విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్‌వో), విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ), పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ల రూపంలో ఇప్పుడు యువతకు పల్లె కొలువులు స్వాగతం పలుకుతున్నాయి. ఈ కొలువులు చేజిక్కాలంటే పదునైన ప్రిపరేషన్ వ్యూహాలను ఒడిసిపట్టుకోవాల్సిందే! ఈ పరీక్షల్లో గ్రామీణ ప్రాంతాలతో సంబంధమున్న అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. వీటిపై పట్టు కోసం ప్రిపరేషన్ వ్యూహాలు..
1,657 వీఆర్‌వో, 4,305 వీఆర్‌ఏ, 2,677 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షలకు ఒకటే సిలబస్ అయినప్పటికీ, వీఆర్‌వో ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలోనూ, వీఆర్‌ఏ ప్రశ్నపత్రం పదో తరగతి స్థాయిలోనూ ఉంటుంది. వీటిలో జనరల్ స్టడీస్ విభాగంలో 60 ప్రశ్నలుంటే, 30 ప్రశ్నలు గ్రామీణ ప్రాంతాలు, అక్కడి ప్రజల జీవన విధానానికి సంబంధించిన అంశాలపై ఉంటాయి. పంచాయతీ కార్యదర్శుల పరీక్షలో ఒక్కొక్కటి 150 మార్కులకు రెండు పేపర్లుంటాయి. వీటిలో ఒక పేపర్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల (ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ను దృష్టిలో ఉంచుకొని)పై ఉంటుంది.
‘గ్రామీణం’ కీలకం:
వీఆర్‌వో, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఈసారి పోటీ తీవ్రంగా ఉండనుంది. ఇటీవలి కాలంలో గ్రూప్-1, గ్రూప్-2 వంటి పరీక్షలకు నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల వాటికి సిద్ధమవుతున్న వారు కూడా ఈ పరీక్షలకు పోటీపడుతున్నారు. దీనికనుగుణంగా ప్రిపరేషన్‌పై పట్టు సాధించాలి. ఉమ్మడిగా చూస్తే గ్రామీణ స్థితిగతులకు సంబంధించిన అంశాలు కీలకమైనవి.
ప్రభుత్వ పథకాలు; వ్యవసాయ రంగం- స్వరూపం; రెవెన్యూ వ్యవస్థ; పంచాయతీరాజ్ వ్యవస్థల నుంచి ప్రశ్నలు వస్తాయి.
పథకాలపై పట్టుకోసం:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాల గురించి క్షుణ్నంగా చదవాలి. ఏదైనా పథకం గురించి చదివేటప్పుడు ఆ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆ పథకం ముఖ్య లక్ష్యం ఏమిటి? లబ్ధిదారులు ఎవరు? మన రాష్ట్రంలో ఆ పథకం అమలు తీరుతెన్నులు తదితర అంశాలపై దృష్టిసారించాలి. పథకాల్లో మార్పులు, చేర్పులు, విలీనాలు వంటి అంశాలను అధ్యయనం చేయాలి. వీటిని వర్తమాన అంశాలతో అనుసంధానం చేస్తూ చదివితే, సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.
ఉదా: రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకాన్ని పరిశీలిద్దాం..
ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించారు. 2013, మే1 నుంచి అమలు చేస్తున్నారు. తెల్ల రేషన్‌కార్డున్న పేద కుటుంబాలలోని ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చులను ఈ పథకం ద్వారా ప్రభుత్వం భరిస్తుంది. మహిళ గర్భవతి అయినప్పటి నుంచి ప్రతి నెలా రూ. వెయ్యి ఇస్తారు. ఆడపిల్ల పుడితే వెంటనే రూ. 2,500 ఇస్తారు. అప్పటి నుంచి ఐదేళ్లు వచ్చే వరకు ఆ పాపకు సంవత్సరానికి రూ. 1500 ఇస్తారు. పాఠశాలలో చేరినప్పుడు రూ.వెయ్యి అందజేస్తారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఏటా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఇస్తారు. ఇంటర్‌లో ఏడాదికి రూ.3,500; డిగ్రీ మూడేళ్లలో ఏడాదికి రూ. 4 వేలు అందజేస్తారు. ఇంటర్ తర్వాత అమ్మాయి చదువు ఆపేస్తే పెళ్లి ఖర్చులకుగాను ప్రభుత్వం రూ. 50 వేలు ఇస్తుంది. డిగ్రీ తర్వాత పెళ్లి చేసుకుంటే రూ. లక్ష ఇస్తుంది. ఇలా ఆడపిల్ల చదువు, పెళ్లి ఖర్చుల కోసం ప్రభుత్వం దాదాపు రూ. 2 లక్షల పదివేలు ఖర్చు చేస్తుంది.
తెల్ల రేషన్‌కార్డులున్న కుటుంబాలలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి అమ్మాయి డిగ్రీ వరకు చదువుకోవాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర శాసనసభ బంగారు తల్లి పథకానికి 2013, జూన్ 19న చట్టబద్ధత కల్పించింది. 2013, మే1 లేదా ఆ తర్వాత పుట్టిన ఆడపిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
గత ప్రశ్నలు:
ప్ర:బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది?
జ:ఇందిర ప్రభ పథకం
ప్ర:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టిన పథకం?
జ:రాజీవ్ యువ కిరణాలు
ప్ర:క్షీర విప్లవానికి శ్రీకారం చుడుతూ పశుక్రాంతి పథకాన్ని ప్రారంభించింది ఎవరు?
జ:వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
ప్ర:ఎలాంటి ఆధారం లేని మహిళలకు, అనాధ మహిళలకు, వితంతువులకు ఆధారం కల్పించే పథకం?
జ:స్వధార్
ప్ర:డ్వాక్రా పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం?
జ:1982-83
ప్ర:గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మన రాష్ట్రంలో తొలుత ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు?
జ:అనంతపురం
ప్ర:సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన పథకంలో రాష్ట్ర, కేంద్రాల వాటా ఎంత?
జ:25:75
వ్యవసాయం.. స్కోర్‌కు సాయం:
వ్యవసాయం గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలతో ముడిపడిన ప్రధాన అంశం. ఈ రంగం గురించి చదివేటప్పుడు పంట సీజన్లు, నీటి పారుదల సౌకర్యాలు, ప్రాజెక్టులు, ముఖ్య పంటలు, పంటలు పండించేందుకు అనువైన పరిస్థితులు, ఎరువులు, హరిత విప్లవం,
వ్యవసాయానికి సంబంధించిన ఇతర విప్లవాల గురించి అధ్యయనం చేయాలి.
వ్యవసాయ రుణాలు, గ్రామీణ బ్యాంకులు, పరపతి సహకార సంఘాలు తదితరాల గురించి చదవాలి.
పశు సంపద, చేపలు, కోళ్లు, పట్టుపురుగులు, తేనెటీగలు, గొర్రెల పెంపకం వంటి అంశాలపైనా ప్రశ్నలు వస్తాయి.
గత ప్రశ్నలు:
ప్ర: అడవుల్లో గిరిజనులు చేసే వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు?
జ:పోడు వ్యవసాయం
ప్ర:కృత్రిమ ఎరువు ఏది?
జ:యూరియా
ప్ర: నేలలోనైట్రోజన్ లోపం వల్ల కలిగే నష్టం?
జ:మొక్కల పెరుగుదలను నిరోధించి, ఆకులు పసుపుపచ్చగా మారుతాయి.
ప్ర:గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ద్వారా లబ్ధి పొందే జిల్లా?
జ:కర్నూలు
ప్ర:సెరికల్చర్ అంటే ఏమిటి?
జ: పట్టుపురుగుల పెంపకం
ప్ర:వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించేది ఎవరు?
జ:వ్యవసాయ ధరల కమిషన్
రెవెన్యూ వ్యవస్థ:
రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారులు నిర్వహించే విధులను తెలుసుకోవాలి. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి. వ్యవసాయ భూముల రికార్డులను నిర్వహించాలి. ప్రభుత్వానికి రావాల్సిన భూమిశిస్తు, సెస్‌లు, పన్నులు వసూలు చేయాలి. ప్రభుత్వ భూముల రికార్డులను నిర్వహించాలి.
వరదలు, తుపాన్లు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి. పరిపాలనకు సంబంధించిన విధులే కాకుండా శాంతిభద్రతల విషయంలోనూ కీలకపాత్ర పోషించాలి. గ్రామాల్లో జరిగే ఘర్షణలు, హత్యలు, ఆత్మహత్యలు, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. గ్రామంలో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్ని మాపక అధికారులకు, పోలీసులకు, ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులకు వెంటనే తెలియజేయాలి.
అభ్యర్థులు రెవెన్యూకు సంబంధించిన పదాల అర్థాలను చదవాలి. ఉదా: పహాణి, ఫసలి, నక్షా, బంజరు, రెమిషన్.
కొన్ని ప్రశ్నలు:
ప్ర:ఎకరానికి ఎన్ని చదరపు గజాలు?
జ:4,840
ప్ర:ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు?
జ:రఘువీరారెడ్డి
ప్ర:గ్రామంలో రేషన్ కార్డు పొందడానికి ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి?
జ:మండల తహశీల్దారు
పంచాయతీ రాజ్ వ్యవస్థ:
పంచాయతీ రాజ్ వ్యవస్థ నుంచి గత పరీక్షలలో చాలా ప్రశ్నలు వచ్చినందున ఈ అంశంపై పట్టుసాధించాలి. పంచాయతీరాజ్ వ్యవస్థ ఆవిర్భావం, ప్రగతిపై అధ్యయనం చేయాలి. బల్వంత్‌రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీ సిఫార్సులు; 73, 74వ రాజ్యాంగ సవరణలు; గ్రామ పంచాయతీల విధులు- అధికారాలు; సర్పంచ్ అధికారాలు, విధులు; మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల విధులు, అధికారాలను క్షుణ్నంగా చదవాలి.పంచాయతీరాజ్‌కు సంబంధించి రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన అధికరణలను తెలుసుకోవాలి.
కొన్ని ప్రశ్నలు:
ప్ర:ఆంధ్రప్రదేశ్‌లో ఏ సంవత్సరంలో మండల పరిషత్‌లు ఏర్పాటు చేశారు?
జ:1986
ప్ర:గ్రామ పంచాయతీ రాజకీయ కార్యనిర్వాహక అధిపతి ఎవరు?
ఙ:గ్రామ సర్పంచ్
ప్ర:భారత దేశంలో స్థానిక సంస్థల పితామహుడు ఎవరు?
జ:రిప్పన్
ప్ర:గ్రామ పంచాయతీల గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్‌లో ప్రస్తావించారు?
జ:40వ ఆర్టికల్
గ్రామాలే కేంద్రంగా..
పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు జరిగే పరీక్షలో పేపర్-2లో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలపై ప్రశ్నలు వస్తాయి. వీటికోసం ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, వ్యాధుల నివారణ, గ్రామాల అభివృద్ధి, ప్రస్తుత సమాజంలో సామాజిక ఉద్రిక్తతలు, ఘర్షణలు, అణగారిన వర్గాలకు చెందిన ప్రజల సమస్యలు తదితర అంశాలున్నాయి.
రాజకీయ వ్యవస్థ నుంచి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ సంస్థలు, సహకార సంస్థల సేవలపై ప్రశ్నలు అడుగుతారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వైజ్ఞానిక పరిశోధనలు వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
నమూనా ప్రశ్నలు
1)కిశోర బాలికల సాధికారతకు ఉద్దేశించిన పథకం?
జవాబు) ఇందిరమ్మ
బి) జనని
సి) ధనలక్ష్మి
డి) సబల
2)అంత్యోదయ పథకాన్ని మొదటిసారి అమలు చేసిన రాష్ట్రం ఏది?
జవాబు) ఆంధ్రప్రదేశ్
బి) రాజస్థాన్
సి) గుజరాత్
డి) హర్యానా
3)పంచాయతీరాజ్ వ్యవస్థను మొట్టమొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం?
జవాబు) రాజస్థాన్
బి) ఆంధ్రప్రదేశ్
సి) కర్ణాటక
డి) పశ్చిమబెంగాల్
4)ఆంధ్రప్రదేశ్‌లో మండలాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
జవాబు) వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
బి) కోట్ల విజయభాస్కర్‌రెడ్డి
సి) మర్రి చెన్నారెడ్డి
డి) ఎన్.టి.రామారావు
5)ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించిది?
జవాబు) వరదలు
బి) తాగునీరు
సి) పాలు
డి) తేయాకు
6)ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను మొదట ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జవాబు) 1975
బి) 1982
సి)1969
డి) 1980
7)గ్రే రివల్యూషన్ దేనికి సంబంధించింది?
జవాబు) రొయ్యలు
బి) బంగాళాదుంపలు
సి) ఎరువులు
డి) నూనెగింజలు
8)సోయాబీన్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
జవాబు) ఆంధ్రప్రదేశ్
బి) మధ్యప్రదేశ్
సి) ఉత్తరప్రదేశ్
డి) హిమాచల్‌ప్రదేశ్
9)సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది?
జవాబు) గ్రామీణాభివృద్ధి
బి) ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
సి) మానవ వనరుల అభివృద్ధి
డి) పట్టణాభివృద్ధి
10)రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎవరు?
జవాబు) దామోదర రాజనర్సింహ
బి) సునీతా లక్ష్మారెడ్డి
సి) జానారెడ్డి
డి) పొన్నాల లక్ష్మయ్య
సమాధానాలు:1) డి; 2) బి; 3) ఎ; 4) డి; 5) సి;6) ఎ; 7) సి; 8) బి; 9) సి; 10) సి.