ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఇంకా అందని బెనిఫిట్స్
సాక్షి, హైదరాబాద్: పదవీవిరమణ పొందిన ఉద్యోగుల వీడ్కోలు కార్యక్రమాలు భావోద్వేగ వాతావర ణం మధ్య జరుగుతాయి. ఉద్యోగి దంపతులకు పూలమాలలు, శాలువాలతో సత్కరించి వారి సేవలను ఘనంగా పొగు డుతారు. వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లలో కొన్నింటిని అదేరోజు చెల్లించి దర్జాగా సాగనంపుతారు. ఆర్టీసీలోనూ ఈ తంతు సాధారణమే. కానీ కొన్ని నెలలుగా తీరు మారింది.
పూలమాలలు, బొకేలు ఇచ్చి వీడ్కోలు చెప్పేస్తున్నారు. పదవీ విరమణ ఆర్థిక ప్రయో జనాల మాటేమిటి అంటే ఆ ఒక్కటి అడగొద్దంటోంది సంస్థ. నష్టాల వల్ల నిధులు లేవన్న కారణంతో రిటైర్డ్ ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. ఇప్పుడు వందలమంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయో జనాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
నిలిచిపోయిన గ్రాట్యుటీ..
పదవీవిరమణ పొందిన కొద్ది రోజుల్లోనే గ్రాట్యుటీ మొత్తం చెల్లించే పద్ధతి ఉండేది. కానీ, ఇప్పుడు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.
» ఈ సంవత్సరం జనవరి వరకు వెంటవెంటనే గ్రాట్యుటీ చెల్లించారు.
» ఫిబ్రవరి నుంచి బ్రేక్ పడింది. ఆ నెలలో రిటైర్ అయిన వారికి నెల ఆలస్యంగా చెల్లించారు.
» మార్చిలో రిటైర్ అయిన వారికి మూడు రోజుల క్రితం చెల్లించారు.
» ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందుతున్న వారు ఎదురుచూపుల జాబితాలో ఉన్నారు. వీరికి ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత లేదు.
ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్‌గా వచ్చే వాటిల్లో ఇదే పెద్ద మొత్తం. దీని ఆధారంగా భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంటారు. కానీ, ఆ మొత్తం చేతికందటంలో జరుగుతున్న జాప్యం ఆర్టీసీ కార్మికుల్లో గందరగోళానికి కారణమవుతోంది.
డ్రైవర్, కండక్టర్ లాంటి వారికి దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఈ మొత్తం అందాల్సి ఉంటుంది. ఈడీ లాంటి పెద్ద పోస్టులోని అధికారులకు రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. చిరుద్యోగులుగా ఉండి రిటైర్ అయినవారు ఇప్పుడు ప్రత్యామ్నాయ నిధి లేక ఈ మొత్తంపైనే ఆశలు పెట్టుకున్నారు. దాదాపు ఐదొందల కుటుంబాలు ఇప్పుడు ఆ మొత్తం కోసం ఎదురుచూస్తున్నాయి.
బాండ్ డబ్బులూ అంతే..
ఆర్టీసీలో 2013 వేతన సవరణను 2015లో అమలు చేశారు. రెండేళ్ల బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. సర్వీసు ఉద్యోగులకు పెండింగ్‌లో పెట్టినా, రిటైర్ అయిన వారికి వెంటనే చెల్లిస్తూ వస్తున్నారు. కానీ జనవరి నుంచి రిటైర్ అయిన వారికి కూడా చెల్లించటం నిలిపేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అందరు ఉద్యోగులకు బాండ్ బకాయిలు చెల్లించనున్నట్టు మూడునెలల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ, కొన్ని నిధులే విడుదల కావటంతో ఇటీవల కేవలం డ్రైవర్లకు చెల్లించి వదిలేశారు. జనవరి నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ.లక్షన్నర వరకు అందాల్సి ఉంది. దాదాపు 1500 రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి.
‘చివరి నెల వేతనం’ హుళక్కే..
ఉద్యోగి పదవీవిరమణ పొందేప్పుడు చివరి నెల వేతనాన్ని తాత్కాలికంగా నిలిపేస్తారు. ఆ ఉద్యోగి సంస్థకు ఏవైనా బకాయిలు చెల్లించాల్సి ఉంటే, లెక్కలు చూసి చివరి నెల వేతనం నుంచి మినహాయించి మిగతా మొత్తాన్ని అందిస్తారు. రిటైర్ అయిన నెల రోజుల్లో ఆ మొత్తం విడుదల అవుతుంది. కానీ, జనవరి నుంచి ‘చివరి నెల వేతనం’ ఆపేశారు.
ఆర్జిత సెలవు మొత్తం ఏమైంది?
ఉద్యోగ కాలంలో పోగైన 300 ఆర్జిత సెలవు (ఈఎల్స్)ల ఎన్‌క్యాష్‌మెంట్ ఉంటుంది. ఆ సెలవులకు సంబంధించి నగదు చెల్లిస్తారు. ఆర్టీసీలో పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంచిన తర్వాత, తిరిగి రిటైర్మెంట్లు మొదలైన 2022 డిసెంబరు నుంచి ఆర్జిత సెలవుల మొత్తం చెల్లించటం ఆగిపోయింది. ఈ మొత్తం కనిష్టంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది.
కరువు భత్యం బకాయిలకూ దిక్కులేదు
ఆర్టీసీ ఉద్యోగు లకు గతంలో నాలుగున్నరేళ్ల పాటు కరువు భత్యం సవరించలేదు. అవన్నీ పేరుకుపోయాయి. విడతవారీగా ఆ తర్వాత 9 డీఏలను సవరించి వేతనంలో చేర్చారు. కానీ, ఆ డీఏలను వర్తింప చేయాల్సినకాలం నుంచి వర్తింపచేసినకాలం మధ్య రిటైర్ అయినవారికి కూడా ఆ లబ్ధి అందాల్సి ఉంది. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు వాటిని చెల్లించలేదు. ఈ మధ్యకాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కూడా వాటిని చెల్లించాల్సి ఉన్నా చెల్లించలేదు.
వేతన సవరణ బకాయిలేమయ్యాయి?
2017లో జరగా ల్సిన వేతన సవర ణను గత మే నెల నుంచి అమలులోకి తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 21% ఫిట్‌మెంట్‌తో దాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కానీ వాటి బకాయిలను రిటైర్మెంట్ సమయంలోనే చెల్లించనున్నట్టు అప్పట్లో ఆర్టీసీ వెల్లడించింది. మరి, ఈ ఫిట్‌మెంట్ అమలులోకి తెచ్చేలోపు రిటైర్ అయినవారి విషయంలో మాత్రం చెల్లింపు ఊసే లేకుండాపోయింది. దానిపై కనీసం స్పష్టత కూడా ఇవ్వటం లేదు.
మమ్మల్ని విడిచి వెళ్లొద్దు సార్..కన్నీటి పర్యంతమైన విద్యార్థులు
కుల్కచర్ల: విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు పాఠశాల అభ్యున్నతికి కృషి చేసిన తమ హెచ్‌ఎం బదిలీపై వెళ్లడాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. ‘మమ్మల్ని వదిలి.. మీరు వెళ్లొద్దు సార్’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. గురువుగా పాఠాలు చెప్పడంతో పాటు తండ్రిలా బంధాన్ని పెనవేసుకున్న తమ సార్ మరో స్కూల్‌కు వెళ్తున్నారని తెలిసి ఆవేదనకు గురయ్యారు.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చౌడాపూర్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న తిమ్యా, ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాస్కర్ స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో భాగంగా మరో చోటకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. మంగళవారం విధుల నుంచి రిలీవ్ అయి వెళ్తుండగా.. విద్యార్థులు వెక్కివెక్కి ఏడ్చారు. వారిని ఊరడించిన మాస్టారు.. ‘బాగా చదువుకోండి. మిమ్మల్ని చూసేందుకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తాం’ అని చెప్పి బరువెక్కిన హృదయంతో బైబై చెప్పుకుంటూ వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment