సాక్షి, హైదరాబాద్/లింగోజిగూడ: రాష్ట్రంలో ఎంతో మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకున్న కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి, తక్షణమే తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తూ, రాష్ట్రంలోని 2.5 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పొట్టకొట్టుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
అరకొరగా వచ్చే జీతాలను సైతం మూడు, నాలుగు నెలలకోసారి చెల్లిస్తున్నారని, కొన్ని సార్లు ఆరేడు నెలలైనా జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించలేక అనేక మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. కర్మన్‌ఘాట్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లాల నుంచి వ చ్చిన ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పులి లక్ష్మయ్య, కె.సంతోష్, వినోద్, అరుణ్‌కుమార్, నారాయణ, బిందు తదితరులు మాట్లాడారు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్దికరించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పే–స్కేలు, ఇతర ప్రయోజనాలను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.
మూడేళ్ల సర్విసు పూర్తి కాని ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేసి ఆదుకోవాలని అన్నారు. అలాగే 2023 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏజెన్సీలు అన్యాయం చేస్తున్నాయి..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా, మూడు, నాలుగు నెలలకోసారి ఒకటి, రెండు నెలల జీతాలు చెల్లిస్తున్నారని, మిగిలిన జీతాలను కాంట్రాక్టు ఏజెన్సీలు స్వాహా చేస్తున్నాయని జేఏసీ నేతలు ఆరోపించారు. కొత్త ఏజెన్సీలు వచ్చి అప్పటికే ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయని, రూ.లక్షలు వసూలు చేసి కొత్త వారిని నియమించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత వాళ్లు కొనసాగలంటే మళ్లీ కొత్త ఏజెన్సీలకు భారీ మొత్తంలో లంచాలు ఇవ్వాల్సి వస్తోందన్నారు.
వీఆర్‌ఏల కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు?
వీఆర్‌ఏల క్రమబద్దికరణలో భాగంగా వారిని పెద్ద సంఖ్యలో తమ శాఖకు కేటాయించారని, దాంతో ఇకపై మీరు విధులకు రావాల్సిన అవసరం లేదని.. నాలుగైదు జిల్లాల్లో పశుసంవర్థక శాఖ ఆఫీస్ సబార్డినేట్లకు స్థానిక అధికారులు తేల్చి చెప్పారని ఈ సమావేశానికి హాజరైన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment