వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
Published Wed, Jan 29 2014 2:18 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయకుల పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలిపారు. బాల్‌పాయింట్ పెన్‌నే పరీక్ష కోసం ఉపయోగించాలని సూచించారు. వీఆర్‌ఏ, వీఆర్వో పరీక్షల నిర్వహణపై మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరి 2న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్వో, మధ్యాహ్నం మూడు నుంచి 5 గంటల వరకు వీఆర్‌ఏ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇందుకోసం జిల్లాలో 148 కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. 177 వీఆర్వో పోస్టులకు 50,730 మంది, 176 వీఆర్వో పోస్టులకు 2,630 మంది దరఖాస్తు చేశారన్నారు. వీఆర్‌ఏ పరీక్షలు రిమ్స్ వైద్య కళాశాల, ఎచ్చెర్లలో శివాని కళాశాల, బీఆర్‌ఏయూలో, వీఆర్వో పరీక్షలు శ్రీకాకుళంతో పాటు ఎచ్చెర్ల, రణస్థలం, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం, పాలకొండ, పాతపట్నం, హిరమండలం, నరసన్నపేట, పోలాకి, పైడిభీమవరం, కోటబొమ్మాళి, కం చిలి, సోంపేట, మందస, టెక్కలి, నందిగాం, రాజాం కేంద్రాల్లోని కళాశాలలు, పాఠశాలల్లో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్రాల్లో అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా అధికంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. విద్యుత్ సౌకర్యంతో అంతరాయం కలగకుండా ట్రాన్స్‌కో అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వెయ్యి కంటే అధికంగా అభ్యర్థులు కలిగిన కేంద్రాల వద్ద అదనంగా సమన్వయ అధికారిని ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షిస్తారని, అదనపు పోలీస్ సూపరింటెండెంట్, సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు సమన్వయ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. మొత్తం 37 రూట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. అంధులకు స్రైబ్‌లను ఏర్పాటు చేసి వాటిని వీడియోగ్రాఫీ చేయాలన్నారు. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ బి.పోలీస్ పరీక్షల నిర్వహణలో తీసుకోవాలన్సిన చర్యలను వివరించారు. సమావేశంలో ఏజేసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ రజనీకాంతరావు, ఆర్డీవోలు జి.గణేష్‌కుమార్, వి.విశ్వేశ్వరరావు, ఎన్.తేజ్‌భరత్, జెడ్పీ సీఈవో టి. కైలాసగిరీశ్వర్, ఉపకలెక్టర్లు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
అభ్యర్థులకు కలెక్టర్ సూచనలు
సమావేశం సందర్భంగా అభ్యర్థులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
పరీక్షా కేంద్రానికి గంట ముందుగా అభ్యర్థులు చేరుకోవాలి.
సెల్‌ఫోన్లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ మాత్రమే వాడాలి. జెల్‌పెన్ లేదా పెన్సిల్ వినియోగించరాదు.
ఓఎంఆర్ షీట్‌ను జాగ్రత్తగా నింపాలి. వాటిపై దిద్దుబాట్లు ఉండరాదు. వైట్‌ఫ్లూయిడ్ పెట్టరాదు.
కేంద్రంలో సూచించిన క్రమంలో మాత్రమే కూర్చోవాలి. ఓఎంఆర్‌పై బాల్‌పాయింట్ పెన్‌తోనే వివరాలు నింపాలి. సంతకం చేయాలి. వేలిముద్రలను విధిగా వేయాలి
హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకొని ఒక ఫొటోను హాల్‌టిక్కెట్‌పైన అతికించి దానిపైన, అలాగే రెండవ ఫొటోపైన గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి.
ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అలాగే పరీక్ష ముగియకుండా బయటకు పంపించరు.
సౌకర్యాలు కల్పించాలి
వీఆర్‌ఓ, వీఆర్‌ఏ నియామక రాత పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని, అందుకు కావాల్సిన సౌకర్యాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని భూ పరిపాలన శాఖ కమిషనర్ కృష్ణారావు జిల్లా అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం జిల్లా ఆధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంధ్రాల్లో అన్ని వసతులు, తాగునీరు, వైద్య సిబ్బంది ఉండే విధంగా చూడాలన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలతో పాటుగా మరో వందమంది పరీక్షలు రాసే విధంగా అదనపు కేంద్రా లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పరీక్ష సామగ్రి, భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో తీసుకుంటున్న చర్యలైపై ఏజేసీ ఆర్.ఎస్. రాజ్‌కుమార్ వివరించగా, ఏఓ లక్ష్మణ రావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement