
గరిడేపల్లి: తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో తీవ్ర గాయాలపాలై మరణించిన ఆమె డ్రైవర్ కామళ్ల గురునాథానికి గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్‌ను కాపాడబోయి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండకు అదేరోజు రాత్రి తీసుకువచ్చారు.
బుధవారం బంధుమిత్రులు కడసారి గురునాథం భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టారు. నల్లగొండ, సూర్యాపేట తహసీల్దార్ల సంఘం అధ్యక్షులు షేక్ మౌలానా, షేక్ జమీరుద్దీన్, గరిడేపల్లి తహసీల్దార్ హెచ్.ప్రమీల గురునాథం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రూ.20 వేల సాయాన్ని అతని కుటుంబ సభ్యులకు సంఘం తరఫున అందించారు.
అక్క అన్న అభిమానంతో కాపాడే సాహసం చేశాడు
పేద కుటుంబానికి చెందిన గురునాథం తహశీల్దార్ విజయారెడ్డి వద్ద నమ్మకంగా పనిచేసేవాడని, ఆమెను అక్కా అని ఆప్యాయంగా పిలుస్తుండేవాడని బంధువులు తెలిపారు. అందుకే మంటల్లో చిక్కుకున్న విజయారెడ్డి ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment