VRA posts
-
ఏపీ: త్వరలో వీఆర్వో పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి : రెవెన్యూ శాఖలో 3,795 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) గ్రేడ్ –2 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్వో (గ్రేడ్–2) పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే. ఇదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)గా పనిచేస్తున్న అర్హులకు ఒకే పర్యాయం (వన్‌టైమ్) ప్రాతిపదికన వీఆర్వోలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియేషన్లు విజ్ఞప్తులు చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఐదు నెలల కిందటే సానుకూల నిర్ణయం తీసుకుంది. 3,795 వీఆర్వో పోస్టులను ఇంటర్మీడియెట్ తత్సమాన విద్యార్హతలు ఉన్న వీఆర్ఏలతో భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్లకు అనుమతినిచ్చింది. (మరో ఐదు ‘శ్రీసిటీ’లు) ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జిల్లా కలెక్టర్లు ఈ ఫైలును పక్కన పెట్టారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మరోసారి విజ్ఞప్తి చేయడంతో ఈ పోస్టుల భర్తీకి ఉన్న అర్హతలపై సందిగ్ధతను తొలగిస్తూ, చిన్న సడలింపు ఇస్తూ రెవెన్యూ శాఖ తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం తక్షణమే జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించి సీనియారిటీ ప్రాతిపదికన అర్హులైన వీఆర్ఏలను వీఆర్వోలుగా ఎంపిక చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. (మీ అన్నగా, తమ్ముడిగా సాయం ) మార్గదర్శకాలివీ... ► కచ్చితంగా ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ► ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి వీఆర్ఏలుగా ఐదేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. ► ఇంటర్మీడియట్ చదవకుండా నేరుగా డిగ్రీ, పీజీ చేసిన వారు కూడా అర్హులే. ► ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైనా కోర్సు చేసి ఉంటే అందుకు ముందస్తు అనుమతి తీసుకున్నారో లేదో పరిశీలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోరు. ఈ నిబంధనను మినహాయించి సర్టిఫికెట్లు సరైనవో కావో నిర్ధారించుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు జారీ చేసిన మెమోలో పేర్కొంది. ► అర్హులైన వీఆర్ఏలను వీఆర్వోలుగా ఎంపిక చేసేందుకు వన్‌టైమ్ ప్రాతిపదికన అనుమతించింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలను ఒకే పర్యాయానికి అనే షరతుతో మినహాయింపు ఇచ్చింది. -
సమయం ఒక్కరోజు మాత్రమే...
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వీఆర్ఏల పదోన్నతుల ప్రక్రియపై కస రత్తు ముమ్మరం చేశారు. కొద్దిరోజుల క్రితం పదో న్నతులు ఇచ్చినా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో తాజాగా మరో కొత్త కోణానికి తెరతీశారు. వీఆర్ఏల తాత్కాలిక జాబితాను రూపొందించి ఒక్కరోజు సమయమిస్తూ పరిశీలన కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలకు పంపారు. తాజాగా 436 మందితో మెరిట్ ప్రకారం ఫైనల్ సీనియారిటీ తాత్కాలిక జాబితాను సిద్ధం చేసిన అధికారులు తహసీల్దార్ల నుండి నివేదిక కోరారు. ఈనెల 21న అంటే గురువారం జాబితాను తహసీల్దార్లకు పంపి శుక్రవారమే నివేదిక పంపించాలని సూచించారు. ఒక్కరోజే సమయం ఇవ్వడంతో ఒకరు, ఇద్దరు తప్ప మిగతా వారెవరూ నివేదికను కలెక్టర్‌కు పంపించలేదు. భూప్రక్షాళన కార్యక్రమంలో బిజీగా ఉన్న తహసీల్దార్లు పరిశీలన నివేదికను ఒక్కరోజులో కావాలని ఆదేశించడంపై పెదవి విరుస్తున్నారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఢిల్లీ నుండి రాకముందే ఈ ప్రక్రియను ముగించాలన్న ఉద్దేశంతో ఇలా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 13న ఉమ్మడి జిల్లాలో 80 మంది వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. దీంతో స్పందించిన కలెక్టర్ జాబితా పునఃపరిశీలనకు ఆదేశించా రు. జాబితాను మూడు రోజులు పరిశీలించగా అక్రమాలు వాస్తవమని తేలడంతో తాజాగా మరోసారి తాత్కాలిక జాబితా రూపొందించారు. ఆయన అనుకున్నదే చేస్తారా.. కలెక్టరేట్లో తనదైన ముద్ర వేసుకున్న కీలక అధి కారి తాను చెప్పిందే వేదంగా ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలు బయటపడడంతో తన చేతికి మట్టి అంటకుండా కింది స్థాయి సిబ్బందిపై నెడుతున్నట్లు సమాచారం. తప్పుడు వివరాలు పొందుపరిచి ఏకంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పదోన్నతి ఉత్తర్వులు ఇప్పించారంటే ఆయన పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో కలెక్టర్ లేని సమయంలో పరిశీలన నివేదికల కోసం ఆదేశించడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. తాను అనుకున్నదే చేసి తీరాలని, తనను వ్య తిరేకిస్తున్న వారిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. 15రోజుల సమయం ఇవ్వాలి వీఆర్ఏల పదోన్నతుల్లో మరోసారి తప్పిదాలు చేస్తే ఆందోళనలు తప్పవని డైరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులుగౌడ్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తాత్కాలిక జాబితాను రూపొందించిన కలెక్టరేట్ అధికారులు పరిశీలన నివేదిక కోసం తహసీల్దార్ కార్యాలయ అధికారులకు ఒక్క రోజు సమయమివ్వడం సరికాదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చొరవతో పదోన్నతుల జాబితాపై పునపరిశీలన జరిగిందని, అక్రమాలు జరిగాయని స్ఫష్టం కావడంతో మరోసారి తాత్కాలిక జాబితాను తయారు చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు పరిశీలనకు పదిహేను రోజులు సమయం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. అలాగే, ఈ నెల 21 నాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల సీనియారిటీ, ఇంటర్ అర్హత కలిగిన వీఆర్ఏలందరినీ తాత్కాలిక జాబితాలో చేర్చాలని, ఆ జాబితాను నోటీసు బోర్డుపై పబ్లిష్ చేయాలని, అభ్యంతరాలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. -
7వ తరగతి పాసైనా వీఆర్ఏలకు అర్హులే
హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్ఏ)లకు సంబంధించి కారుణ్య నియామకాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తెలంగాణ వీఆర్ఏ సర్వీస్ రూల్స్‌కు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ సర్కారు గురువారం సవరణ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జారీ చేసిన జీవో 161 ప్రకారం మరణించిన వీఆర్ఏ కుటుంబంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందగోరిన వారికి కనీస విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణతగా పేర్కొన్నారు. ఈ నిబంధనతో ఎంతోమంది పాత తరం వీఆర్ఏల కుటుంబాల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగం పొందేందుకు ఆటంకంగా మారింది. దీంతో తెలంగాణ వీఆర్ఏల కేంద్ర సంఘం, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం(ట్రెసా) ఇచ్చిన విజ్ఞాపనలను పరిశీలించిన ప్రభుత్వం విద్యార్హతల విషయంలో వెసులుబాటు కల్పిస్తూ తాజాగా సవరణ ఉత్తర్వులిచ్చింది. సవరణ ఉత్తర్వుల మేరకు బాధిత కుటుంబంలో ఉద్యోగం కోరుకునే వారు తక్షణం ఉద్యోగం పొందేందుకు ఏడవ తరగతి పాసై ఉంటే చాలు. అయితే.. సదరు అభ్యర్థి కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్లలో టెన్త్ ఉత్తీర్ణత తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. లేని పక్షంలో సర్వీసు నుంచి తొలగించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. -
వీఆర్ఏ పోస్టులకు అభ్యర్థుల కరువు
ఒక్క అభ్యర్థీ దరఖాస్తు చేసుకోలేదు. మాజీ సైనికుల కేటగిరిలో భర్తీ చేయాల్సిన 5 పోస్టులకూ అదే పరిస్థితి. బీసీ-సీ జనరల్ కేటగిరికి కేటాయించిన 3 పోస్టులు, బీసీ-ఏ, ఎస్టీ మహిళలకు కేటాయించిన ఒక్కో పోస్టుకూ దరఖాస్తులు అందలేదు. ఈ పోస్టుల భర్తీకి జిల్లా రెవెన్యూ యంత్రాంగం నివేదికను రూపొందించి సీసీఎల్ఏకు పంపాల్సి ఉంది. దరఖాస్తులందని గ్రామాలివే! అంధ మహిళల విభాగంలో...: బి.కొత్తకోట మండలం గొల్లపల్లె, బీఎన్.కండ్రిగ మండలం నెలవాయి, చంద్రగిరి మండలం కల్రోడ్పల్లె, చిన్నగొట్టిగల్లు మండలం ఎగువూరు, చిత్తూరు మండలంలోని మురకంబట్టు, చౌడేపల్లె మండలం పెద్దయల్లకుంట్ల, గంగాధరనెల్లూరు మండలం గొల్లపల్లె గ్రామాల నుంచి దరఖాస్తులు రాలేదు. కుప్పం మండలం కృష్ణదాసానపల్లె, నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లె, పాకాల మండలం గోర్పాడు, పెనుమూరు మండలం నంజర్లపల్లె, పూతలపట్టు మండలం పూతలపట్టు గ్రామం, రామచంద్రాపురం మండలం చిట్టత్తూరు కాలేపల్లె, శాంతిపురం మండలం మోరసానిపల్లె, సత్యవేడు మండలం కన్నావరం, వడమాలపేట మండలం శ్రీబొమ్మరాజుపురం, వాల్మీకిపురం మండలం టిసాకిరేవుపల్లె నుంచి దరఖాస్తులు అందలేదు. మాజీ సైనికుల విభాగంలో...: చంద్రగిరి మండలం నరసింగాపురం, గుర్రంకొండ మండలం సరిమడుగు, ములకలచెరువు మండలం నాయనిచెరువు, తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లె , వాల్మీకిపురం మండలం విఠలం గ్రామాల్లో మాజీ సైనికులు ఎవ్వరూ వీఆర్ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేదు. బీసీ-సీ కేటగిరిలో...: క్రిస్టియన్లుగా మారిన ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన వీఆర్ఏ పోస్టులకు సంబంధించి గుర్రంకొండ మండలం తరిగొండరాచపల్లె, ములకలచెరువు మండలం పెద్దపాళెం, తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లె నుంచి ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేదు. వరదయ్యపాళెం మండలం మరదవాడ గ్రామాన్ని బీసీ-సీకి చెందిన మహిళకు కేటాయించారు. వి.కోట మండలం బోడిగుట్టపల్లెను ఎస్టీ మహిళకు కేటాయించగా ఆయా గ్రామాల నుంచి ఒక్క దరఖాస్తూ అందలేదు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవడం వల్లే! వీఆర్ఏ పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనల వల్లే జిల్లాలో అభ్యర్థులు కరువయ్యారని పరిశీలకులు భావిస్తున్నారు. రోస్టర్ విధానం ప్రకారం ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంటోంది. వీఆర్వో పోస్టుల మాదిరిగానే వీఆర్ఏ పోస్టుల భర్తీకి జిల్లాను యూనిట్‌గా తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నిరుద్యోగులు అంటున్నారు. -
66,606 వీఆర్ఏ, వీఆర్వో దరఖాస్తులు
సాక్షి, మంచిర్యాల/కలెక్టరేట్: ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా సర్కా రు కొలువుల జాతర ఆరంభించింది. కోర్టు జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ), గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వో), పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో వీఆర్వో53, వీఆర్ఏ 83 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 2న రాత పరీక్ష జరుగనుండగా, డిసెంబర్ 28 నుంచి ఈనెల 13 వరకు దరఖాస్తులు సమర్పించడానికి గడువుగా నిర్ణయించా రు. సోమవారంతో గడువు ముగియగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. పీజీ అర్హత గల వారు కూడా దరఖాస్తు వీఆర్ఏ, వీఆర్వో పోస్టులకు ఎస్సెస్సీ, ఇంటర్ అర్హతగా ప్రకటించడంతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉన్నత విద్యావంతులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో నెలకు రూ.30 వేలకుపైగా ఆదా యం ఆర్జించే వారు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారు పోటీ పడుతున్నారు. కాగా, పరీక్ష రాసే అభ్యర్థులు ప్రధానంగా జనరల్ స్టడీస్, అర్ధమెటిక్, లాజికల్ స్కిల్స్ అంశాలపై పట్టు సాధించేందుకు శిక్షణ కేంద్రాలకు వెళ్తున్నారు. పరీక్షకు గడువు సమీపిస్తున్నందు న అభ్యర్థులు హైరానా పడుతున్నారు. ఆరు నుంచి పదో తరగతి వరకు సిలబస్, ఇంటర్ సిల బస్ లభ్యం కావాలంటే ఆ మెటీరియల్‌ను వెతకడమే కష్టం. రూ.1.50 కోట్లకు పైగా ఆదాయం వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు ప్రభుత్వానికి కాసులవర్షం కురిపించా యి. ఈ పరీక్షలకు నిర్ణయించిన పరీక్ష ఫీజుతో రూ.1.50 కోట్లపైనే ఆదాయం సమకూరింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం రూ.150 పరీక్ష ఫీజు నిర్ణయించింది. దీంతో వీఆర్ఏ పోస్టుకు సుమారు 900 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుపై రూ.150 చొప్పున రూ.1.35 లక్ష ఆదాయం వచ్చింది. మిగతా కేటగిరీ అభ్యర్థులు 1,087 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుపై రూ.300 చొప్పున రూ.3.26 లక్షల ఆదాయం సమకూరింది. వీఆర్వో పోస్టు కోసం సుమారు 19 వేల మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుపై రూ.150 చొప్పున రూ.28.50 లక్షలు వస్తే.. మిగతా 45,619 మంది అభ్యర్థుల పేరిట రూ.300 చొప్పున రూ.1.36 కోట్ల ఆదాయం సమకూరింది. 2012లో చేపట్టిన వీఆర్వో పోస్టులకు జిల్లావ్యాప్తంగా 15,394 మంది దరఖాస్తు చేసుకుంటే వీఆర్ఏ పోస్టులకు 4 వేల మంది దరఖాస్తు చేశారు. అప్పట్లో ఒక్కో దరఖాస్తుకు రూ.200 ఖరారు చేయడంతో ప్రభుత్వానికి రూ.38.78 లక్షల ఆదాయం సమకూరింది. కానీ ఈసారి పోస్టులతోపాటు దరఖాస్తులు పెరగడంతో ఊహించని విధంగా ఆదాయం వచ్చింది. ఇదిలావుంటే.. గత నియామకాల్లో వీఆర్ఏ పోస్టులకు 4 వేల మంది దరఖాస్తు చేసుకుంటే.. ఈసారి కేవలం 1,987 మంది మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించడం గమనార్హం. -
వీఆర్ఏ / వీఆర్వో పోస్టుల భర్తీకి మోగిన నగారా
భారీ రిక్రూట్మెంట్కు తెర లేచింది.. రాష్ట్ర చరిత్రలోనే అతి ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉన్న వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్), వీఆర్వో (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) పోస్టుల భర్తీ కోసం షెడ్యూల్ వెలువడింది.. ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ విభాగంలో పోస్టులు.. సొంత జిల్లాలోనే విధులు నిర్వహించే వెసులుబాటు ఉండడంతో లక్షలాది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో వీఆర్ఏ,వీఆర్వో పోస్టుల భర్తీ, ప్రిపరేషన్ సంబంధిత వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కీలక విభాగాల్లో ఒకటి కావటం.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వర్తించాల్సిన విధులు ఎక్కువగా ఉండటం.. క్రమంగా ఉద్యోగుల పదవీ విరమణ కారణంగా.. అన్ని విభాగాల కంటే రెవెన్యూ విభాగంలో ఉద్యోగుల అవసరం పెరుగుతోంది.. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే వీఆర్ఏ, వీఆర్వో కీలకం కావటంతో.. గతేడాది దాదాపు ఏడు వేల వీఆర్ఏ, వీఆర్వో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ప్రస్తుతం కూడా ఆ తరహాలోనే భారీ స్థాయిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ను విడుదల చేసింది. నియామకం ఇలా: తాజాగా భర్తీ చేసే మొత్తం పోస్టుల సంఖ్య 5,962. ఇందులో 1,657 వీఆర్వో, 4,305 వీఆర్ఏ పోస్టులు. స్థానికత (లోకల్) నిర్ధారణ విషయానికొస్తే, వీఆర్వో పోస్టులను జిల్లా యూనిట్‌గా, వీఆర్ఏ పోస్టులను రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భర్తీ చేస్తారు. వీఆర్వో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు. వీఆర్ఏ భర్తీలో మాత్రం మార్పు చోటు చేసుకుంది. ఇంతకుముందు మండలంలోని ఏగ్రామస్తులైనా ఖాళీలను బట్టి వీఆర్ఏ పోస్టులకు దర ఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఈ నోటిఫికేషన్ నుంచి వీఆర్ఏ పోస్టులు ఏయే గ్రామాల్లో ఖాళీలు ఉంటాయో.. ఆయా గ్రామాల వారే ఆ పోస్టులకు అర్హులవుతారు. ఇతర గ్రామస్తులు వీఆర్ఏలుగా నియమితులైతే గ్రామం గురించి పూర్తి సమాచారం ఉండదనే ఉద్దేశంతో ఇటీవల రెవెన్యూ శాఖ ఈ మేరకు సవరణ చేసింది. అర్హత: వీఆర్వోలకు ఇంటర్ లేదా సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు ఉన్న మూడేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. వీఆర్ఏలకు పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు. వయసు: వీఆర్వోలకు 18 నుంచి 36 సంవత్సరాల వయోపరిమితి కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 41 ఏళ్లు, వికలాంగులకు 46 ఏళ్లు, మాజీ సైనికులకు 39 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చారు. వీఆర్ఏలకు 18 నుంచి 37 సంవత్సరాలు కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 42, వికలాంగులకు 47, మాజీ సైనికులకు 40 ఏళ్ల వరకు సడలింపు ఉంది. పరీక్ష ఫీజు: రూ. 300 కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి. వికలాంగులకు పూర్తి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఈసేవ, మీసేవ, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు. పరీక్ష విధానం: పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. నెగిటివ్ మార్కులు ఉండవు. సిలబస్ ఒకటే అయినా.. ప్రశ్నల క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. వీఆర్వో పోస్టులకు ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్, వీఆర్ఏలకు పదోతరగతి స్థాయిలోనూ ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో రూపొందిస్తారు. వివరాలు.. విభాగం మార్కులు జనరల్ స్టడీస్ 60 అర్థమెటిక్ స్కిల్స్ 30 లాజికల్ స్కిల్స్ 10 జనరల్ స్టడీస్‌లో సగం ప్రశ్నలు ( 60 ప్రశ్నల్లో 30) గ్రామీణ ప్రాంతాలు, అక్కడి ప్రజల జీవన విధానంపై అవగాహనను పరీక్షించేవిగా ఉంటాయి. షెడ్యూల్ ఇలా నోటిఫికేషన్ జారీ : డిసెంబర్ 28, 2013 దరఖాస్తు గడువు : జనవరి 12, 2014 నెట్లో దరఖాస్తు గడువు : జనవరి 13, 2014 హాల్ టికెట్ల జారీ : 2014, జనవరి 19 నుంచి పరీక్ష తేదీ : ఫిబ్రవరి 2, 2014 (వీఆర్వోలకు ఉదయం, వీఆర్ఏలకు మధ్యాహ్నం) ప్రాథమిక ‘కీ’ వెల్లడి : ఫిబ్రవరి 4, 2014 తుది ‘కీ’ వెల్లడి : ఫిబ్రవరి 10, 2014 ఫలితాల ప్రకటన : ఫిబ్రవరి 20, 2014 నియామక పత్రాల జారీ : 2014, ఫిబ్రవరి 26 నుంచి సిలబస్-ప్రిపరేషన్ జనరల్ స్టడీస్: సిలబస్‌ను గ మనిస్తే.. అత్యధికంగా జనరల్ స్టడీస్‌కు వెయిటేజీ ఇచ్చారు. ఇందులో భూగోళ శాస్త్రం, చరిత్ర, అర్థ శాస్త్రం, పౌర శాస్త్రం, జీవశాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రం నుంచి ప్రశ్నలు వస్తాయి. చరిత్రలో ప్రశ్నలు విషయ ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ సార్లు పునశ్చరణ చేసుకోవడం మంచిది. హైస్కూల్ స్థాయి వరకు ఉన్న అంశాలను చదవడం మంచిది. భూగోళ శాస్త్ర విషయానికొస్తే.. గ్రామీణ నేపథ్యం, వ్యవసాయం, ఆనకట్టలు, స్థానిక ప్రత్యేకతలు, సాగు మొదలైన అంశాల చుట్టు ఉంటున్నాయి. అర్థశాస్త్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ప్రారంభించిన సంవత్సరాలు, లక్ష్యం, ప్రాతిపదికలను మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రకటనలను, కరపత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. జిల్లా కేంద్ర సమాచార కేంద్రాల్లోనూ ఇవి లభ్యమవుతాయి. ఆర్థిక అంశాలను భూగోళ శాస్త్రంతో అనుసంధానం చేసుకుని చదవడం ప్రయోజనకరంగా ఉంటుంది. పౌరశాస్త్రం విషయానికొస్తే అధిక శాతం ప్రశ్నలు పంచాయతీరాజ్ వ్యవస్థపై వస్తున్నాయి. ఈ క్రమంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థ, నిర్మాణం, విధులు, 73,74వ రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగ ప్రతిపత్తి, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, ఈగవర్నెన్స్, రెవెన్యూ పరిపాలన, వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు-అధికారాలు-విధుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఇందుకోసం హైస్కూల్ స్థాయి వరకు ఉన్న పౌర శాస్త్రం అంశాలను చదవడం ఉపయుక్తం. అంతేకాకుండా సంబంధిత అంశాలపై సమకాలీనంగా చోటు చేసుకుంటున్న పరిణమాలపై అప్డేట్గా ఉండాలి. జీవశాస్త్రంలో విజ్ఞానశాస్త్ర చరిత్ర, సూక్ష్మ జీవులు, మొక్కలు, జంతువులు, మానవ శరీరం ఆరోగ్యం, పశు సంవర్థనం, జీవన విధానాలు, పోషణ, నియంత్రణ సమన్వయం వంటి అంశాలపై దృష్టి సారించాలి. జీవశాస్త్రంలో ఎక్కువగా ప్రజారోగ్యంపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాధులు, కారణాలు, నివారణ, పోషణ వంటి అంశాలపై పట్టు సాధించాలి. భౌతిక-రసాయ శాస్త్రంలో ప్రశ్నలు ఎక్కువగా అనువర్తిత విధానంలో ఉంటాయి. నిత్య జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, సమకాలీన ఆవిష్కరణలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. కరెంట్ అఫైర్స్‌లో ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్యం, జనాభా, పేదరికం, పారిశ్రామిక రంగం, రాజకీయంగా జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ముఖ్య సంఘటనలను అధ్యయనం చేయాలి. అర్థమెటిక్ స్కిల్స్: ఇందులో ప్రశ్నలు అనువర్తిత విధానంలో ఉంటాయి. భాజనీయత సూత్రాలు, సరాసరి, కాలం-పని, ఎత్తులు-దూరాలు, లాభనష్టాలు, వడ్డీ, శాతం, క్షేత్రమితి,, వైశాల్యం మొదలైన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో మెరుగైన మార్కులు సాధించాలంటే వీలైనంత ఎక్కువగా మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. సమస్యను అవగాహన చే సుకునే నేర్పు పెంపొందించుకోవాలి. సందర్భానుసారం సూత్రాలను ఉపయోగించే విధంగా అవగాహన స్థాయిని పెంచుకోవాలి. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లోని గణిత శాస్త్ర అంశాలను అంశాల వారీగా ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. లాజికల్ స్కిల్స్: ఇందులో కోడింగ్/డీకోడింగ్, పోలికలు, బంధాలు, సంఖ్య శ్రేణులు, అక్షర శ్రేణులు, భిన్న లక్షణాల నిర్ధారణ, దిశ నిర్ధారణ, క్యాలెండర్, నాన్-వెర్బల్ రీజనింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో మెరుగైన మార్కులు సాధించాలంటే మౌలిక భావనను అవగాహన చేసుకుని మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. విషయ సంగ్రహణ, సామర్థ్యం, తర్కబద్ధంగా ఆలోచించడం వంటి నైపుణ్యాలాధారంగా సమాధానాన్ని గుర్తించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. మాదిరి ప్రశ్నపత్రాలను నిరంతరంగా సాధన చేస్తూ ఉండాలి. నిర్దేశించిన సిలబస్ కాకుండా జనరల్ నాలెడ్జ్‌పై కూడా కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి సబ్జెక్ట్‌లో విశిష్టత కలిగిన కొన్ని సార్వత్రిక అంశాలు ఉంటాయి. ఉదాహరణకు విజ్ఞాన శాస్త్ర ప్రగతిని మార్చిన ఆవిష్కరణ ఏది (సమాధానం-చక్రం)? మొదటి జీవశాస్త్ర వేత్త (ఆరిస్టాటిల్)? అతి చిన్నవి, పెద్దవి, మొట్టమొదటి వారు, చివరి వారు మొదలైన అంశాలను అడగవచ్చు. ప్రత్యేకంగా: జనరల్ స్టడీస్‌లో సగం ప్రశ్నలు గ్రామీణ ప్రాంత నేపథ్యానికి కేటాయించారు. కాబట్టి మొత్తం సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ నేపథ్యంతో ముడిపడి ఉన్న అంశాలను అన్వయించుకొని చదువుకోవాలి. ఇటువంటి అంశాలు చాలా వరకు భూగోళ శాస్త్రం, పౌర శాస్త్రం, అర్థ శాస్త్రం, జీవశాస్త్రంలో కనిపిస్తాయి. కాబట్టి వాటిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. అంతేకాకుండా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన పథకాల గురించి సమగ్రంగా అవగాహన పెంచుకోవాలి. జిల్లాల వారీగా పోస్టులు.. జిల్లా వీఆర్ఏ వీఆర్వో శ్రీకాకుళం 176 77 విజయనగరం 137 90 విశాఖపట్నం 12 41 తూర్పు గోదావరి 357 87 పశ్చిమ గోదావరి 360 51 కృష్ణా 403 64 గుంటూరు 425 83 ప్రకాశం 282 117 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 145 48 చిత్తూరు 188 104 అనంతపురం 167 64 వైఎస్సార్ కడప 128 27 కర్నూలు 176 105 మహబూబ్‌నగర్ 94 103 కరీంనగర్ 223 83 మెదక్ 172 98 వరంగల్ 177 62 నిజామాబాద్ 94 65 ఆదిలాబాద్ 83 53 ఖమ్మం 105 78 నల్లగొండ 201 68 రంగారెడ్డి 158 72 హైదరాబాద్ 42 17 మొత్తం 4,305 1,657 విధులు వీఆర్వోలు విధి నిర్వహణలో భాగంగా విలేజ్ రెవెన్యూ ఆకౌంట్లు, రికార్డుల నిర్వహణ, నీటితీరువా, భూమిశిస్తుల వసూలు, గ్రామస్థాయిలో పంటల విస్తీర్ణం, ఏయే పంటలు పండుతున్నాయి? పంటల రకాలు? వాటి సరాసరి దిగుబడి నమోదు చేయడం, తుపానులు, కరువు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు గ్రామస్థాయిలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం, నష్ట నివారణకు అవసరమైన ఏర్పాట్లు చేయడం, పై అధికారులకు సమాచారం ఇవ్వడం, క్షేత్రస్థాయిలో పర్యటించి కరువు పరిస్థితులపై నివేదికలు ఇవ్వడం, తుపానుల సమయంలో ప్రాణ, పంట,ఆస్తి నష్టాలను లెక్కగట్టడం, ప్రభుత్వ భూములను పరిరక్షించడం, వాటి రికార్డులను నిర్వహించడం చేయాలి. వీఆర్ఏలు అన్ని రకాల విధుల్లో వీఆర్వోలకు సహాయకులుగా వ్యవహరిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు తక్కువ కాలంలోనే ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. వీఆర్వోగా విధుల్లో చేరినవారు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ పోస్టుల వరకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కనీసం పదేళ్లలో పనితీరు, ఖాళీల ఆధారంగా డిప్యూటీ తహసీల్దార్ స్థాయి వరకు ఎదగొచ్చు. వీఆర్ఏగా చేరినవాళ్లు ఆ తర్వాత వీఆర్వో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దార్ వరకు పదోన్నతులు పొందొచ్చు. టిప్స్ పదో తరగతి, ఇంటర్మీడియెట్/తత్సమానం అర్హత పేర్కొన్నప్పటికీ.. పీజీ అర్హత ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్‌కు సంబంధించి ఇతరులను అనుసరించకుండా సొంత పద్ధతిని రూపొందించుకోవాలి. మార్కెట్లో ప్రతి పుస్తకాన్ని చదవకుండా స్టాండర్డ్ పబ్లికేషన్ పుస్తకాలను ఎంచుకోవాలి. సిలబస్‌ను త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో కాకుండా అవగాహనతో సాగాలి. రిఫరెన్స్ పుస్తకాలు 6-10 సోషల్, సైన్స్, మ్యాథ్స్ పుస్తకాలు. మనోరమ ఇయర్ బుక్ లాజికల్ రీజనింగ్-ఆర్ఎస్ అగర్వాల్ బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్