దాహం కేక!
► తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
► బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన
► రెండు గంటలపాటు నిలచిన వాహనాల రాకపోకలు
► అడ్డుకోబోయిన పోలీసులతో స్థానికుల వాగ్వాదం
► ఎమ్మెల్యే రావాలంటూ నినాదాలు
► సమస్య పరిష్కరించాలని డిమాండ్
► ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ హామీతో ఆందోళన విరమణ
ఎన్నికల వేళ ఇంటింటికీ తిరిగి రెండు చేతులు జోడించి నమస్కరించే ప్రజాప్రతి నిధులు.. అవసరం తీరాక ఓట్లేసి గెలిపించిన జనం గోడు పట్టించుకోవడం లేదని మహిళలు మండిపడ్డారు. వారం రోజులుగా తాగునీరు లేక అల్లాడుతున్నా తమ సమస్య పట్టించుకున్న నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రం రాచర్లకు చెందిన మహిళలు స్థానిక బస్టాండ్ సెంటర్‌లో శనివారం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. రెండు గంటలపాటు రోడ్డుపై బైటాయించారు. ఎమ్మెల్యే వచ్చి, నీటి సమస్య పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
రాచర్ల : తమ గ్రామానికి గడచిన ఆరు రోజులుగా తాగునీటి ట్యాంకర్ రాక, ఇబ్బందులు పడుతున్న రాచర్ల వాసులు శనివారం పెద్ద సంఖ్యలో స్థానిక బస్టాండ్ సెంటర్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ధర్నా చేస్తున్నప్పటికీ ఆర్‌డబ్ల్యూఎస్, మండల పరిషత్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడ చూడలేదు. దీంతో ఆగ్రహించిన మహిళలు ధర్నాను మరింత ఉద్ధృతం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి, ధర్నా చేస్తున్న మహిళలను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. తాగునీటి సమస్య పరిష్కారం చేసే వరకూ ధర్నాను కొనసాగిస్తామని మహిళలు ఆందోళనకు అడ్డుకుంటున్న పోలీసులకు తేల్చిచెప్పారు. ఆందోళన కారణంగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.
వచ్చే ట్యాంకర్లను ఆపేశారు..: ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బందం శకుంతల మాట్లాడుతూ రాచర్ల పంచాయతీతో 5,200 మంది జనాభా ఉండగా అధికారులు 16 వాటర్ ట్యాంకులు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అవి సరిపోక తాము మరో 15 ట్యాంకులు సరఫరా చేయిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వర్గీయులకు ఏజెన్సీ ఇచ్చేందుకు ఆ 15 ట్యాంకుల నీటి సరఫరా నిలిపివేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అనూష చెప్పడంతో సరఫరా ఆపేశామన్నారు. దీంతో గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా మారి, మహిళలు రోడ్డెక్కాల్సి వచ్చిందని సర్పంచ్ పేర్కొన్నారు. నాలుగు నెలలుగా తాగునీటి సరఫరా చేసిన బిల్లులు ఇంత వరకూ మంజూరు చేయలేదని, రూ.10 లక్షల బిల్లులు రావాల్సి ఉందని సర్పంచ్ తెలిపారు.
తాగునీటి సమస్య పరిష్కరిస్తాం..: డీఈ
రాచర్ల గ్రామానికి అదనంగా 16 వాటర్ ట్యాంకులు మంజూరు చేసి తాగునీటి సమస్య పరిష్కారిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆందోళన విషయం తెలుసుకుని బస్టాండ్ సెంటర్‌కు వచ్చిన ఆయన మాట్లాడుతూ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అనూష, యూఆర్‌డీ షేక్ మస్తాన్‌వలి, పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో పర్యటిస్తారని, వాటర్ ట్యాంకులు నిలిపేందుకు స్థలాలను కేటాయించి ఆ స్థలంలో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే తాగునీటి సమస్య పరిష్కరిస్తామని డీఈ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.