సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు కారుణ్య నియామక ప్రక్రియకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. విధి నిర్వహణ లో మరణించిన సిబ్బంది వారసులకోసం కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చే యాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 1,600 కుటుంబాలు ఈ పథకంకోసం ఎదురు చూస్తున్నాయి. వాటిల్లో 813 దరఖాస్తులను మాత్రమే డిపో అధికారులు బస్ భవన్‌కు ఫార్వర్డ్ చేశారు.
ఇప్పట్లో ఈ నియామకాలు వద్దని గతంలో ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశించటంతో మిగతా దరఖాస్తులు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ప్రక్రియ ప్రారంభించారు. ఇందులో భాగంగా 813 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
కాగా, కారుణ్య నియామకాలపై ఎన్‌ఎంయూ నేత నరేందర్, టీజేఎంయూ నేత హన్మంతు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు ధన్యవాదాలు తెలిపారు. అయితే నియామకాలు తాత్కాలిక పద్ధతిలో కాకుండా రెగ్యులర్ బేసిస్‌లో చేపట్టాలని ఓ ప్రకటనలో కోరారు.
ఆ కుటుంబాలకు న్యాయం: మంత్రి పొన్నం
‘ఆర్టీసీలో నియామకాలు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కండక్టర్ నియామకాలు చేపట్టాం. దానిలో భాగంగా 813 మంది కండక్టర్లను నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు దీంతో న్యాయం జరుగుతుంది’.
Comments
Please login to add a commentAdd a comment