్డి.. భర్త, పిల్లలతో కలిసి వెల్దండకు వచ్చి వెళ్లారు కూడా. గురునాథం తల్లిదండ్రులను ఆమె పిన్ని, బాబాయి అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. గురునాథానికి ఏ ఇబ్బంది రాకుండా తానే చూసుకుంటానని చెప్పేవారు. ‘‘మేడమ్.. నా కొడుకును తల్లిలా చూసేది. తను ఏం తింటున్నా నా కొడుకుకూ పెట్టేది. గురునాథం ఒక్కరోజు ఊరికి వచ్చినా మేడమ్ ఫోన్ చేసేది. ‘‘గురు... హైదరాబాద్‌లో కారు తోలడం మాటలు కాదు. నువ్వు ఉండాల్సిందే’’ అని మేడమ్ అంటే.. మేము వెంటనే గురునాథంను డ్యూటీకి తోలేవాళ్లం. నాకే ఫోన్ చేసి.. ‘బాబాయ్ గురును పంపించు’ అని చెప్పేది’’ అని గురునాథం తండ్రి బ్రహ్మయ్య కన్నీటిని దిగమింగుకుంటూ చెప్పాడు. ‘‘డబ్బులు అయినా, ఇంకే సహాయానికైనా అన్నింటికి గురునాథాన్ని మేడమ్ ఆదుకునేది. వాళ్లిద్దరూ తల్లీకొడుకుల్లా ఉండేవాళ్లు. అందుకే ఆ తల్లికి ఆ కొడుకు పాణం ఇవ్వాల్సి వచ్చిందేమో’’ అని వలవలమన్నాడు బ్రహ్మయ్య. దసరాకు భార్య, కొడుకుతో కలిసి వెల్దండకు వచ్చిండు. ఒక్కరోజు ఉండి తెల్లారే మళ్లీ డ్యూటీకి హైద్రాబాద్ పోయిండు. మళ్లీ హుజూర్నగర్ ఉప ఎన్నికలకు గ్రామానికి వచ్చి ఓటేసి పోయిండు. వచ్చినప్పుడల్లా చుట్టుపక్కల ఉన్న వారినందరినీ పలకరించేవాడు. గ్రామంలో స్నేహితులు, ఇంటి చుట్టు పక్కల ఉన్న వాళ్లంతా ‘గురు’ అని పిలిచేవారు. తన వద్ద ఏళ్లుగా నమ్మకంగా డ్రైవర్‌గా పని చేస్తుండడంతో విజయారెడ్డి మేడమ్ కూడా ‘గురు’ అని అప్యాయంగా పిలిచేది’’ అని గుర్తు చేసుకున్నాడు బ్రహ్మయ్య ‘మా మేడమ్‌ని బతికించండి’ గురునాథం భార్య సౌందర్య మనో వేదన వర్ణనాతీతం. ఎవరూ ఆమె దుఃఖాన్ని పట్టలేకపోతున్నారు. ‘‘బాబుకు ఇప్పుడు ఏడాదిన్నర వయస్సు. సిద్దార్థ అని బావే పేరు పెట్టిండు. నాకు ఇప్పుడు ఎనిమిదో నెల. వాళ్లు ముగ్గురు అన్నదమ్ములు కావడంతో ‘మనకు అమ్మాయి పుట్టాలి’ అని బావ ఎప్పుడూ అంటుండేవాడు. మేము ఎల్బీనగర్ మన్సురాబాద్‌లో, మేడమ్ వాళ్లు కొత్తపేటలో ఉంటారు. ఉదయం తొమ్మిదిన్నరకు డ్యూటీకి వెళ్తే రాత్రి తొమ్మిది గంటల తర్వాతే ఇంటికి వచ్చేవాడు. మేడమ్ గృహ ప్రవేశానికి మేము వెళ్లితే మంచిగా చూసుకుంది. బాబు పుట్టిన రోజు మార్చి 15న మా ఇంటికి మేడమ్ వచ్చింది. బావ కూడా మేడమ్ మంచిదని, మనకు ఏ ఇబ్బంది లేకుండా మేడమ్ చూసుకుంటుంది అని చెప్పేవాడు. సోమవారం ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిండు. మధ్యాహ్నం తర్వాత అక్కడి నుంచి ఒకరు ఫోన్ చేసి.. ‘మేడమ్ కాలిపోయింది, మీ ఆయన కూడా కాలిపోయాడు’ అని నాకు చెప్పిండ్రు. నేను ఇంటి దగ్గర ఉన్న ఒకళ్లను తీసుకొని ఆస్పత్రికి పోయా. బావ కాలిపోయి బెడ్‌పై ఉండేసరికి చూడలేకపోయా. తను కాలిపోతూ కూడా ‘మా మేడమ్‌ను బతికించండి’ అని అరిచాడట’’ అని సౌందర్య బోరుమంది. ‘‘డ్యూటీకి వెళ్తే మేడమ్ పెట్టిందే బావ తినేవాడు. బాబు కోసం వాళ్ల నాయినమ్మ నెయ్యి పంపితే.. ఆ నెయ్యి బాగుంటుందో ఉండదోనని.. ‘గురు మా అమ్మవాళ్లు నెయ్యి పంపారు. మా పిల్లలకు అదే పెడుతున్నా. మీ బాబుకు తీసుకపో’ అని మేడమ్ నెయ్యి పంపించింది. అంత మంచిగా గురునాథంను మేడమ్ చూసుకుంది’’ అని సౌందర్య ఒక్కో సంగతినీ గుర్తు చేసుకుంటోంది. గురునాథం కుటుంబ సభ్యుల కన్నీటి మంటలు ఇప్పట్లో ఆరేలా లేవు. బొల్లం శ్రీనివాస్, సాక్షి, సూర్యాపేట ఫొటోలు : అనమాల యాకయ్య -
జమీన్.. జంగ్!
సాక్షి, హైదరాబాద్/పెద్ద అంబర్‌పేట: ఆ భూమే వారికి జీవనాధారం. స్వేదం చిందిస్తూ, సేద్యం చేస్తూ హాయిగా జీవితం నెట్టుకొస్తున్న రైతాంగానికి ఆ భూమి తమది కాదని తెలియదు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న ఈ భూమిపై సర్వహక్కులు మావేననే ధీమా వారిలో కనిపించేది. వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ కొందరు రావడం.. ఈ భూమి మాది.. కౌలుదారులమని తేలి్చచెప్పడంతో పేద రైతుల గుండెల్లో పిడుగు పడినట్లయింది. ఇలా అప్పటివరకు సాఫీగా సాగిన వారి వ్యవసాయం కాస్తా చిన్నాభిన్నమైంది. ఈ కథ అంతా ఎక్కడిదో కాదు.. రెండు రోజుల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ హత్యకు కారణంగా భావిస్తున్న భూ వివాదం గురించి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని ఈ భూవివాదానికి 2004 సంవత్సరంలోనే బీజం పడిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు. భూ పోరాటానికి అంకురం ఇక అప్పటి నుంచి మొదలైంది భూ పోరాటం. రైతులు, కౌలుదారుల మధ్య నెలకొన్న ఈ వివాదం రెవెన్యూ, కోర్టుల్లో కొనసాగుతూ వస్తోంది. ప్రతి చోటా రైతులకు వ్యతిరేకంగా, కౌలుదారులకు అనుకూలంగా తీర్పులు రావడంతో భూములు దక్కవేమోననే ఆందోళన రైతాంగంలో మొదలైంది. నగర శివారు కావడం, ఔటర్ రింగ్‌రోడ్డుకు అనుకుని ఉన్న ఈ భూమికి భారీగా డిమాండ్ ఉండడం కూడా గంపెడాశకు కారణమైంది. ఇదే సర్వేనంబర్‌లో పలువురికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేసిన రెవెన్యూ యంత్రాంగం.. వివాదాస్పద భూమి పేరిట కొందరికి ఇవ్వకుండా నిలిపివేసింది. బాచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 90 నుంచి 101 వరకు విస్తరించిన దాదాపుగా 412 ఎకరాలు గౌరెల్లి, బాచారం గ్రామాలకు చెందిన 53 మంది యాభై సంవత్సరాల నుంచి సాగుచేస్తున్నారు. వాస్తవానికి ఈ భూమి వంశపారంపర్యంగా వచి్చంది కాదు. ఇందులో 412 ఎకరాలు రాజానందరావుదికాగా, 1980 తర్వాత ఆయన మహారాష్ట్రకు వలస పోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అప్పటికే పొజిషన్లో ఉన్న రైతులు సాదా బైనామా కింద రాజానందరావు నుంచి కొనుగోలు చేశామని, 1998లో 1–బీ రికార్డులో కూడా తమ పేర్లను నమోదు చేయడమేగాకుండా.. ఆర్ఓఆర్ ఇచ్చి పట్టా పాసుబుక్కులు కూడా ఇచ్చారని చెబుతున్నారు. రైతుల గుండెల్లో కుదుపు అప్పటివరకు భూములు సాగు చేసుకుంటున్న రైతాంగానికి 2004లో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఝలక్ ఇచ్చారు. సదరు సర్వే నంబర్లలో సుమారు 130 ఎకరాల భూమిపై తమకు హక్కులున్నాయని కోర్టు మెట్లెక్కారు. ఊరు విడిచి ఎప్పుడో నగరానికి వలస వెళ్లిన వీరికి స్థానికంగా కొందరు రియల్టర్లు తోడయ్యారు. దీనికితోడు అప్పటి రెవెన్యూ అధికారులు కూడా సహకరించడంతో ఈ వ్యవహారం ముందుకు సాగింది. ఇదే అదనుగా బడాబాబులు.. భూమి తమ ఆ దీనంలో లేకున్నా డాక్యుమెంట్ల ద్వారా విక్రయిస్తూ వచ్చారు. అప్పటివరకు కౌలుదారులు, రైతులకు మధ్య నడుస్తున్న వివాదాల్లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా రంగప్రవేశం చేయడంతో వివాదం కాస్తా మరింత క్లిష్టంగా తయారైంది. ఈ క్రమంలోనే 2016లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఇచి్చన ఉత్తర్వుల మేరకు వివాదాస్పద 130 ఎకరాల భూమికి సంబంధించిన పాస్‌పుస్తకాలను కౌలుదారుల నుంచి కొనుగోలు చేసిన వారి పేరిట రెవెన్యూ అధికారులు జారీ చేశారు. పహాణీల్లో కూడా నమోదు చేశారు. దీంతో జేసీ ఉత్తర్వులపై.. తహసీల్దార్ హత్య కేసులో నిందితుడైన సురేశ్ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ క్రమంలోనే తమ ఆ«దీనంలో ఉన్న భూమికి పాసుపుస్తకాలు ఎందుకు ఇవ్వరంటూ తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న సురేశ్, పాస్ పుస్తకాలు రాకపోవడానికి తహసీల్దార్ విజయారెడ్డే కారణమని కక్ష పెంచుకొని ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఈ హత్య చేయడానికి సురేశ్‌ను కుటుంబసభ్యులు ఎవరైనా ఉసిగొల్పారా లేదా భూ మాఫియా ప్రేరేపించిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో ఉసిగొల్పారు నా భర్త అమాయకుడు. భూమి ఎక్కడ ఉందో కూడా అతనికి తెలియదు. కూలీనాలి చేసుకుంటున్న ఆయన రెండు నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి పూర్తిగా మారిపోయాడు. మాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఏమీ తెలియని అమాయకుడు, అంతపెద్ద అధికారిణిని అలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఆయనను వెనుక ఉండి ఎవరో రెచ్చగొట్టారు. మేడం లాగే నాకూ పిల్లలు ఉన్నారు. సురేశ్ చేసింది తప్పే. – లత, నిందితుడు సురేశ్ భార్య -
డ్రైవర్ గురునాథానికి కన్నీటి వీడ్కోలు
గరిడేపల్లి: తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో తీవ్ర గాయాలపాలై మరణించిన ఆమె డ్రైవర్ కామళ్ల గురునాథానికి గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్‌ను కాపాడబోయి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండకు అదేరోజు రాత్రి తీసుకువచ్చారు. బుధవారం బంధుమిత్రులు కడసారి గురునాథం భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టారు. నల్లగొండ, సూర్యాపేట తహసీల్దార్ల సంఘం అధ్యక్షులు షేక్ మౌలానా, షేక్ జమీరుద్దీన్, గరిడేపల్లి తహసీల్దార్ హెచ్.ప్రమీల గురునాథం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రూ.20 వేల సాయాన్ని అతని కుటుంబ సభ్యులకు సంఘం తరఫున అందించారు. అక్క అన్న అభిమానంతో కాపాడే సాహసం చేశాడు పేద కుటుంబానికి చెందిన గురునాథం తహశీల్దార్ విజయారెడ్డి వద్ద నమ్మకంగా పనిచేసేవాడని, ఆమెను అక్కా అని ఆప్యాయంగా పిలుస్తుండేవాడని బంధువులు తెలిపారు. అందుకే మంటల్లో చిక్కుకున్న విజయారెడ్డి ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని చెప్పారు. -
నోటు పడితేనే..
నగరంలోని ఖైరతాబాద్ తహసీల్ పరిధిలో మమతాదేవి (పేరు మార్చాం) కుటుంబం ‘ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికెట్’ కోసం ఏప్రిల్‌లో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు ఆ దరఖాస్తుపై కనీసం విచారణ కూడా చేయలేదు. ఆమె అప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ‘మళ్లీ వారం’ అంటూ తిప్పి పంపడం సర్వసాధారణమైంది. గ్రేటర్‌లోని ఇతర తహసీల్దార్ కార్యాలయాల్లో సైతం పరిస్థితి దీనికి భిన్నంగా ఏం లేదు. ప్రజలు కుల, ఆదాయ, నివాస, ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తులు చేసుకుని నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్య తీరుకు ఇది నిలువుటద్దం. ప్రభుత్వ భూముల పర్యవేక్షణ పక్కన పెడితే కనీసం వివిధ ధ్రువీకరణ పత్రాల జారీలో కూడా సిబ్బంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరంలో గల మండల రెవెన్యూ (తహసీల్దార్) కార్యాలయాలకు అందుతున్న వివిధ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో పడిపోతున్నాయి. కనీసం క్షేత్ర స్థాయి విచారణకు నోచుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి విభాగాల సిబ్బందికి చేయి తడిపనిదే దరఖాస్తుల్లో కదలిక తేవవడం లేదనే విమర్శలు అధికమవుతున్నాయి. ప్రతి తహసీల్దార్ ఆఫీసు ముందు దళారులు తిష్ట వేయడం.. వారి ద్వారా అందిన దరఖాస్తులపైనే విభాగాల సిబ్బంది దృష్టి సారించడం బహిరంగ రహస్యంగా మారింది. దీంతో కుల, ఆదాయ, నివాస, ఫ్యామిలీ మెంబర్షిప్ తదితర దరఖాస్తులకు నిర్ణీత వ్యవధిలో మోక్షం లభించడం లేదు. మరోవైపు దరఖాస్తుల అత్యవసరాలను బట్టి మీసేవా, ఈసేవా కేంద్రాల నిర్వాహకుల్లో కొందరు అక్రమ మార్గాలను అవలంబిస్తున్న సంఘటనలు కూడా ఇటీవల వెలుగు చూస్తున్నాయి. ఉన్నతాధికారులు పర్యవేక్షణ కొరవడంతో రెవెన్యూ సిబ్బంది పనితీరు అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆన్లైన్ ద్వారా.. విద్యార్థులు, నిరుద్యోగులు, పేద కుటుంబాలు వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవా, ఈసేవా కేంద్రాల ద్వారా మండల తహసీల్దార్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని సంబంధిత పత్రాల కాపీలను కార్యాలయాల్లో అందిస్తున్నారు. దరఖాస్తుల పత్రులు అందిన వెంటనే వాటిపై క్షేత్ర స్థాయి విచారణ చేసి సంబంధిత వీఆర్వోలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు సిఫార్సు చేయాలి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నివేదక ఆధారంగా సంబంధిత అధికారి దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటారు. అయితే, దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ సకాలంలో చేయకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. ధ్రువీకరణ పత్రాలను సిటిజన్ చార్టర్ వ్యవధి లోపల విచారణ పూర్తిచేసి ఆమోదమో.. లేక తిరస్కరణో చేయాలి. కానీ వాటి అమలు మాత్రం కానరావడంలేదు. దీంతో దరఖాస్తుదారులు ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు. రోజుకు 50 దరఖాస్తులు హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలో 16 తహసీల్దార్ కార్యాలయాలు ఉన్నాయి. మీసేవా, ఈసేవా ద్వారా ఆన్లైన్లో నమోదైన వివిధ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు కాపీలు నిత్యం సగటున 30 నుంచి 50 తగ్గకుండా ప్రతి కార్యాలయానికి అందుతున్నాయి. సంబందిత బాధ్యులు దరఖాస్తులపై సిటిజన్ చార్టర్ వ్యవధిలోగా విచారణ పూర్తి చేయాల్సి ఉండగా, పెండింగ్‌లో పడేయడం సాధారణమైంది. దరఖాస్తు దారులు నేరుగా సమర్పించే దరఖాస్తులపై సిబ్బంది దృష్టిపెట్టకపోవడం గమనార్హం. గత రెండు నెలల వ్యవధిలో మీ సేవా, ఈసేవాల ద్వారా 10 వేలకు పైగా దరఖాస్తులు తహసీల్దార్ల లాగిన్‌కు అందితే అందులో కేవలం 4 వేల దరఖాస్తులు మాత్రమే క్షేత్ర స్థాయి విచారణ, అమోదం, తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన దరఖాస్తులు పెండింగ్‌లోనే పడిపోయాయి. ఆయా కార్యాలయాల ముందు తిష్ట వేసిన దళారులు దరఖాస్తుదారుడి వసరాన్ని బట్టి రూ.500 నుంచి రూ.2 వేల వరకు వస్తూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అన్నదాతకు దన్నుగా..
- రైతు, వ్యవసాయ సమస్యలపై వైఎస్సార్సీపీ పోరుబాట - 4, 5 తేదీల్లో తహశీల్దార్ కార్యాలయాలవద్ద ఆందోళనలు - విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపు జగ్గంపేట : పదిమంది ఆకలిని తీర్చే తిండిగింజల్ని పండించే అన్నదాతకు దన్నుగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించనుంది. రైతు, వ్యవసాయ సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే లక్ష్యంతో.. ఈ నెల 4, 5 తేదీల్లో తహశీల్దార్ కార్యాలయాలవద్ద ఆందోళనలు చేసి, వినతిపత్రాలను అందజేయనున్నట్టు వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ శుక్రవారం తెలిపారు. పచ్చని పంటలకు నెలవైన జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా విపరీత పరిస్థితి తలెత్తిందని, తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడి కరువు పరిస్థితులు కలవర పెడుతున్నాయని అన్నారు. ఒక్క ఏడాదిలోనే భయానక తుపాను, కరువు, అకాల వర్షాలు జిల్లావాసుల్ని అతలాకుతలం చేశాయన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జిల్లా సగటు వర్షపాతం 1119.5 మిల్లీమీటర్లు కాగా 599.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందన్నారు. మొత్తం 46.5 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, అకాల వర్షాలకు పంటలు నేలపాలయ్యాయయని అన్నారు. రైతు, వ్యవసాయ సమస్యలపై తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ప్రతి నియోజకవర్గంలో కన్వీనర్లు, మండల కన్వీనర్లు, పార్టీ శ్రేణులు 4, 5 తేదీల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని జ్యోతుల పిలుపునిచ్చారు. రైతులు, వ్యవసాయపరంగా ఎదుర్కొంటున్న తొమ్మిది ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్లకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఇవీ డిమాండ్లు.. - మంచినీటి ఎద్దడిని నివారించాలి. - రైతు, రైతు కూలీల వలసలను నిరోధించాలి. - కరువు, హుద్‌హుద్ తుపాను, అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలి. - తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం స్వామినాథన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా పంట ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధరను ప్రకటించాలి. - పంటలకు గిట్టుబాటు, కనీస మద్దతు ధరలు రానప్పుడు రైతుకు మద్దతుగా నిలబడేందుకు రూ.5 వేల కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేయాలి. - పంటలకు బీమా అమలు చేయాలి. - తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేయాలి. - వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించాలి. - జిల్లాలో తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయాలి.