సర్వం సిద్ధం
Published Sun, Feb 2 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
సాక్షి, కాకినాడ : వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆదివారం జరగనున్న ఈ పరీక్షలకు మొత్తం జిల్లాలో 83,790 మంది హాజరు కానున్నారు. వీరికోసం జిల్లావ్యాప్తంగా 210 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీఆర్‌ఓ పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ జరుగుతుంది. దీనికి 74,369 మంది హాజరు కానున్నారు. వీఆర్‌ఏ పరీక్షకు 9,421 మంది హాజరవుతారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ జరుగుతుంది. మొత్తం అభ్యర్థుల్లో 19 మందికి వీఆర్‌ఓ పరీక్షా కేంద్రం ఒకచోట, వీఆర్‌ఏ పరీక్షా కేంద్రం వేరేచోట వచ్చింది. వారి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని వారికోసం కాకినాడ మెక్లారిన్ హైస్కూల్లో ప్రత్యేకంగా కేంద్రం ఏర్పాటు చేశారు.
ఒక్క నిమిషం లేటైనా..
ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించరు. ఒకసారి హాలులోకి వచ్చాక పరీక్షా సమయం పూర్తయిన తరువాతే బయటకు
పంపుతారు.
అభ్యర్థి ఒకరు, హాల్ టికెట్లో ఫొటో వేరొకరిది ఉన్నా, మోసం చేసే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకుంటారు.
విస్తృతంగా సిబ్బంది
పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లు 3389 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్లు 54 మంది, చీఫ్ సూపరింటెండెంట్లు 210 మంది, సహాయ లైజాన్ ఆఫీసర్లు 210 మంది, లైజాన్ ఆఫీసర్లు 43 మంది, రూట్ ఆఫీసర్లు 43 మంది, అబ్జర్వర్లు 43 మంది, ఎస్కార్టు పోలీస్ 210 మంది, సాధారణ పోలీసు 210 మంది, ఏఎన్‌ఎంలు 210 మందిని నియమించారు. అభ్యర్థి వేలిముద్రను ఇన్విజిలేటర్లు తప్పనిసరిగా తీసుకోవాలి. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులను వీడియో తీసి ఏపీపీఎస్సీకి పంపాలి.
పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్, లైటింగ్ తదితర సౌకర్యాలపై అధికారులు పరిశీలించారని డీఆర్‌ఓ యాదగిరి తెలిపారు.
అభ్యర్థులను పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తారు.
చీఫ్ ఎగ్జామినర్లు పరీక్షా కేంద్రం వద్ద ఉదయం 8 గంటలకే ఉండాలని ఆదేశించారు.
జిల్లాలో పరీక్షల పర్యవేక్షకులుగా ఏపీపీఎస్సీ అధికారులు విజయనిర్మల, రామ్మూర్తి, జి.అశోక్, భాగేశ్వరి వచ్చారు.
Advertisement
Advertisement