సాక్షి, అమరావతి: నిజాలకు పాతరేసి అబద్ధాలను అచ్చేయడంలో అందెవేసిన చెయ్యి అయిన రామోజీ తాజాగా వీఆర్‌ఏల డీఏపై పడ్డారు. టీడీపీ పాలనలో చేసిన నిర్వాకాలను మరిచిపోయినట్లుగా నటిస్తున్నారు. వీఆర్‌ఏల డీఏను తొలగించి వారిని నిండా ముంచింది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలిసిన విషయమైనా రామోజీ అదేమీ తెలీనట్లు ఉంటూ సొల్లు పురాణం అందుకున్నారు.
నిజానికి.. చంద్రబాబు అధికారంలో ఉండగానే 2018లో వీఆర్‌ఏలకు డీఏ వర్తించదని జీఓ ఇచ్చారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. త్వరలోనే దీనిపై ఒక సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంది. కానీ, ఈ నిజాలకు ముసుగేసి వీఆర్‌ఏలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడుతున్న ఈనాడు.. బరితెగించి మరీ అడ్డగోలు కథనం రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
ఇదీ నిజం..
వీఆర్‌ఏలకు నెలకు రూ.300 చొప్పున ఇచ్చే కరువు భత్యాన్ని (డీఏ)ను కేవలం 5 నెలలకు మాత్రమే పరిమితం చేస్తూ 2019 జనవరి 29న టీడీపీ ప్రభుత్వం జీఓ–14 జారీచేసింది. 2018 జూన్ 1 నుంచి వీఆర్‌ఏలకు డీఏ వర్తించదని ప్రకటించింది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో కోరాయి. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓను మార్చి కరువు భత్యాన్ని పునరుద్ధరించాలని కోరుతుండగా ఉద్యోగ సంఘాల సమస్యలను పరిశీలించి, పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరచూ నిర్వహించే సమావేశాల్లోనూ దీనిపై చర్చ జరిగింది.
ఈ విషయాలను మరచిపోయి ఉద్యోగుల్లో భయాందోళనలు కలిగించే ఉద్దేశంతో అబద్ధాలను అచ్చోసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,359 మంది వీఆర్‌ఏలు సేవలు అందిస్తున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా వారిలో ఎంతమంది ఏవిధంగా డీఏ డ్రా చేశారని తెలుసుకునేందుకే ఖజానా, అకౌంట్స్ శాఖ మెమో ఇచ్చింది. రాష్ట్రంలో ఒక్క వీఆర్‌ఏ నుంచి కూడా అదనంగా డ్రా చేసిన డీఏను రికవరీ చేయలేదు. ఈ విషయం తెలిసి కూడా ఈనాడు నిస్సిగ్గుగా వీఆర్‌ఏల నుంచి డీఏలను రికవరీ చేస్తున్నట్లు అబద్ధాలు రాసిపారేసింది. కానీ, డీఏలు రికవరీ లేకుండా చేయడంతోపాటు ప్రతినెలా డీఏను కొనసాగించేలా రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. వీటిపై అతి త్వరలో నిర్ణయం వెలువడే అవకాశముంది.
వీఆర్‌ఏలకు మేలు జరిగింది ఈ ప్రభుత్వంలోనే..
ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీఆర్‌ఏలకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సుమారు 3,795 మంది వీఆర్‌ఏలకు వీఆర్‌ఓలుగా పదోన్నతి కల్పించింది. ఈ సంవత్సరమే 66 మంది వీఆర్‌ఏలకు గ్రేడ్–2 వీఆర్‌ఓలుగా పదోన్నతులిచ్చింది. ఇవన్నీ మర్చిపోయి.. అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా ఉద్యోగులు, ప్రజల్లో అపోహలు సృష్టించేందుకే ఈనాడు కంకణం కట్టుకుని వార్తలు ప్రచురిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment