వయోజన విద్యపై నిర్లక్ష్య నీడ | Carefree shadow on adult education | Sakshi
Sakshi News home page

వయోజన విద్యపై నిర్లక్ష్య నీడ

Published Sat, Jan 18 2014 5:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

Carefree shadow on adult education

గిద్దలూరు, న్యూస్‌లైన్: వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన సాక్షర భారత్ కార్యక్రమం ప్రభుత్వ నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. జిల్లాలోని 2082 మంది గ్రామ కోఆర్డినేటర్లు, 56 మంది మండల కోఆర్డినేటర్లు నెలల తరబడి వేతనాలందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలపై అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇదిగో..ఈవారం వస్తున్నాయని చెబుతున్నారు తప్ప కార్యరూపం దాల్చడం లేదని కోఆర్డినేటర్లు వాపోతున్నారు. జిల్లాలోని వివిధ స్థాయిల్లో ఉన్న కోఆర్డినేటర్లు ఎవరికీ వేతనాలు అందకపోవడంతో వీటి ప్రభావం వయోజన విద్యా కేంద్రాలపై పడుతోంది.
 
 వివిధ స్థాయిల్లో...
 వయోజనులకు అక్షరజ్ఞానం నేర్పించేందుకు 2009 లో సాక్షరభారత్ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని వయోజన విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డెరైక్టర్ సాక్షర భారత్ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. డివిజన్ కోఆర్డినేటర్లు, మండల కోఆర్డినేటర్లు, గ్రామ కోఆర్డినేటర్లు వారి పరిధిలో నిర్వహణ బాధ్యతలు చేపట్టి పథకాన్ని నడిపిస్తున్నారు. గ్రామ స్థాయిలో ఇద్దరు గ్రామ కోర్డినేటర్లను నియమించారు. వీరు వయోజన విద్యాకేంద్రాలను ఏర్పాటు చేసి వయోజనులను అక్షరాస్యులుగా చేయాల్సి ఉంది. గ్రామ కోఆర్డినేటరుకు నెలకు రూ.2 వేలు, మండల కోఆర్డినేటరుకు రూ.6 వేలుగా వేతనాన్ని నిర్ణయించారు.
 
 అక్షరాలు నేర్పడమే లక్ష్యంగా...
 4 సాక్షర భారత్ కోఆర్డినేటర్లు స్థానికంగా అందుబాటులో ఉన్న గ్రంథాలయాలు, పాఠశాలలు వంటి ప్రదేశాల్లో 15 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వారిని ఎంపిక చేసి కనీసం 30 మందికి తగ్గకుండా సమీకరించి వారికి అక్షరాలు నేర్పించాలి.
 
 4 పుస్తకాలు, పత్రికలు చదివేలా వారిని తీర్చిదిద్దాలి. నేషనల్ ఓపెన్ స్కూల్ వారు దశలవారీగా వీరికి పరీక్షలు నిర్వహిస్తారు.
 
 జిల్లాలో పరిస్థితి ఇదీ...
 ప్రస్తుతం జిల్లాలో మొత్తం 2,082 వయోజన విద్యా కేంద్రాలున్నాయి. వీటిలో 62,460 మంది వయోజనులు అక్షరాలు నేర్చుకుంటున్నారు. ఇలా జిల్లాలో నాలుగు సంవత్సరాలుగా వయోజనులు అక్షరాస్యులుగా మారుతున్నారు.  గిద్దలూరు నియోజకవర్గంలో 94 పంచాయతీల్లో 188 మంది కోఆర్డినేటర్లు పనిచేస్తుండగా, వీరికి వేతనాలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
 15 నెలలుగా అందని వేతనాలు:
 సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ఇచ్చే కొద్దిపాటి వేతనాలు కూడా సకాలంలో అందించడం లేదు. 2012 సెప్టెంబర్ వరకు సజావుగా వేతనాలందాయి. ఆ తరువాత ఆ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వేతనాలు విడుదల చేసినా..వాటిని కోఆర్డినేటర్లకు ఇవ్వలేదు. ఆ మూడు నెలల వేతనాలకు తోడు 2013 ఏడాది మొత్తం జీతాన్ని కూడా విడుదల చేయలేదు. మొత్తం మీద 15 నెలలుగా వేతనాలందక కోఆర్డినేటర్లు అవస్థపడుతున్నారు. జీతం లేకపోవడంతో వారు కూడా చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. కొన్ని కేంద్రాలు ఇప్పటికే మూతపడగా..మరికొన్ని నామమాత్రంగా నడుస్తున్నాయి. ఫలితంగా పథకం లక్ష్యం నీరుగారుతోంది. వేతనాల చెల్లింపులపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.  
 
 వేతనాల్లో జాప్యం వాస్తవమే..
  సి.వీరభద్రరావు, డిప్యూటీ డెరైక్టర్
 కోఆర్డినేటర్లకు వేతనాలు జాప్యమైన మాట వాస్తవమే. 2012 డిసెంబరు నెల వరకు నిధులు విడుదలయ్యాయి. 2013 సంవత్సరానికి రావాల్సిన వేతనాల నిధులు మరో 10 రోజుల్లో అన్ని మండలాలకు విడుదల చేస్తాం. గతంలో మూడు నెలలకు విడుదలైన వేతనాలు ఆయా మండలాల అధికారులు ఇవ్వాల్సి ఉంది. వాటిని త్వరలో ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement