గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుడు(వీఆర్‌ఏ) ఉద్యోగాల భర్తీకి వచ్చే నెల రెండో తేదీన నిర్వహించనున్న పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించేది లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ స్పష్టం చేశారు.
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:
గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుడు(వీఆర్‌ఏ) ఉద్యోగాల భర్తీకి వచ్చే నెల రెండో తేదీన నిర్వహించనున్న పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించేది లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు సంబంధించి గురువారం ఆయన ‘న్యూస్‌లైన్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అభ్యర్థులంతా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మధ్య దళారులను ఆశ్రయించవద్దని, కష్టపడి చదివి విజయం సాధించాలని కోరారు. ఈ పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని, 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీఆర్వో, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు వీఆర్‌ఏ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
న్యూస్‌లైన్: జిల్లాలో ఎన్ని వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులు ఎన్ని భర్తీ చేస్తున్నారు? ఎంతమంది పరీక్షలకు హాజరవుతున్నారు..?
జేసీ: జిల్లా వ్యాప్తంగా 78 వీఆర్వో,105 వీఆర్‌ఏ పోస్టులు భర్తీ చేయనున్నాం. వీఆర్వోలకు 70,160 మంది, వీఆర్‌ఏలకు 3,040 మంది పరీక్ష లు రాసేందుకు హాజరుకానున్నారు.
న్యూస్‌లైన్: జిల్లాలో ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి.?
జేసీ: జిల్లావ్యాప్తంగా నాలుగు రెవెన్యూ డివిజన్ కేంద్రాలయిన ఖమ్మం, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెంలలో మొత్తం 161 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 70,160 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఖమ్మంలోని 91 కేంద్రాల్లో 41,060, కొత్తగూడెంలోని 35 కేంద్రాల్లో 13,190 మంది, పాల్వంచలోని 22 కేంద్రాల్లో 9,610 మంది, భద్రాచలంలోని 13 కేంద్రాల్లో 6,300 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.
న్యూస్‌లైన్: వీఆర్‌ఏలకు ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు...అవి ఎక్కడ....?
జేసీ: వీఆర్‌ఏలకు ఖమ్మంలోనే 6 సెంటర్లు ఏర్పాటు చేశాం. వీఆర్వో, వీఆర్‌ఏ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఖమ్మం డివిజన్‌లోనే కేంద్రాలు ఏర్పాటు చేశాం.
న్యూస్‌లైన్: పరీక్షలకు ఎలాంటి నిబంధనలు విధించారు..?
జేసీ: వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. వీటిని అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. జిల్లాలో అన్ని శాఖల అధికారులు ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను అనుమతించం. పరీక్ష కేంద్రాల్లో వీడియో చిత్రీకరణతో పాటు అభ్యర్థుల వేలిముద్రల స్వీకరించనున్నాము. ఒకరికి బదులు మరొకరు హాజరైనా, ఎలాంటి అవకతవకలకు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
న్యూస్‌లైన్: పరీక్షల పరిశీలనకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ?
జేసీ: పరీక్షల నిర్వహణ, పరిశీలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. జిల్లా కో ఆర్డినేటర్‌గా జిల్లా రెవెన్యూ అధికారి, అడిషనల్ కో ఆర్డినేటర్లగా ఆర్డీఓలను నియమించాం. 35 రూట్లను ఏర్పాటు చేశాం. ప్రతీరూట్‌లో లైజన్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెండెంట్‌ను నియమించాం. మొత్తం 2,933 మంది ఇన్విజిలేటర్లను నియమించాం. ప్రశ్నా పత్రాలను జిల్లా ఖజానా కార్యాలయంలో భద్రపరిచాం. ఒకటో తేదీ రాత్రి డివిజన్ కేంద్రాలకు తరలిస్తాం.
న్యూస్‌లైన్: అభ్యర్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించనున్నారు.?
జేసీ: పరీక్షలకుహాజరయ్యే అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల్లో మంచి నీరు, మెడికల్ కిట్లతో పాటు విద్యుత్ సౌకర్యం, 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నాం.
న్యూస్‌లైన్: ఎలాంటి బందోబస్తు చర్యలు తీసుకున్నారు..?
జేసీ: జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాం. ఒక్కో కేంద్రం వద్ద ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశాం. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడానికి వీల్లేదు. పెన్సిల్‌తో రాస్తే మార్కులు పడవు. బాల్‌పెన్‌తో మాత్రమే పరీక్ష రాయాలి.
న్యూస్‌లైన్: ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు అభ్యర్థుల నుంచి దళారీలు డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయం మీ దృష్టికి వచ్చిందా?
జేసీ: ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా ఇలాంటి అపోహలు సహజమే. అయితే, అభ్యర్థులు ఎవరి మాటలూ వినవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి కానీ డబ్బులతో కొనుక్కుంటే రావు. అలా ఎవరైనా డబ్బులు ఇచ్చినా, తీసుకున్నా చట్టరీత్యా నేరం. కాబట్టి అభ్యర్థులంతా కష్టపడి చదివి సఫలీకృతులు కావాలని జిల్లా యంత్రాంగం తరఫున కోరుకుంటున్నాం.