సాక్షి, కామారెడ్డి: గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ) వ్యవస్థను రద్దు చేసిన గత ప్రభుత్వం వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఎంప్లాయ్ ఐడీ ఇవ్వకపోవడంతో వేతనాలు అందడం లేదు. జీతాల కోసం రాష్ట్రంలో 14,954 మంది వీఆర్‌ఏలు ఎదురు చూస్తున్న దుస్థితి నెల కొంది. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని భా వించిన గత సర్కారు.. మొదట వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. తర్వాత వీఆర్‌ఏలను కూడా వారి విద్యార్హతలను బట్టి వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డు అసిస్టెంట్లుగా, ఆఫీసు సబార్డినేట్లు గా సర్దుబాటు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది గ్రామ సేవకులు (వీఆర్‌ఏ) ఉండగా వారిలో తొలి విడతలో 14,954 మందిని వివిధ శాఖల్లో స ర్దుబాటు చేశారు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా 2,451 మంది, మున్సిపాలిటీల్లో జూనియర్ అసిస్టెంట్లు, వార్డ్ ఆఫీసర్‌లుగా 1,266 మంది, రెవెన్యూ శాఖలో రికార్డు అసిస్టెంట్లుగా 2,113 మంది, ఆఫీసు సబార్డినేట్లుగా 680 మంది, నీటి పా రుదల శాఖలో 5వేల మంది, మిషన్ భగీరథలో 3, 372 మందిని సర్దుబాటు చేశారు.
మరికొన్ని శాఖ ల్లో మరో 72 మందిని సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక వృద్ధాప్యంతో ఉన్న వారు, వారసులు లేకపోవడం వంటి కారణాలతో కొందరి ఉద్యోగా లు సర్దుబాటు కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 10న వీఆర్‌ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో అక్కడే జాయిన్ కావాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో దూరమైనా సరే వెళ్లి ఉద్యోగాల్లో జాయిన్ అయి పని చేస్తున్నారు.
ఇంకా ఎంప్లాయ్ ఐడీ జనరేట్ కాలేదు
ఎంప్లాయ్ ఐడీ నమోదైన తర్వాతనే వారిని ప్రభు త్వ ఉద్యోగుల కింద లెక్కగట్టి వేతనాల ప్రక్రియను మెదలుపెడతారు. వీఆర్‌ఏలను ఆయా ఉద్యోగాల్లో సర్దుబాటు ప్రక్రియను చేపట్టిన గత ప్రభుత్వం వారికి ఐడీ ఇంకా ఇవ్వలేదు. ఇంతలో ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో ఆ విషయం పక్కకు వెళ్లింది. ఫలితంగా నాలుగు నెలలుగా వేతనాలు అందక వీఆర్‌ఏలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బదీలీలతో ఊరు కాని ఊరు వెళ్లిన తాము అప్పులు చేసి జీవనం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త ప్రభుత్వం పరిష్కరించాలి
వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న మమ్మల్ని వివిధ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయడంతో ఎంతో సంతోషించాం. అయితే మాకు వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం మా సమస్యను వెంటనే పరిష్కరించాలి. – ముదాం చిరంజీవి, వీఆర్‌ఏల సంఘం ప్రతినిధి, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment