సాక్షి, హైదరాబాద్: సర్వీసులో ఉన్నంత కాలం ప్రతినెలా జీతం నుంచి సంస్థ మినహాయిస్తూ వచ్చి న సొమ్ముల కోసం ఇప్పుడు వందలాది మంది ఆర్టీసీ పూర్వ ఉద్యోగులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో డిపాజిట్ అయి ఉన్న ఆ మొత్తాన్ని ఆర్టీసీ వినియోగించుకోవటంతో ఈ దుస్థితి తలెత్తింది. ఆ ర్టీసీలో ఉద్యోగులు ప్రతినెలా 7 శాతం తమ జీతం నుంచి మినహాయించి సహకార పరపతి సంఘంలో డిపాజిట్ చేస్తారు.
ప్రస్తుతం సీసీఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దాని నిధులను ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో సీసీఎస్ భవితవ్యమే గందరగోళమైంది. అయితే ఇప్పటివరకు సీసీఎస్‌కు సంబంధించి మిగతా వ్యవహారాల్లో ప్రతిష్టంభన ఉన్నా.. రిటైరైన ఉద్యోగులకు సెటిల్మెంట్ల విషయంలో మాత్రం లోటు రానివ్వలేదు. కానీ గత ఆగస్టు నుంచి ఈ సెటిల్మెంట్ల విషయంలో కూడా ఆర్టీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
ఆ నెల నుంచి పదవీ విరమణ పొందిన వారికి ఇప్పటి వరకు ఆ డిపాజిట్ మొత్తాలను ఇవ్వలేదని అంటున్నారు. సగటున ఒక్కో ఉద్యోగికి కనిష్టంగా రూ.6 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. అలా దాదాపు 500 మంది ఉద్యోగులకు ఈ మొత్తాన్ని చెల్లించలేదని చెబుతున్నారు.
అధిక వడ్డీ ఆశతో..
సర్వి సులో ఉన్న ఉద్యోగులకు జీతాల నుంచి వచ్చే ఈ మొత్తమే చివరి వరకు ఆయువు పట్టు. అలా ప్రతినెలా జమ అయ్యే నిధులతోనే ఆ సంస్థ ఉద్యోగులకు రుణాలు ఇస్తుంది. ఆ డిపాజిట్ మొత్తాలపై అధిక వడ్డీని ఉద్యోగులకు చెల్లిస్తుంది. దీంతో చాలామంది మధ్యలో డిపాజిట్ మొత్తాన్ని తీసుకోకుండా పదవీవిరమణ వరకు అలాగే కొనసాగిస్తారు. కొందరైతే, రిటైర్ అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తూ అధిక వడ్డీ పొందుతారు.
కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆగస్టు నుంచి ఆర్టీసీ సీసీఎస్‌కు పెద్దగా నిధులు విడుదల చేయకపోవటంతో పదవీవిరమణ పొందిన వారికి కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. రిటైర్‌మెంట్ సెటిల్‌మెంట్లతో రకరకాల ప్రణాళికలు చేసుకుని, ఇప్పుడు ఆ మొత్తం అందని వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment