ఆలయంలోని కుళాయి వద్ద నీటిని పట్టుకుంటున్న తాటిపాడు గ్రామస్తులు
అటు అధికారులు.. ఇటు ‘స్థానిక’ ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో నందికొట్కూరు నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీవ్రమైంది. వేలకు వేల విద్యుత్ బిల్లులు చెల్లించని పంచాయతీలకు విద్యుత్ అధికారుల ఆదేశంతో సిబ్బంది తాగునీటి పథకాలకు విద్యుత్‌ను నిలిపివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక వచ్చిందే అరకొర నిధులతో విద్యుత్ బిల్లులు చెల్లిస్తే గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు.
జూపాడుబంగ్లా: నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడ్తూరు, నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పగిడ్యాల మండలాల పరిధిలోని గ్రామపంచాయతీల్లో విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జూపాడుబంగ్లా మండలంలోని 12 పంచాయతీల్లో రూ.3.29కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోవటంతో వాటిని చెల్లించాలని కొంత కాలంగా విద్యుత్‌శాఖ అధికారులు సర్పంచ్‌లను కోరారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో పి.లింగాపురం మినహా 11 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు రూ.10.80 లక్షలు చెల్లించారు.
గ్రామాలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావటంతో వాటిల్లోంచి విద్యుత్ బకాయిలు చెల్లించాలని విద్యుత్‌శాఖ అధికారులు సర్పంచ్‌లను కోరుతూ వస్తున్నా.. ఇదివరకే రెండు పర్యాయాలు చెల్లించామని, వచ్చిన కాస్త నిధులను కూడా విద్యుత్ బిల్లులకు చెల్లిస్తే గ్రామాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల విద్యుత్‌బకాయిలు వసూలు చేయకపోతే ఇంక్రిమెంట్లు కట్ చేస్తామని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించడంతో ఆ శాఖ సిబ్బంది చేసేదేమీ లేక బకాయిలు చెల్లించని గ్రామపంచాయతీల్లోని తాగునీటి పథకాలకు సరఫరాను వారం క్రితం నిలిపేశారు. దీంతో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది.
మండలంలో రూ.3.29కోట్ల బకాయిలు
మండలంలోని పారుమంచాల గ్రామంలో రూ.22,99,781లు,తూడిచెర్ల రూ.27,93,431 లు, భాస్కరాపురం రూ.7,75,465లు, మండ్లెం రూ.28,61,511లు, తంగడంచ రూ.19,24, 493లు, తాటిపాడు రూ.23,03,679లు, తర్తూరు రూ.23,00,049, పోతులపాడు రూ.11,15,325, తరిగోపుల రూ.28,04,711 లు, 80బన్నూరు రూ.2181,446లు,పి.లింగాపురం రూ.5,89,153 లు, జూపాడుబంగ్లా రూ.1,10,55,518లు, చొప్పున విద్యుత్ బకాయిలు ఉన్నాయి.
చెల్లించింది రూ.10.82లక్షలు మాత్రమే
సర్పంచ్‌లు ఇప్పటిదాకా రెండు విడతల్లో కేవలం రూ.10,82,000ల విద్యుత్ బకాయిలను మాత్రమే చెల్లించారు. వీరిలో తంగడంచ, జూపాడుబంగ్లా, మండ్లెం గ్రామాల సర్పంచ్‌లు విద్యుత్‌బకాయిలను చెల్లించటంతో ఆయా గ్రామాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయలేదు. పి.లింగాపురం గ్రామ సర్పంచ్ ఇప్పటిదాకా పైసా విద్యుత్ బకాయిని చెల్లించలేదని ఈఓపీఆర్డీ మహమ్మద్‌హనీఫ్ తెలిపారు.
పంచాయతీ నిధులన్నీ పక్కదారి
గ్రామపంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనా వాటిని జిల్లా పంచాయతీరాజ్‌శాఖ అధికారులు సర్పంచ్‌ల ప్రమేయం లేకుండానే కంప్యూటర్లు, డస్ట్ బిన్లు, ట్రైసైకిళ్లు, పంచాయతీ కార్యదర్శులకు సెల్‌ఫోన్ల కొనుగోలుకు వెచ్చించారు. వాటన్నింటికి నిధులు పోనూ మిగిలినవి గ్రామాల్లో తాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, రహదారుల నిర్మాణానికి వెచ్చించారు. ప్రస్తుతం వాటిల్లోంచి విద్యుత్‌బిల్లులు చెల్లించేందుకు సరిపడా నిధుల్లేవని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment