తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలో ప్రసంగిస్తున్న రాష్ట్ర కార్యదర్శి పైల నరసింహయ్య
తాడిపత్రి: భూ అవినీతికి సంబంధించి సీబీఐ చార్జ్‌షీట్‌లో పేరున్న తహసీల్దార్ ఎల్లమ్మకు ఒక న్యాయం.... వీఆర్‌ఏ కంబగిరికి ఒక న్యాయమా ? అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పైల నరసింహయ్య ప్రశ్నించారు. బుధవారం స్థానిక రెవెన్యూ కార్యాలయం ముందు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగం నేతలు దళిత మహిళపై దాడి చేసిన ఆర్‌ఐ మల్లేష్‌ప్రసాద్‌ను సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా పైలా నరసింహయ్య మాట్లాడుతూ గదరగుట్టపల్లిలో దళిత సామాజిక వర్గానికి చెందిన వీఆర్‌ఏ కంబగిరిని విధుల్లో నుంచి తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. వీఆర్‌ఏ కంబగిరిని విధుల నుండి ఎందుకు తొలగించారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో యాడికి మండలంలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఎల్లమ్మ పెన్నా సిమెంటు పరిశ్రమకు కలెక్టర్ ఉత్తర్వులు లేకుండానే కొన్ని వందల ఎకరాల భూములను అక్రమంగా ధారాదత్తం చేశారన్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ ఎల్లమ్మపై చార్జీషీట్ దాఖలు చేసి ముద్దాయిగా చేర్చిందని వివరించారు. సీబీఐ చార్జీషీట్‌లో పేరు ఉన్న తహసీల్దార్ ఎల్లమ్మ తిరిగి తాడిపత్రి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తోందని తహసీల్దార్ ఎల్లమ్మను విధుల నుండి తొలగించకపోగా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. మరోవైపు కేవలం మూడు ఎకరాల్లో సాగు చేసుకుంటున్న భూమిని తనకు ఇవ్వాలని అగ్రవర్ణాలతో పోరాటం చేస్తున్న వీఆర్‌ఏ కంబగిరిని విధుల నుండి తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
వీఆర్‌ఏ కంబగిరి తప్పు చేసి ఉంటే తహసీల్దార్ ఎల్లమ్మ కూడా తప్పు చేసినట్లేనన్నారు. తాడిపత్రిలో గత 18 సంవత్సరాలుగా ఎలాంటి బదిలీలు లేకుండా అధికార పార్టీ అండదండలతో ఆర్‌ఐ మల్లేష్ తాడిపత్రిలోనే విధులు నిర్వహిస్తూ నాయకుల అండదండలతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని విమర్శించారు. ఆర్‌ఐ మల్లేష్ ఆస్తులపై ఏసీబి అధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఓ మహిళ అని చూడకుండా దళిత మహిళ లక్ష్మిదేవిని ఆర్‌ఐ మల్లేష్ వేధించి ఇబ్బందులకు గురిచేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పేరం స్వర్ణలత అన్నారు. దళితులకు టీడీపీ పాలనలో రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
దళిత మహిళ నాగలక్ష్మికి అన్ని విధాలుగా అండగా ఉండి పోరాడుతామని చెప్పారు. విధుల నుండి తొలగించిన వీఆర్‌ఏ కంబగిరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నేత నాగభూషణం హెచ్చరించారు. అనంతరం వారు డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, పట్టణాధ్యక్షుడు మనోజ్, ఎస్సీ సెల్ నాయకులు బాలరాజు, సంపత్, దూల రఘు, జీవయ్య, పుల్లయ్య, శివయ్య, కంచం రామ్మోహన్‌రెడ్డి, నరసింహారెడ్డి, శిలార్‌వలి, ఓబుళరెడ్డి, మహిళా నాయకురాలు మావుళేశ్వరీ, లక్ష్మిదేవి, శీనా, రాజన్న, రాజగోపాల్, బాబు, వీరయ్య, దేవేంద్ర, అగ్గిరప్ప, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment