పోరుబాటలో వీఆర్‌ఏలు
–నేటి నుంచి జిల్లావ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు
–డిమాండ్ల సాధనకు ఉద్యమబాట
దెందులూరు :
జిల్లా వ్యాప్తంగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు(వీఆర్‌ఏ) పోరుబాటకు సిద్ధమయ్యారు. డిమాండ్ల సాధనకు గురువారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సొంత రెవెన్యూశాఖతో పాటు అదనపు శాఖల విధులు సైతం నిర్వర్తిస్తున్నా ప్రభుత్వం తమను నిర్లక్ష్యంగా చూస్తోందని వీఆర్‌ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నెలకు రూ.6,500 జీతంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. కనీస వేతనం రూ.18 వేలు అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో ఆందోళనకు దిగనున్నారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా వీఆర్‌ఏల అసోసియేషన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని48 మండలాల్లో 3 వేల మంది వీఆర్‌ఏలు విధులు నిర్వర్తిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ గురువారం మండల కార్యాలయాల ఎదుట, 24న ఆర్డీవో కార్యాలయాల ఎదుట, 31న కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా యూనియన్ పిలుపునిచ్చింది.
డిమాండ్లు నెరవేర్చాలి
ప్రభుత్వం వీఆర్‌ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించాలి. నెలకు రూ.18 వేల జీతం చెల్లించాలి. పెన్షన్ సౌకర్యం, వారసత్వపు హక్కు, బీమా సదుపాయం లక్ష రూపాయలకు పెంచడం తదితర డిమాండ్లు నెరవేర్చాలి. తక్షణం ప్రభుత్వం స్పందించి కమిటీ నియమించి వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలి.
–ఎ.జాన్, వీఆర్‌ఏల అసోసియేషన్ జిల్లా ట్రెజరర్
ప్రభుత్వం స్పందించాలి
వీఆర్‌ఏల న్యాయ పరమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. వేతనాలు పెంచి వేలాది మంది వీఆర్‌ఏల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచాలి.
–నరసింహరావు, మండల అధ్యక్షుడు వీఆర్‌ఏల అసోసియేషన్, దెందులూరు