కారుణ్య నియామకాలకు ఆర్టీసీ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కారుణ్య నియామకాల కోసం ఆర్టీసీ యాజమాన్యం శనివారం సర్క్యూలర్ జారీ చేసింది. ఈ సర్క్యూలర్తో గతంలో ఉద్యోగాలు పొందిన 1120మంది సహా అదనంగా మరో 1000 మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు అమలు చేయాలన్న ఆర్టీసీ సిబ్బంది దీర్ఘకాల డిమాండును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ సిబ్బందిలో ఎవరైనా మరణించినట్లైతే వారి కుటుంబంలో అర్హులైన వారిలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తారు.
దాదాపు 1998 నుంచి ఆగిపోయిన ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలన్న డిమాండ్ ఆర్టీసీలో చాలా కాలంగా ఉంది. సుమారు 1120 మందికి మాత్రమే ప్రయోజనం కలిగేలా, 2010 డిసెంబర్ చివరి వరకు మాత్రమే వర్తించేలా పరిమితిని విధిస్తూ గతేడాది జనవరిలో విడుదలైన ఉత్తర్వులను కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఆర్టీసీలో కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేయటంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.