నియామక ఉత్తర్వుల కోసం వీఆర్‌ఏల కుటుంబ సభ్యుల ఎదురుచూపులు
సమస్యను పరిష్కరించాలంటూ ప్రజావాణికి పెద్దఎత్తున ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)గా పనిచేస్తూ 61 ఏళ్లు నిండిన వారి వారసులకు కారుణ్య నియామకాలిచ్చే ప్రక్రియ నిలిచిపోయింది. వాస్తవానికి, వీరికి ఉద్యోగాలివ్వాలంటూ గత ఏడాది జూలైలోనే ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వుల మేరకు అవసరమైన పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెవెన్యూ సేవల్లో ఉన్న 3,797 మంది వీఆర్‌ఏల వారసులకు అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు ఆర్థిక శాఖ అనుమతి లభించినప్పటికీ రెవెన్యూ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా నియామక ఉత్తర్వులు అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా అన్ని రకాలుగా ప్రభుత్వ వర్గాల అనుమతులున్నా తమకు నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం పట్ల వీఆర్‌ఏలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో మంగళవారం జరిగిన ప్రజావాణికి పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ జి.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి డి.దివ్యలకు వినతిపత్రం అందజేశారు. వీఆర్‌ఏల సమస్యలు విన్న ఇద్దరూ సానుకూలంగా స్పందించారు. విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మొత్తం 906 దరఖాస్తులు
కాగా, మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజావాణికి 906 దరఖాస్తులు అందాయి. గృహ నిర్మాణ శాఖ (306), రెవెన్యూ (138), విద్యుత్ (138), మైనార్టీ సంక్షేమ శాఖ (134), పంచాయతీరాజ్ (130)లతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన 192 దరఖాస్తులు అందినట్టు ప్రజావాణి అధికారులు వెల్లడించారు.
కాగా, యూరోపియన్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ బంజారాహిల్స్‌కు చెందిన ఓ కన్సల్టెన్సీ తమవద్ద పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిందంటూ బాధితులు ప్రజావాణికి రాగా, తక్షణమే స్పందించిన చిన్నారెడ్డి సిటీ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్‌కు లేఖరాసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment