
వాసు(ఫైల్)
కుత్బుల్లాపూర్: తండ్రి పేరుతో తాత్కాలిక వీఆర్‌ఏగా పనిచేస్తూ అమాయకులను బెదిరించడమే కాకుండా ప్రభుత్వ ఆక్రమణల విషయంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప్పరి వాసు కోసం జగద్గిరిగుట్ట పోలీసులు గాలింపు చేపట్టారు. గత నెల చివరి వారంలో వాసుపై కేసులు నమోదైనా పోలీసులు అతడిని అరెస్ట్ చేయలేదు. తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సదరు వీఆర్‌ఏ ఆక్రమణలపై విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చేపట్టారు. ఖదిర్ అనే వ్యక్తి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేయడమే కాకుండా అతడి ఇంటిని కూల్చి వేసిన విషయంపై గత నెల 23న సీఐ గంగారెడ్డి కేసు నమోదు చేశారు.
అప్పటి నుంచి వాసు జాడ కనుక్కోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ ఎస్సై సూచన మేరకు ముందస్తు బెయిల్ కోసం వాసు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ వాసుపై పలు ఆరోపణలు రాగా సదరు ఎస్సై సెటిల్‌మెంట్ చేసినట్లు దేవేందర్‌నగర్ వాసులు ఆరోపిస్తున్నారు. తండ్రి స్థానంలో తాత్కాలిక వీఆర్‌ఏగా కొనసాగుతూ ఓ డ్రైవర్, ఓ అసిస్టెంట్‌ను నియమించుకుని ఖరీదైన కారులో తిరుగుతూ ఫోర్జరీ నోటరి డాక్యూమెంట్లను సృష్టిస్తూ ప్రభుత్వ స్థలాలను కాజేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్న వీఆర్‌ఏ ఉప్పరి బాలయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక వీఆర్‌ఏ గా కొనసాగిన వాసు వ్యవహార శైలి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment