బైక్ ఢీకొని వీఆర్‌ఏ దుర్మరణం
– వీరంకిలాకులో ఘటన
పమిడిముక్కల:
వీరంకిలాకు సెంటర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఏ సిద్దెల సుబ్బారావు (54)కు తీవ్ర గాయాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. సెంటర్‌లో రోడ్డుపై నడిచి వెళుతున్న సుబ్బారావును బండ్రపల్లి నాగేంద్రరావు అనే వ్యవసాయ కూలీ బైక్‌తో డీకొనడంతో తీవ్ర గాయాలైనాయి. సమాచారమందిన వెంటనే తహసీల్దార్ విక్టర్‌బాబు, వీఆర్వో చంటిబాబులు సంఘటనాస్థలికి వెళ్లారు. అపస్మారకంలో ఉన్న సుబ్బారావును పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
108 అంబులెన్సు ఆలస్యం
108 అంబులెన్సుకు సమాచారమందించగా వారు గంట వరకు రాకపోవడంతో కారులో విజయవాడలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు. పైడికొండలపాలెంకు చెందిన సుబ్బారావుకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. సుబ్బారావు మృతిపట్ల తహశీల్దార్ విక్టర్‌బాబు, వీఆర్వో చంటిబాబు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్‌ఏలు సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. నాగేంద్రరావును అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.