ఆ 183 మంది ఆర్టీసీ ఉద్యోగులుగానే రిటైర్‌మెంట్ తీసుకుంటారా? ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అందే అన్ని రకాల బెనిఫిట్స్ పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియ ఆలస్యమవుతున్న కొద్దీ వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. కోరుకున్న అవకాశం అందినట్టే అందిచేజారిపోతుందనే బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించేందుకు సిద్ధమని ఇటీవల ఆర్టీసీ చైర్మన్ స్వయంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులూ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు, వారు పనిచేస్తున్న విభాగాల వారీగా ఆర్థికశాఖకు వెళ్లాయి. జీతాలు చెల్లింపునకు అంతా సిద్ధమవుతోంది. కానీ, ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టుగా ప్రభుత్వ ఉత్తర్వు మాత్రం జారీ కాలేదు. ఏ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలో ఆ ఉత్తర్వులో పేర్కొనాల్సి ఉంది. ఆ తేదీ విషయంలో స్పష్టత లేకపోయేసరికి ఇప్పుడు ఆర్టీసీ లో గందరగోళం నెలకొంది.
ఆగస్టు నెలాఖరుకు ఆర్టీసీలో 183 మంది పదవీ విరమణ పొందాల్సి ఉంది. రిటైర్‌మెంట్‌కు ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడకపోవటంతో తాము విలీన ప్రక్రియ కంటే ముందే విరమణ చేయాల్సి వస్తుందేమోనన్న టెన్షన్ వారిలో ఉంది. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నెల31నే మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దీంతో తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేయొచ్చని ఈ 183 మంది ఆశపడ్డారు. కానీ నెలాఖరు సమీపిస్తున్నా, అసలు తంతు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
గవర్నర్ ఆమోదంలో జాప్యంతో..: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును ఈ నెల 6వ తేదీన శాసనసభ ఆమోదించింది. ఆ వెంటనే బిల్లు గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజ్‌భవన్ దానిపై ఆమోదముద్ర వేయలేదు. పది రోజులు దాటినా గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ఆ బిల్లుపై సందేహాల నివృత్తికి న్యాయశాఖ కార్యదర్శి అభిప్రాయం కోసం పంపినట్టు రాజ్‌భవన్‌వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. దీంతో బిల్లుపై గవర్నర్ సంతకం, ప్రభుత్వ ఉత్తర్వు జారీకి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది.
ఈ బెనిఫిట్స్ కోల్పోయినట్టేనా ?
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి సీనియర్ డిపో మేనేజర్ వరకు పెద్దగా ప్రయాజనం లేకున్నా, కిందిస్థాయి ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో మంచి పెరుగుదల ఉంటుంది.
- గ్రాట్యూటీ, పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పీఆర్‌సీ వస్తే జీతాలు పెరుగుదల మరింతగా ఉంటుంది.
- ఆర్టీసీలో ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండగా, ప్రభుత్వంలో అది 61 ఏళ్లుగా ఉంది. దీంతో ఒక సంవత్సరం ఎక్కువగా పనిచేసే వెసులుబాటు కలుగుతుంది.
- పెరిగిన జీతం 12 నెలల పాటు అందుకునే వీలు చిక్కుతుంది. ఉద్యోగ భద్రతకు భరోసా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment