గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్‌ఏ)లకు సంబంధించి కారుణ్య నియామకాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్‌ఏ)లకు సంబంధించి కారుణ్య నియామకాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తెలంగాణ వీఆర్‌ఏ సర్వీస్ రూల్స్‌కు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ సర్కారు గురువారం సవరణ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జారీ చేసిన జీవో 161 ప్రకారం మరణించిన వీఆర్‌ఏ కుటుంబంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందగోరిన వారికి కనీస విద్యార్హత పదవ తరగతి ఉత్తీర్ణతగా పేర్కొన్నారు. ఈ నిబంధనతో ఎంతోమంది పాత తరం వీఆర్‌ఏల కుటుంబాల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగం పొందేందుకు ఆటంకంగా మారింది.
దీంతో తెలంగాణ వీఆర్‌ఏల కేంద్ర సంఘం, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం(ట్రెసా) ఇచ్చిన విజ్ఞాపనలను పరిశీలించిన ప్రభుత్వం విద్యార్హతల విషయంలో వెసులుబాటు కల్పిస్తూ తాజాగా సవరణ ఉత్తర్వులిచ్చింది. సవరణ ఉత్తర్వుల మేరకు బాధిత కుటుంబంలో ఉద్యోగం కోరుకునే వారు తక్షణం ఉద్యోగం పొందేందుకు ఏడవ తరగతి పాసై ఉంటే చాలు. అయితే.. సదరు అభ్యర్థి కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్లలో టెన్త్ ఉత్తీర్ణత తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. లేని పక్షంలో సర్వీసు నుంచి తొలగించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.