పక్కాగా వీఆర్‌ఏ, వీఆర్‌ఓ పరీక్షల నిర్వహణ
Published Tue, Jan 28 2014 3:07 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ కాంతిలాల్‌దండే జిల్లా అధికారులను ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, లైజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వర కు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరాదని, పరీక్షా సమయం ముగిసే వరకూ అభ్యర్థులను బయటకు పంపకూడదని సూచించారు.
మారుమూల గ్రామం నుంచి సైతం అభ్యర్థులు సరైన సమయంలో పరీక్షా కేం ద్రాలకు హాజరయ్యేలా అదనపు బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్‌కో శాఖకు సూచించారు. ప్రతి కేంద్రం వద్ద పారామెడికల్ బృందాలను ఏర్పాటు చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించా రు. హాలులో గాలి, వెలుతురు, బల్లలు ఉండేలా చూడాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. పరీక్షా కేంద్రాలలో అభ్యర్థుల వేలి ముద్రలు కూడా తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లను అనుమతించరాదని తెలిపా రు. సమావేశంలో డీఆర్‌ఓ వెంకటరావు, జిల్లా పరిషత్ సీఈఓ మోహనరావు, జిల్లా పంచాయతీ అధికారి సత్యసాయి శ్రీనివాసరావు, ఆర్‌డీఓ వెంకటరావు, డ్వామా పీడీ గోవిందరాజు, ఐకేపీ పీడీ జ్యోతి, రాజీవ్ విద్యామిషన్ పీఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement