వీఆర్‌ఏ / వీఆర్‌వో పోస్టుల భర్తీకి మోగిన నగారా | VRO,VRA jobs notification 2013 | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏ / వీఆర్‌వో పోస్టుల భర్తీకి మోగిన నగారా

Published Thu, Dec 26 2013 2:08 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

VRO,VRA jobs notification 2013

భారీ రిక్రూట్‌మెంట్‌కు తెర లేచింది.. రాష్ట్ర చరిత్రలోనే అతి ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉన్న వీఆర్‌ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్), వీఆర్‌వో (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) పోస్టుల భర్తీ కోసం షెడ్యూల్ వెలువడింది.. ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ విభాగంలో పోస్టులు.. సొంత జిల్లాలోనే విధులు నిర్వహించే వెసులుబాటు ఉండడంతో లక్షలాది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో వీఆర్‌ఏ,వీఆర్‌వో పోస్టుల భర్తీ,  ప్రిపరేషన్ సంబంధిత వివరాలు..


 
 రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కీలక విభాగాల్లో ఒకటి కావటం.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వర్తించాల్సిన విధులు ఎక్కువగా ఉండటం.. క్రమంగా ఉద్యోగుల పదవీ విరమణ కారణంగా.. అన్ని విభాగాల కంటే రెవెన్యూ విభాగంలో ఉద్యోగుల అవసరం పెరుగుతోంది.. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే వీఆర్‌ఏ, వీఆర్‌వో కీలకం కావటంతో.. గతేడాది దాదాపు ఏడు వేల వీఆర్‌ఏ, వీఆర్‌వో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రస్తుతం కూడా ఆ తరహాలోనే భారీ స్థాయిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ను  విడుదల చేసింది.
 


 నియామకం ఇలా:
 తాజాగా భర్తీ చేసే మొత్తం పోస్టుల సంఖ్య 5,962. ఇందులో 1,657 వీఆర్‌వో, 4,305 వీఆర్‌ఏ పోస్టులు. స్థానికత (లోకల్) నిర్ధారణ విషయానికొస్తే, వీఆర్‌వో పోస్టులను జిల్లా యూనిట్‌గా, వీఆర్‌ఏ పోస్టులను రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భర్తీ చేస్తారు. వీఆర్‌వో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు. వీఆర్‌ఏ భర్తీలో మాత్రం మార్పు చోటు చేసుకుంది.


 
 ఇంతకుముందు మండలంలోని ఏగ్రామస్తులైనా ఖాళీలను బట్టి వీఆర్‌ఏ పోస్టులకు దర ఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఈ నోటిఫికేషన్ నుంచి వీఆర్‌ఏ పోస్టులు ఏయే గ్రామాల్లో ఖాళీలు ఉంటాయో.. ఆయా గ్రామాల వారే ఆ పోస్టులకు అర్హులవుతారు. ఇతర గ్రామస్తులు వీఆర్‌ఏలుగా నియమితులైతే గ్రామం గురించి పూర్తి సమాచారం ఉండదనే ఉద్దేశంతో ఇటీవల రెవెన్యూ శాఖ ఈ మేరకు సవరణ చేసింది.


 
 అర్హత:
 వీఆర్‌వోలకు ఇంటర్ లేదా సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు ఉన్న మూడేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. వీఆర్‌ఏలకు పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు.


 
 వయసు:
 వీఆర్‌వోలకు 18 నుంచి 36 సంవత్సరాల వయోపరిమితి కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 41 ఏళ్లు, వికలాంగులకు 46 ఏళ్లు, మాజీ సైనికులకు 39 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చారు. వీఆర్‌ఏలకు 18 నుంచి 37 సంవత్సరాలు కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 42, వికలాంగులకు 47, మాజీ సైనికులకు 40 ఏళ్ల వరకు సడలింపు ఉంది.


 
 పరీక్ష ఫీజు:
 రూ. 300 కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి. వికలాంగులకు పూర్తి మినహాయింపు ఉంది.
 దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఈసేవ, మీసేవ, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.


 
 పరీక్ష విధానం:
 పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. నెగిటివ్ మార్కులు ఉండవు. సిలబస్ ఒకటే అయినా.. ప్రశ్నల క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. వీఆర్‌వో పోస్టులకు ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్, వీఆర్‌ఏలకు పదోతరగతి స్థాయిలోనూ ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో రూపొందిస్తారు.


 
 వివరాలు..
విభాగం    మార్కులు
జనరల్ స్టడీస్     60
అర్థమెటిక్ స్కిల్స్     30
లాజికల్ స్కిల్స్     10
 జనరల్ స్టడీస్‌లో సగం ప్రశ్నలు ( 60 ప్రశ్నల్లో 30) గ్రామీణ ప్రాంతాలు, అక్కడి ప్రజల జీవన విధానంపై అవగాహనను పరీక్షించేవిగా ఉంటాయి.


 
 షెడ్యూల్ ఇలా
 నోటిఫికేషన్ జారీ    : డిసెంబర్ 28, 2013
 దరఖాస్తు గడువు    : జనవరి 12, 2014
 నెట్‌లో దరఖాస్తు గడువు    : జనవరి 13, 2014
 హాల్ టికెట్ల జారీ    : 2014, జనవరి 19 నుంచి
 పరీక్ష తేదీ    : ఫిబ్రవరి 2, 2014
 (వీఆర్‌వోలకు ఉదయం, వీఆర్‌ఏలకు మధ్యాహ్నం)
 ప్రాథమిక ‘కీ’ వెల్లడి    : ఫిబ్రవరి 4, 2014
 తుది ‘కీ’ వెల్లడి    : ఫిబ్రవరి 10, 2014
 ఫలితాల ప్రకటన    : ఫిబ్రవరి 20, 2014
 నియామక పత్రాల జారీ    : 2014, ఫిబ్రవరి 26 నుంచి
 
 
 
 సిలబస్-ప్రిపరేషన్
 జనరల్ స్టడీస్:
 సిలబస్‌ను గ మనిస్తే.. అత్యధికంగా జనరల్ స్టడీస్‌కు వెయిటేజీ ఇచ్చారు. ఇందులో భూగోళ శాస్త్రం, చరిత్ర, అర్థ శాస్త్రం, పౌర శాస్త్రం, జీవశాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రం నుంచి ప్రశ్నలు వస్తాయి. చరిత్రలో ప్రశ్నలు విషయ ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ సార్లు పునశ్చరణ చేసుకోవడం మంచిది. హైస్కూల్ స్థాయి వరకు ఉన్న అంశాలను చదవడం మంచిది. భూగోళ శాస్త్ర విషయానికొస్తే.. గ్రామీణ నేపథ్యం, వ్యవసాయం, ఆనకట్టలు, స్థానిక ప్రత్యేకతలు, సాగు మొదలైన అంశాల చుట్టు ఉంటున్నాయి. అర్థశాస్త్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ప్రారంభించిన సంవత్సరాలు, లక్ష్యం, ప్రాతిపదికలను మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.
 
 

ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రకటనలను, కరపత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. జిల్లా కేంద్ర సమాచార కేంద్రాల్లోనూ ఇవి లభ్యమవుతాయి. ఆర్థిక అంశాలను భూగోళ శాస్త్రంతో అనుసంధానం చేసుకుని చదవడం ప్రయోజనకరంగా ఉంటుంది. పౌరశాస్త్రం విషయానికొస్తే అధిక శాతం ప్రశ్నలు పంచాయతీరాజ్ వ్యవస్థపై వస్తున్నాయి. ఈ క్రమంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థ, నిర్మాణం, విధులు, 73,74వ రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగ ప్రతిపత్తి, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, ఈగవర్నెన్స్, రెవెన్యూ పరిపాలన, వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు-అధికారాలు-విధుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.
 

ఇందుకోసం హైస్కూల్ స్థాయి వరకు ఉన్న పౌర శాస్త్రం అంశాలను చదవడం ఉపయుక్తం. అంతేకాకుండా సంబంధిత అంశాలపై సమకాలీనంగా చోటు చేసుకుంటున్న పరిణమాలపై అప్‌డేట్‌గా ఉండాలి. జీవశాస్త్రంలో విజ్ఞానశాస్త్ర చరిత్ర, సూక్ష్మ జీవులు, మొక్కలు, జంతువులు, మానవ శరీరం ఆరోగ్యం, పశు సంవర్థనం, జీవన విధానాలు, పోషణ, నియంత్రణ సమన్వయం వంటి అంశాలపై దృష్టి సారించాలి. జీవశాస్త్రంలో ఎక్కువగా ప్రజారోగ్యంపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాధులు, కారణాలు, నివారణ, పోషణ వంటి అంశాలపై పట్టు సాధించాలి. భౌతిక-రసాయ శాస్త్రంలో ప్రశ్నలు ఎక్కువగా అనువర్తిత విధానంలో ఉంటాయి. నిత్య జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, సమకాలీన ఆవిష్కరణలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. కరెంట్ అఫైర్స్‌లో ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్యం, జనాభా, పేదరికం, పారిశ్రామిక రంగం, రాజకీయంగా జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ముఖ్య సంఘటనలను అధ్యయనం చేయాలి.


 
 అర్థమెటిక్ స్కిల్స్:
 ఇందులో ప్రశ్నలు అనువర్తిత విధానంలో ఉంటాయి. భాజనీయత సూత్రాలు, సరాసరి, కాలం-పని, ఎత్తులు-దూరాలు, లాభనష్టాలు, వడ్డీ, శాతం, క్షేత్రమితి,, వైశాల్యం మొదలైన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో మెరుగైన మార్కులు సాధించాలంటే వీలైనంత ఎక్కువగా మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. సమస్యను అవగాహన చే సుకునే నేర్పు పెంపొందించుకోవాలి. సందర్భానుసారం సూత్రాలను ఉపయోగించే విధంగా అవగాహన స్థాయిని పెంచుకోవాలి. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లోని గణిత శాస్త్ర అంశాలను అంశాల వారీగా ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.


 
 లాజికల్ స్కిల్స్:
 ఇందులో కోడింగ్/డీకోడింగ్, పోలికలు, బంధాలు, సంఖ్య శ్రేణులు, అక్షర శ్రేణులు, భిన్న లక్షణాల నిర్ధారణ, దిశ నిర్ధారణ, క్యాలెండర్, నాన్-వెర్బల్ రీజనింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో మెరుగైన మార్కులు సాధించాలంటే మౌలిక భావనను అవగాహన చేసుకుని మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. విషయ సంగ్రహణ, సామర్థ్యం, తర్కబద్ధంగా ఆలోచించడం వంటి నైపుణ్యాలాధారంగా సమాధానాన్ని గుర్తించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. మాదిరి ప్రశ్నపత్రాలను నిరంతరంగా సాధన చేస్తూ ఉండాలి.


 
నిర్దేశించిన సిలబస్ కాకుండా జనరల్ నాలెడ్జ్‌పై కూడా కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి సబ్జెక్ట్‌లో విశిష్టత కలిగిన కొన్ని సార్వత్రిక అంశాలు ఉంటాయి. ఉదాహరణకు విజ్ఞాన శాస్త్ర ప్రగతిని మార్చిన ఆవిష్కరణ ఏది (సమాధానం-చక్రం)? మొదటి జీవశాస్త్ర వేత్త (ఆరిస్టాటిల్)? అతి చిన్నవి, పెద్దవి, మొట్టమొదటి వారు, చివరి వారు మొదలైన అంశాలను అడగవచ్చు.
 
 ప్రత్యేకంగా:
 జనరల్ స్టడీస్‌లో సగం ప్రశ్నలు గ్రామీణ ప్రాంత నేపథ్యానికి కేటాయించారు. కాబట్టి మొత్తం సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ నేపథ్యంతో ముడిపడి ఉన్న అంశాలను అన్వయించుకొని చదువుకోవాలి. ఇటువంటి అంశాలు చాలా వరకు భూగోళ శాస్త్రం, పౌర శాస్త్రం, అర్థ శాస్త్రం, జీవశాస్త్రంలో కనిపిస్తాయి. కాబట్టి వాటిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. అంతేకాకుండా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన పథకాల గురించి సమగ్రంగా అవగాహన పెంచుకోవాలి.
 


 జిల్లాల వారీగా పోస్టులు..
     జిల్లా    వీఆర్‌ఏ    వీఆర్‌వో
     శ్రీకాకుళం    176    77
     విజయనగరం    137    90
     విశాఖపట్నం    12    41
     తూర్పు గోదావరి    357    87
     పశ్చిమ గోదావరి    360    51
     కృష్ణా    403    64
     గుంటూరు    425    83
     ప్రకాశం    282    117
     ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు    145    48
     చిత్తూరు    188    104
     అనంతపురం    167    64
     వైఎస్సార్ కడప    128    27
     కర్నూలు    176    105
     మహబూబ్‌నగర్    94    103
     కరీంనగర్    223    83
     మెదక్    172    98
     వరంగల్    177    62
     నిజామాబాద్    94    65
     ఆదిలాబాద్    83    53
     ఖమ్మం    105    78
     నల్లగొండ    201    68
     రంగారెడ్డి    158    72
     హైదరాబాద్    42    17
     మొత్తం    4,305    1,657
 
 
 విధులు
 వీఆర్‌వోలు విధి నిర్వహణలో భాగంగా విలేజ్ రెవెన్యూ ఆకౌంట్లు, రికార్డుల నిర్వహణ, నీటితీరువా, భూమిశిస్తుల వసూలు, గ్రామస్థాయిలో పంటల విస్తీర్ణం, ఏయే పంటలు పండుతున్నాయి? పంటల రకాలు? వాటి సరాసరి దిగుబడి నమోదు చేయడం, తుపానులు, కరువు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు గ్రామస్థాయిలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం, నష్ట నివారణకు అవసరమైన ఏర్పాట్లు చేయడం, పై అధికారులకు సమాచారం ఇవ్వడం, క్షేత్రస్థాయిలో పర్యటించి కరువు పరిస్థితులపై నివేదికలు ఇవ్వడం, తుపానుల సమయంలో ప్రాణ, పంట,ఆస్తి నష్టాలను లెక్కగట్టడం, ప్రభుత్వ భూములను పరిరక్షించడం, వాటి రికార్డులను నిర్వహించడం చేయాలి.


 
 వీఆర్‌ఏలు అన్ని రకాల విధుల్లో వీఆర్‌వోలకు సహాయకులుగా వ్యవహరిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు తక్కువ కాలంలోనే ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. వీఆర్‌వోగా విధుల్లో చేరినవారు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ పోస్టుల వరకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కనీసం పదేళ్లలో పనితీరు, ఖాళీల ఆధారంగా డిప్యూటీ తహసీల్దార్ స్థాయి వరకు ఎదగొచ్చు. వీఆర్‌ఏగా చేరినవాళ్లు ఆ తర్వాత వీఆర్‌వో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దార్ వరకు పదోన్నతులు పొందొచ్చు.


 
 టిప్స్
 పదో తరగతి, ఇంటర్మీడియెట్/తత్సమానం అర్హత పేర్కొన్నప్పటికీ.. పీజీ అర్హత ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ సాగించాలి.
 ప్రిపరేషన్‌కు సంబంధించి ఇతరులను అనుసరించకుండా సొంత పద్ధతిని రూపొందించుకోవాలి.
 మార్కెట్లో ప్రతి పుస్తకాన్ని చదవకుండా స్టాండర్డ్ పబ్లికేషన్ పుస్తకాలను ఎంచుకోవాలి.
 సిలబస్‌ను త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో కాకుండా అవగాహనతో సాగాలి.


 
 రిఫరెన్స్ పుస్తకాలు
 6-10 సోషల్, సైన్స్, మ్యాథ్స్ పుస్తకాలు.
 మనోరమ ఇయర్ బుక్
 లాజికల్ రీజనింగ్-ఆర్‌ఎస్ అగర్వాల్


 
 బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్,
 క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement