బాధిత రైతు కుటుంబంతో మాట్లాడుతున్న ఎస్సై రమేశ్‌బాధిత రైతు కుటుంబంతో మాట్లాడుతున్న ఎస్సై రమేశ్
సాక్షి, ఆసిఫాబాద్ : తమకు వారసత్వంగా రావాల్సిన భూమిని రెవెన్యూ అధికారులు తమ బంధువులకు పట్టాచేశారని, తమకు న్యాయం చేయాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహించిన మహిళా రైతు ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే వీఆర్‌ఏపై చెప్పుతో దాడి చేసిన సంఘటన మంగళవారం కుమురంభీం జిల్లాలోని రెబ్బెన మండలంలో చోటు చేసుకుంది. బాధిత రైతు కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... రెబ్బెన మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన దుర్గం సాంబయ్య తండ్రికి సుమారు 42 ఎకరాలు భూమి ఉంది. వారసత్వంగా సాంబయ్యకు అందులో సగభాగం రావాల్సి ఉంది. రెవెన్యూ అధికారుల అండదండలతో దుర్గం ప్రభాకర్, మల్లయ్య పట్టాలు చేయించుకున్నారని ఆరోపించింది. దీంతో తమకు న్యాయంగా రావాల్సిన భూమి తమకు అప్పగించాలని కోరుతూ సాంబయ్య కుటుంబ సభ్యులు రెండు సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు.
ఇదే సమస్యను పరిష్కరించాలని కోరుతూ గతంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఎంతకీ తమకు న్యాయం జరగకపోవటంతో గత నెల 29న సాంబయ్య కుమారుడు దుర్గం శ్రీనివాస్ ఏకంగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి సైతం ప్రయత్నించాడు. దీంతో ఆర్డీవో సిడాం దత్తు వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన నేటికి పరిష్కారం లభించలేదు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సాంబయ్య కుటుంబ సభ్యులు దుర్గం శ్రీనివాస్, మల్లయ్య, పోషయ్య, దుర్గం లక్ష్మి, దుర్గం జమున, దుర్గం అమృతలు వీఆర్వో ఉమ్‌లాల్‌తో వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహానికిలోనైన దుర్గం లక్ష్మి వీఆర్‌ఏ జానయ్యపై చెప్పుతో దాడికి పాల్పడింది. విషయాన్ని తెలుసుకున్న ఎస్సై రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
అకారణంగా దాడికి పాల్పడ్డారు: వీఆర్‌ఏ
దుర్గం సాంబయ్య భూమి సమస్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ అకారణంగా దుర్గం లక్ష్మి తహసీల్దార్ కార్యాలయంలోనే చెప్పుతో దాడి చేసింది. 1993లో మల్లయ్య, ప్రభాకర్‌కు పట్టాలు అయ్యాయి. నేనేమో 2008లో ఉద్యోగంలో చేరాను. నేనే పట్టాలు చేయించానని అకారణంగా నాపై దాడి చేసి అక్కడే ఉన్న వీఆర్వో ఉమ్‌లాల్‌పై సైతం దాడి చేసేందుకు ప్రయత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment