నిమిషం ఆలస్యమైనా....నో ఎంట్రీ!
Published Sun, Feb 2 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం 168 కేంద్రా ల్లో వీఆర్వో, విజయనగరం పట్టణంలో ఆరు కేంద్రాలలో వీఆర్‌ఏ పరీక్షలను నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. వీఆర్వో పరీక్షకు 44,223 మంది, వీఆర్‌ఏకు 2,008 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆదివా రం ఉదయం 9.30 గంటలకు వరకూ హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
నిఘానీడలో...
గతం కంటే భిన్నంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి కేంద్రంలో పరీక్ష జరిగే తీరును వీడియో తీయనున్నారు. అలాగే ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. మహిళల కోసం మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. మొత్తం మీద ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. నకిలీ అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం లేకుండా వేలిముద్రలు సేకరించడంతో పాటూ హాల్ టిక్కెట్‌పై ఉన్న సంతకం అభ్యర్థి పరీక్షా కేంద్రంలో చేసిన సంతకం ఒకేలా ఉంటేనే పరీక్ష రాయనిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను అమలు చేయనున్నారు.
ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ వీఆర్వో పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్‌ఏ పరీక్ష నిర్వహించనున్నారు. వీఆర్వో పరీక్ష కేంద్రానికో చీఫ్ సూపరింటెండెంట్, సహాయ చీఫ్ సూపరింటెండెంట్‌లను నియమించారు. వీరితో పాటూ పరిశీలకులుగా 14 మంది, ప్రత్యేకాధికారులుగా 35 మంది, లైన్ అధికారులుగా 35 మందిని నియమించారు. వీరితో పాటు మరో 35 మంది గజిటెడ్ అధికారులను కూడా నియమించారు. ఇన్విజిలేటర్లుగా 1,928 మందిని, శానిటేషన్ విధులు చూడటానికి 168 మంది అంగన్‌వాడీ వర్కర్లను నియమించారు.
దళారులను నమ్మవద్దు...
ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని దళారులను నమ్మి మోసపోవద్దని సర్వీస్ కమిషన్ అధికారులు.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సందేశాలు పంపిస్తున్నారు. ఏ ఒక్కరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తే తక్షణమే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు, ఆర్డీఓకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
ఏర్పాట్లు పూర్తి : ఇన్‌చార్జ్ జేసీ
పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్ యూసీజీ నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 216 మంది వికలాంగులు పరీక్షకు హాజరుకానున్నారని, వారికి పదో తరగతిలోపు విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేశామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షా సమయం పూర్తి అయ్యేంత వరకు కేంద్రాల్లోనే ఉండాలన్నారు.
నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నామని, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 13 ప్రత్యేక కౌంటర్ల ద్వారా తెల్లవారుజామున మూడు గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు తరలించనున్నట్టు చెప్పారు. వేలిముద్రలు సేకరించిన తరువాత, వేళ్లకు అంటిన సిరాను తుడిచేందుకు వీలుగా ఐదు వేల చేతి రుమాళ్లు సరఫరా చేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రంలో ఏ ఒక్క అభ్యర్థి ప్రవర్తన సక్రమంగా లేకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఆర్వో బి.హెచ్.ఎస్.వెంకటరావు, కలెక్టరేట్ ఏవో రమణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement